ఏకాత్మ మానవ సిద్ధాంతంతోనే సమస్యల శాశ్వత పరిష్కారం
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన అయిన అంత్యోదయ భారత్‌కు ఎంతో అవసరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జనవరి 23, 24న రెండు రోజులు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన పునఃస్మరణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కృష్ణదేవరాయనగర్ ప్రాంగణంలో 60 ఏళ్ల నాటి సభ విశేషాల ప్రదర్శనను బిజెపి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రారంభించారు. 1965లో జరిగిన జనసంఘ్ 12వ మహాసభ విశేషాల పుస్తకాన్ని, జాగృతి 60 వసంతాల సంచికను ఆవిష్కరించారు. నాటి జాతీయ మహాసభలో పాల్గొన్న నాయకులను, వారి వారసులను సత్కరించారు.
1965 జనవరి 23న విజయవాడలో జనసంఘ్ 12వ సభలో ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన ప్రాంగణంలో.. 60 ఏళ్ల తర్వాత పునఃస్మరణ సదస్సులో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని కిషన్ రెడ్డి తెలిపారు. ‘దోపిడీ రహిత సమాజం కావాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని దీన్‌దయాళ్ కోరుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక.. బోస్, లాలాజీ, గాంధీజీ, అరబిందో, తిలక్ లాంటి మేధావుల ఆలోచనా విధానాలను కాదని.. వ్యక్తివాదం, సోషలిజం, కమ్యూనిజం లాంటి ఆచరణ సాధ్యం కాని పాశ్చాత్య సిద్ధాంతాలను మనపై బలంగా రుద్దారు. ఇప్పుడు కూడా ప్రపంచానికి తమ సిద్ధాంతాలే అవసరమని.. కొన్ని దేశాలు క్యాపిటలిజం, మరికొన్ని దేశాలు కమ్యూనిజం వైపు నడుస్తూ గొడవలు పడుతున్నాయి. మన సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కావల్సిన అద్భుతమైన ఏకాత్మ మానవతా సిద్ధాంతాన్ని దీన్‌దయాళ్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ దాన్ని అనుసరిస్తూ దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.’ అని పేర్కొన్నారు.
బీఎల్ సంతోష్ ప్రసంగిస్తూ.. ‘భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు కొత్త రూపమే ఏకాత్మ మానవ దర్శనం. ఇది దేశ సమగ్ర స్వరూపానికి ఒక మూల సిద్ధాంతం. పాశ్చాత్య భావదాస్యం నుంచి బయటకు వస్తే వికసిత్ భారత్ చూడగలుగుతాం. ప్రతి ఒక్కరూ వారి ధర్మాలకు కట్టుబడి పనిచేసి ప్రజా సంక్షేమం కోసం ముందుకు రావాలి. గాంధీజీ పేర్కొన్న రామరాజ్యం, సర్వోదయ, అంత్యోదయ కలిపి నేటి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తోంది.’ అని అన్నారు. బిజెపి జాతీయ నాయకుడు పి. మురళీధర్ రావు ప్రసంగిస్తూ.. ‘ప్రపంచంలోని భారతీయుల రక్షణ మన ప్రభుత్వ బాధ్యత. మోదీ ప్రభుత్వం వచ్చాక రక్షణ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ప్రజలకు నైపుణ్యాలు పెంచితే దేశం నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది.’ అని అన్నారు. మరో జాతీయ నాయకుడు రాం మాధవ్ ప్రసంగిస్తూ.. ‘ప్రపంచంలో సంక్షోభం నడుస్తోంది. ఈ తరుణంలో భారత్ నూతన దిశను ఇవ్వబోతోంది. వికసిత్ భారత్ లక్ష్యానికి దీన్‌దయాళ్ సిద్ధాంతం అందించారు. ఆనాడే విదేశీ విధానంపైనా వివరించారు.’ అని అన్నారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ప్రసంగిస్తూ.. ‘ప్రపంచవ్యాప్త సమస్యలకు ఏకాత్మ మానవతా వాదమే పరిష్కారమని దీన్‌దయాళ్ పేర్కొన్నారు. రెండున్నరేళ్లు ఈ అంశాలపై చర్చ జరిగేలా ఆయన శ్రమించారు. 1968లో దీన్‌దయాళ్ హత్య తర్వాత జాతీయవాద సంస్థలు ఈ వాదాన్ని అధ్యయనం చేస్తూ ముందుకు తెచ్చాయి. వాజ్‌పేయీ, మోదీ ప్రభుత్వాలు ఈ లక్ష్యాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాయి.’ అని అన్నారు.
ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, రాం మాధవ్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేశ్, పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

