Vivekananda NRR

వివేకానంద బోధనలు నేటికీ అనుసరణీయమే!

Vivekananda NRRయువత స్వామి వివేకానంద ఆదర్శాలు, బోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పం తీసుకోవాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సూచించారు. ఆయన ప్రసంగాలు, ఆదర్శాలు, చైతన్యం, సద్గుణాలు ఇప్పటికీ జాతీయ అవగాహన పట్ల ప్రేరణనిస్తూనే ఉన్నాయన్నారు. స్వామి వివేకానంద బోధనలు నేటికీ అనుసరణీయమే అని తెలిపారు. స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా జనవరి 12న సికింద్రాబాద్ లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. అమెరికా చికాగో ప్రపంచ మతాల సమ్మేళనంలో చారిత్రక ప్రసంగం చేయడానికి ముందు స్వామి వివేకానంద ఇక్కడ ఒక రాత్రి బస చేశారు. మహబూబ్ కాలేజీలో ప్రసంగం అనంతరం, ఈ వీధిలోని ఒక భక్తుని నివాసంలో స్వామిజీ విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల ఈ ప్రాంతం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంతరించుకుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ASMITA యోగాసన జోనల్ లీగ్ 2025–26 (ఖేలో ఇండియా), సౌత్ జోన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో రాంచందర్ రావుకు స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు 2026ను మేధావుల ఫోరం ప్రదానం చేసింది.

ఆయా కార్యక్రమాల్లో ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ ‘‘యుద్ధాలు, సంఘర్షణలు, అస్థిరతతో నిండిన నేటి ప్రపంచంలో వివేకానంద బోధించిన శాంతి, ప్రపంచ సామరస్యం సందేశం మరింత అవసరం. ప్రపంచ అశాంతికి శాశ్వత పరిష్కారం శాంతియే, ఆ మార్గాన్ని స్వామి వివేకానంద స్పష్టంగా చూపించారు. కమ్యూనిజం వంటి సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా పతనమయ్యాయి. ఆధ్యాత్మిక శక్తి, సామరస్యం, సార్వత్రిక సోదరభావంపై ఆధారపడిన స్వామి వివేకానందతత్వం మాత్రం నేటికీ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తోంది. యువత స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడవాలి. వారి ఆదర్శాలను వ్యక్తిగత, ప్రజాజీవితాల్లో అనుసరించాలి. “లేచి నిలబడండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగకండి” అనే వివేకానంద ప్రసిద్ధ నినాదం నేటి యువతకు మార్గదర్శక సూత్రంగా ఉండాలి. వివేకానంద బోధనలను అనుసరించడం ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుంది. 

యోగాసనాల ద్వారా పిల్లలు శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా, ఏకాగ్రత, సమతుల్యత, క్రమశిక్షణ, మానసిక బలం వంటి లక్షణాలను కూడా అలవర్చుకుంటున్నారు. ఇవి వ్యక్తిత్వ నిర్మాణానికి, జాతి నిర్మాణానికి అత్యంత అవసరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగాకు అత్యున్నత ప్రాధాన్యం లభించింది. మోదీ ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితంగానే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నారు. ఫలితంగా భారతదేశపు ప్రాచీన వారసత్వానికి గ్లోబల్ గుర్తింపు లభించింది. యోగాను, క్రీడలను జీవన విధానంగా స్వీకరించి, ఆరోగ్యవంతమైన, బలమైన భారత్ నిర్మాణానికి యువత తమ వంతు సహకారం అందించాలి.