దేవాలయ భూములు ఆక్రమణ.. హిందూ పండుగలపై ఆంక్షలు!
హిందూ దేవాలయాలపై దాడులను నివారించడంలో విఫలమవుతోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ సర్కార్ భూములను ఆక్రమిస్తోందని, హిందూ పండుగల పైన ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం భారతదేశానికి ఆత్మ అని, భారతదేశ ఆత్మ మీద ఎవరైనా దాడి చేస్తే బిజెపి కార్యకర్తలు సరైన రీతిలో బదులు ఇస్తారని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 4న మహబూబ్‌నగర్ లో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన నితిన్ నబీన్‌కు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో గిరిజన సంప్రదాయ నృత్యాలతో తనకు స్వాగతం పలకడంపై నితిన్ నబీన్ ఆనందం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ సభలో ప్రసంగిస్తూ జోగులాంబ అమ్మవారిని, మైసిగండి మైసమ్మ అమ్మవారిని, ఉమా మహేశ్వర స్వామిని స్మరించుకున్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసి ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషిని ప్రశంసించారు. పటేల్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలు నిజాం పాలన నుంచి విముక్తి పొందారని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి పద్మ పురస్కారాలు పొందిన మహానుభావులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రతిభను గుర్తించి ఈ గౌరవం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో నితిన్ నబీన్ ప్రసంగిస్తూ.. ”తెలంగాణ రాజకీయాలు ఒక అత్యంత కీలక మలుపు తీసుకున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంతుష్టీకరణ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను అవమానిస్తూ, సనాతన ధర్మంపై నిరంతరం దాడులు చేస్తున్నారు. ‘కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్’ అనే ప్రమాదకరమైన నినాదాలను వినిపించడం ద్వారా, తమ అసలు రంగు బయటపెట్టుకున్నారు. దిగజారుడు రాజకీయాలతో ఓ వర్గాన్ని సంతృప్తిపరచడానికి మాత్రమే వారు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వక్ఫ్ బోర్డులను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం ఓట్ల రాజకీయాల కోసం దేశంలోనే అత్యంత సంపన్నమైన వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోత విధిస్తోంది. ఈ అన్యాయానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పలుచోట్ల హిందూ దేవాలయాలపై బహిరంగంగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం బాధాకరం. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములను ఆక్రమిస్తున్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను ఏమాత్రం సహించబోం. బిజెపి కార్యకర్తలు మౌనంగా ఉండరు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బిజెపి కార్యకర్తలు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ భవిష్యత్తు కోసం, సంస్కృతి–సంప్రదాయాల రక్షణ కోసం, న్యాయం–సమానత్వం కోసం బిజెపికి మద్దతు ఇవ్వాలి. తెలంగాణలో చంగిచర్లలో, ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన విధ్వంసం మళ్లీ జరగకుండా అడ్డుకోవాలి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం, లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది, అయితే వాటిని అమలు చేయలేదు. బిజెపి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు ఈ అన్యాయాలను గుర్తు చేస్తూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన జవాబు చెప్పే విధంగా ప్రచారం చేయాలి. రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఏడాది ఎకరానికి రూ.15 వేలు చొప్పున, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోసం చేసింది. ఈ మోసానికి తగిన బుద్ధి చెప్పడం అవసరం. తెలంగాణ ప్రజలకు బిజెపి ద్వారానే న్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని బిజెపి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్ల పాలన, ల్యాండ్ మాఫియా కొనసాగింది. ప్రతి చోటా పన్నుల భారం మోపారు. రాష్ట్రంలో కమీషన్ల పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఈ అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బిజెపిని గెలిపించాలి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం హైదరాబాద్–పూణే, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై వంటి హై-స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణం చేపడుతోంది. ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో, మెగా టెక్స్ టైల్, ఇండస్ట్రియల్ కారిడార్లు తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35 శాతానికి పైగా ఓటు శాతం సాధించింది. ఈసారి ప్రతి బూత్‌లో 50% ఓట్లు సాధించడం లక్ష్యంగా కార్యకర్తలు కృషిచేయాలి. లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలు నరేంద్ర మోదీ పాలన పట్ల మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో.. మహారాష్ట్ర, కేరళ, తిరువనంతపురం, గోవా, అరుణాచల్, చండీగఢ్, బీహార్.. ఇలా ప్రతిచోట బిజెపి అభ్యర్థులు విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో బిజెపి కార్యకర్తలు, ప్రజల మధ్యకు వెళ్లి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని మరింత సుస్థిరం చేయాలి. స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్లి బిజెపిని గెలిపించేలా ప్రజల మద్దతు కూడగట్టాలి. యువ నాయకులను ప్రోత్సహించాలి. తెలంగాణను రక్షించడానికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కృషి చేయాలి. ఇది ప్రతి కార్యకర్త బాధ్యత. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు బిజెపిని గెలిపించేలా కృషి చేయాలి. ఇదే తెలంగాణలో బిజెపి విజయానికి సంకల్పం.” అని అన్నారు.
కాంగ్రెస్ గెలిస్తే పన్నుల భారం
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే, ప్రధానమంత్రితో స్వయంగా చర్చించి అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. బిజెపి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే పన్నులు పెంచి భారం మోపుతారని, బీఆర్ఎస్‌ను గెలిపిస్తే మళ్లీ దోపిడీ చేస్తారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల సభలో ”కాంగ్రెస్ అంటూ ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్” అని మత రాజకీయాలు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో అనేక దేవాలయాలను విచ్చలవిడిగా కూల్చివేస్తున్న మతోన్మాదులను పట్టుకోకుండా, వారిపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. మతోన్మాదులకు ఆసరా కల్పిస్తూ వదిలేస్తోందని అన్నారు. “రాష్ట్రంలో దేవాలయాలను కూల్చేవాళ్లను, సనాతన ధర్మాన్ని, హిందువుల మనోభావాలను కించపర్చేవారిని మేం అడ్డుకుంటున్నాం. కానీ బిజెపి మాట్లాడుతుంటే.. మతోన్మాదం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి మతోన్మాదులకు ఆసరా కల్పిస్తున్న కాంగ్రెస్సే మతోన్మాద పార్టీ. కాంగ్రెస్ సభ ఉంటే చాలు.. బిజెపి కార్యకర్తలను ముందస్తు అరెస్టు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. బిజెపిని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బిజెపి అంటే కాంగ్రెస్ భయపడుతోంది. 90 శాతం మున్సిపాలిటీలు గెలుస్తామంటూ కాంగ్రెస్ నాయకులు దురహంకారంతో మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో “సారు.. కారు.. పదహారు..” అంటూ మాట్లాడింది. అలాంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఎక్కడుందో చూస్తున్నాం. అదే అహంకారం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 8 ఎంపీ సీట్లలో గెలిచింది. కానీ బీఆర్ఎస్ గెలిచింది గుండుసున్నా. తెలంగాణలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి రెండు సీట్లలో గెలిచింది. బీఆర్ఎస్‌కు అభ్యర్థులే దొరకలేదు. కాంగ్రెస్‌ను బిజెపి చిత్తుగా ఓడించింది. మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిజెపి 5 వేల స్థానాల్లో పోటీ చేస్తే.. సుమారు వెయ్యి మంది వరకు సర్పంచులు గెలిచాం. 10 వేల మంది వార్డు మెంబర్లు, 1200 మంది ఉప సర్పంచులను బిజెపి గెలిచింది. బిజెపి బలోపేతమవుతోందనడానికి ఇదే నిదర్శనం.
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి అత్యధిక సీట్లలో గెలుస్తుంది. బిజెపికి మంచి ఫలితాలు రానున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమిచ్చారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో మహబూబ్‌నగర్‌కు, నల్లగొండకు ఏమిచ్చారు..? కేంద్ర బడ్జెట్‌లో జిల్లాలు, రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు ఉండవు. ఈరోజు రూ.10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకు కేటాయిస్తే, అందులో తెలంగాణ కూడా భాగస్వామ్యమే. ఈరోజు తెలంగాణకు రూ.5 వేల కోట్లకు పైగా నిధులు రైల్వేలకు కేటాయించింది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి. అత్యాచారాలు, దొంగతనాలు పెరిగాయి. చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదు. రాష్ట్రంలో హోంమంత్రి, మున్సిపల్ పరిపాలన ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నాయి. ఆ శాఖల్లో ముఖ్యమంత్రే విఫలమయినప్పుడు.. ఇంకా తెలంగాణ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారు? నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ఇంటింటికి చేరవేసి బిజెపిని గెలిపించాలని కార్యకర్తలను అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీల్లో బిజెపియే గెలుస్తుంది. రానున్న 2028లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం, బిజెపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం.” అని అన్నారు.
పాలమూరుకు కేసీఆర్, రేవంత్ ఏం ఒరగబెట్టారు?
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ”తెలంగాణ ఉద్యమ సమయంలో కృష్ణమ్మ ఆశీస్సులు తీసుకొని పాలమూరు నుండే తెలంగాణ పోరుయాత్రను ప్రారంభించుకున్నాం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. అదేవిధంగా, ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో నితిన్ నబీన్ పాలమూరు గడ్డమీద బిజెపి విజయ సంకల్ప సమ్మేళనానికి శంఖారావం పూరిస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గతంలో రెండు సార్లు బిజెపి గెలిచింది. ఇంతకుముందు పాలమూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా బిజెపి గెలిచింది. పక్కనున్న నారాయణపేట్‌లో మున్సిపల్ చైర్మన్‌గా గెలిచింది. మక్తల్‌లో కూడా మున్సిపల్ చైర్మన్‌గా బిజెపి గెలిచింది. అమన్‌గల్‌లో కూడా స్వతంత్రంగా బిజెపి గెలిచింది. ఇప్పటికే పాలమూరు నుంచి అనేక మంది యువత, మేధావులు, ప్రజలు పెద్దఎత్తున పార్టీలో చేరారు. కార్యకర్తల కృషితో ఇక్కడ మున్సిపాలిటీల్లో బిజెపి గెలుస్తుందని విశ్వసిస్తున్నాను.
యువతకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రైతులకు, రైతు కూలీలకు, బీసీ వర్గాలకు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహబూబ్‌నగర్‌కు అన్యాయం జరిగింది. గతంలో కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్లు దాటింది, కానీ ఏం ఒరగబెట్టలేదు. రేవంత్ మాటలు కోటలు దాటతాయి, కాని పనులు పాలమూరు జిల్లాకు రావు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడింది. తాను ముఖ్యమంత్రి అయ్యాక అవినీతికి పాల్పడిన కేసీఆర్ ప్రభుత్వంలోని దోషులను చర్లపల్లి జైలుకు పంపిస్తానని చెప్పారు. మరి రెండేళ్లు దాటినా అవినీతి నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే కేసీఆర్ – రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరాయి కాబట్టి. అందుకే రేవంత్ ప్రభుత్వం వీళ్లపై చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్-బీఆర్ఎస్ దొందు దొందే.. మా ప్రభుత్వం కొట్టినట్లు చేస్తుంది.. మీరు ఏడ్చినట్లు చేయండి అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ భయానకంగా జరిగింది. భార్యభర్తలు మాట్లాడుకున్న విషయాలను కూడా టాప్ చేసి విన్నారు. సినీ హీరోయిన్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్‌లో గమనించారు. విలేకరులు, మీడియా మేనేజ్‌మెంట్ ఫోన్లను కూడా టాప్ చేసారు. చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఫోన్లలో సంభాషించిన మాటలను విన్నారు. పోలీసులతో పాటు బిజెపి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారి మాటలు విన్నారు. గత దుబ్బాక, మునుగోడు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా, చట్టవ్యతిరేకంగా బిజెపి నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసింది. బిజెపి ఆఫీసులో పనిచేసే క్లర్క్ ఫోన్‌ను కూడా కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సీరియల్‌గా సాగదీయడం తప్ప, అసలు దోషులపై చర్యలు తీసుకోవడం లేదు. అందుకే, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, అవినీతిరహిత పాలన రావాలంటే, నీతి, నిజాయితీతో సమర్థ పాలన రావాలంటే.. తెలంగాణలో బిజెపి జెండా ఎగరాలి. దీనిలో భాగంగానే, మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక అడుగు వేశారు. 8 ఎంపీ సీట్లలో బిజెపిని గెలిపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరో అడుగు ముందుకేసి బిజెపిని గెలిపించాలని కోరుతున్నాను. తెలంగాణలో అవినీతి, అక్రమాల, మాటల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాల్సిన అవసరం ఉంది.” అని అన్నారు.
కేంద్ర నిధులతోనే పాలమూరు అభివృద్ధి
బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నియామకం తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు వచ్చి, పాలమూరు జిల్లాకు విచ్చేసినందుకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె. అరుణ ధన్యవాదాలు తెలిపారు. ”మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించాలని, కాషాయ జెండా ఎగురవేయడానికి కార్యకర్తలలో స్పూర్తి నింపేందుకు పాలమూరు జిల్లాకు జాతీయ అధ్యక్షుడు వచ్చారు. ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు. మోదీ నాయకత్వంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరిగితే వికసిత్ భారత్ సాధ్యం అని ముందుకు సాగుతున్నారు. ఉపాధితో పాటు అభివృద్ధి కావాలని వీబీ జీ రామ్ జీ పథకం తీసుకొచ్చారు. మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా కేంద్ర నిధుల ద్వారానే జరుగుతుంది. ఎయిర్ పోర్ట్ లకు దీటుగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకరిస్తున్నారు. అమృత్ పథకం కింద మహబూబ్‌నగర్ పట్టణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. వేల కోట్ల రూపాయలతో పాలమూరు చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. బైపాస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. పట్టణంలో ROB ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. బోయపల్లి, తిమ్మసానిపల్లి, వీరన్నపేట, మోతినగర్‌లలో ROB లు, లిమిటెడ్ హైట్ సబ్ వే నిర్మాణం జరుగుతోంది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతంతో పేదలకు సంక్షేమం అందిస్తూ.. పేదరికాన్ని నిర్మూలిస్తూ.. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా మోదీని మళ్ళీ ప్రధాని చేయాలని పాలమూరు ప్రజలు ఎంపీగా నన్ను గెలిపించారు. ఈ వేదికపై నుండి ప్రజలను నేను ఒకటే కోరుతున్నా. మున్సిపాలిటీ ఎన్నికలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించండి.. ప్రతి మున్సిపాలిటీపై బిజెపి జెండా ఎగురవేయండి.. ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి పాలమూరు జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే దిశగా మీతో అండగా ఉంటానని మాటిస్తున్నాను.” అని డి.కె. అరుణ అన్నారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్‌ను శాలువా, మెమొంటోతో సత్కరించి, వారి సతీమణి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన గద్వాల పట్టు చీరను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ఆశిష్ షెలార్, జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మా ఎంపీ పోతుగంటి రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతం రావు, వేముల అశోక్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

