MannKiBaat

ఓటర్లుగా మారడాన్ని ఉత్సవంగా జరుపుకోవాలి

జనవరి 25న ప్రసారమైన ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

18 ఏళ్లు నిండి ఓటరుగా మారడాన్ని జీవితంలో ఒక సాధారణ మైలురాయిగా పరిగణిస్తాం. అయితే ఈ సందర్భం వాస్తవానికి ఏ భారతీయుడి జీవితంలోనైనా ఒక పెద్ద మైలురాయి. మన దేశంలో ఓటర్లుగా మారడాన్ని ఉత్సవంగా జరుపుకోవడం చాలా ముఖ్యం. పుట్టినరోజును జరుపుకునే విధంగానే, యువతీయువకులు మొదటిసారి ఓటర్లుగా మారినప్పుడు వారిని అభినందించడానికి,  స్వీట్లు పంపిణీ చేయడానికి మొత్తం నివాస ప్రాంతం, గ్రామం లేదా నగరం కలిసి రావాలి. ఇది ఓటు వేయడంపై అవగాహనను పెంచుతుంది. ఓటరుగా ఉండటం చాలా ముఖ్యమనే భావనను బలోపేతం చేస్తుంది.

పదేళ్ల కిందట  2016 జనవరి లో మనం స్టార్ట్-అప్ ఇండియా ప్రయాణాన్ని ప్రారంభించాం. నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థగా మారింది. ఈ స్టార్టప్ సంస్థలు 10 సంవత్సరాల కిందట ఊహకు కూడా అందని రంగాలలో ఈరోజు పనిచేస్తున్నాయి. కృత్రిమ మేధ , అంతరిక్షం, న్యూక్లియర్ శక్తి, సెమీ కండక్టర్లు, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ… ఇలా మీరు ఏ రంగంలో అయినా చూడండి. ఆ రంగంలో కొన్ని భారతీయ స్టార్ట్-అప్‌లు పనిచేయడాన్ని మీరు చూస్తారు. ఈ సంవత్సరం నాణ్యతకు ప్రాధాన్యత ఇద్దాం. మన ఏకైక మంత్రం నాణ్యత. నిన్నటి కంటే నేడు మెరుగైన నాణ్యత అందించాలి. మనం తయారు చేసే దేని నాణ్యతనైనా మెరుగుపరచాలని సంకల్పిద్దాం. మన వస్త్రాలు, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ లేదా ప్యాకేజింగ్- ఏ రంగం అయినా, భారతీయ ఉత్పత్తి అత్యుత్తమ నాణ్యతకు పర్యాయపదంగా మారాలి. శ్రేష్ఠతను మన ప్రమాణంగా చేసుకుందాం. నాణ్యతకు కొరత ఉండకూడదని, నాణ్యతపై రాజీ పడకూడదని మనం సంకల్పిద్దాం. ఇలా చేయడం ద్వారా మాత్రమే మనం అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయగలం.

ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో తమసా నదికి ప్రజలు కొత్త జీవితాన్ని ఇచ్చారు. తమసా నది కేవలం ఒక నది మాత్రమే కాదు- అది మన సాంస్కృతిక,  ఆధ్యాత్మిక వారసత్వ జీవధార. అయోధ్యలో ప్రారంభమై గంగానదిలో కలిసే ఈ నది ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజల జీవన కేంద్రంగా ఉండేది. కానీ కాలుష్యం దాని నిరంతర ప్రవాహానికి ఆటంకం కలిగించింది. బురద, చెత్త, మురికి దాని ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. తర్వాత ఇక్కడి ప్రజలు దానికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. నదిని శుభ్రపరిచారు. దాని ఒడ్డున నీడనిచ్చే చెట్లను, పండ్ల చెట్లను నాటారు. స్థానిక ప్రజలు ఈ ఉద్యమాన్ని తమ విధి నిర్వహణగా భావించారు. అందరి ప్రయత్నాల వల్ల నది పునరుద్ధరణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం తీవ్రమైన కరువు సమస్యతో సతమతమవుతున్న ప్రాంతం. అక్కడి నేల ఎరుపు,  ఇసుక రంగులో ఉంటుంది. అక్కడి ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అక్కడి చాలా ప్రాంతాలలో చాలా కాలంగా వర్షాలు పడడం లేదు. కొన్నిసార్లు ప్రజలు అనంతపురం ప్రాంతాన్ని ఎడారిలోని కరువు పరిస్థితితో పోలుస్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అక్కడి ప్రజలు నీటి వనరులను శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. పరిపాలనా యంత్రాంగం సహకారంతో అక్కడ ‘అనంత నీటి సంరక్షణ ప్రాజెక్టు’ ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో భాగంగా 10 కి పైగా నీటి వనరులను పునరుద్ధరించారు. ఆ నీటి వనరులు ఇప్పుడు నీటితో నిండిపోతున్నాయి. అంతేకాకుండా 7,000 కి పైగా చెట్లను నాటారు. అంటే అనంతపురంలో నీటి సంరక్షణ మాత్రమే కాకుండా పచ్చదనం కూడా పెరిగింది. పిల్లలు ఇప్పుడు అక్కడ ఈత కొట్టడాన్ని ఆనందించవచ్చు. ఒక విధంగా అక్కడ యావత్ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ జరిగింది.

జెన్ జెడ్ లో ‘భజన్ క్లబ్బింగ్’ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ కార్యక్రమాలలో భజనల గౌరవం,  స్వచ్ఛతపై దృష్టి పెట్టడాన్ని చూడటం ఆనందదాయకంగా ఉంది. భక్తిని తేలికగా తీసుకోలేదు. శబ్దాలు, పదాల గౌరవానికి భంగం కలగలేదు. భావాలపరంగా రాజీపడలేదు. వేదిక ఆధునికంగా ఉండవచ్చు. సంగీత ప్రదర్శన భిన్నంగా ఉండవచ్చు. కానీ ప్రధాన స్ఫూర్తి అలాగే ఉంది. అక్కడ ఆధ్యాత్మికత నిరంతరం ప్రవహిస్తోంది.

భారత్ –  మలేషియా మధ్య చారిత్రక,  సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ‘మలేషియా ఇండియా హెరిటేజ్ సొసైటీ’ అనే సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. వివిధ కార్యక్రమాలతో పాటు ఆ సంస్థ హెరిటేజ్ వాక్‌ను కూడా నిర్వహిస్తుంది. ఇందులో రెండు దేశాలను అనుసంధానం చేసే సాంస్కృతిక ప్రదేశాలను కవర్ చేస్తారు. గత నెలలో మలేషియాలో ‘లాల్ ప్యాడ్ చీర’ నడక నిర్వహించారు. ఈ చీరకు మన బెంగాల్ సంస్కృతితో ప్రత్యేక సంబంధం ఉంది. అత్యధిక సంఖ్యలో చీరను ధరించిన వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరైనట్టు మలేషియన్ బుక్ ఆఫ్  రికార్డులో నమోదైంది. ఈ సందర్భంగా ఒడిస్సీ నృత్యం,  బవూల్ సంగీతం ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. 

గుజరాత్‌లోని బెచ్రాజీ ప్రాంతంలో ఉన్న చందంకి గ్రామ సంప్రదాయం ప్రత్యేకమైంది. అక్కడి ప్రజలు- ముఖ్యంగా వృద్ధులు- తమ ఇళ్లలో వంట చేయరు. దీనికి కారణం గ్రామంలోని కమ్యూనిటీ వంటగది. ఈ కమ్యూనిటీ వంటగదిలో మొత్తం గ్రామానికి ఆహారం వండుతారు. ప్రజలందరూ కలిసి కూర్చుని తింటారు. ఈ సంప్రదాయం గత 15 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే టిఫిన్ సేవ కూడా అందుబాటులో ఉంది. అంటే ఇంటికి డెలివరీ ఏర్పాటు కూడా ఉంది. గ్రామంలో ఈ కమ్యూనిటీ భోజనం ప్రజల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈ చొరవ ప్రజలను అనుసంధానించడమే కాకుండా కుటుంబ భావనను కూడా ప్రోత్సహిస్తుంది.

కొద్ది రోజుల కిందట UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శించారు. UAE 2026 ను కుటుంబ సంవత్సరంగా జరుపుకుంటుందని ఆయన చెప్పారు. ఆ దేశ ప్రజలలో సామరస్యం,  సమాజ స్ఫూర్తిని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇది నిజంగా ప్రశంసనీయమైన చొరవ.

అనంతనాగ్‌లోని షేక్‌గుండ్ గ్రామంలో మాదకద్రవ్యాలు, పొగాకు, సిగరెట్లు, మద్యానికి సంబంధించిన సవాళ్లను చూసి మీర్ జాఫర్ చాలా బాధపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. యువత నుండి పెద్దల వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరినీ ఆయన ఏకం చేశారు. ఆయన చొరవ వల్ల అక్కడి దుకాణాలు పొగాకు ఉత్పత్తులను అమ్మడం మానేశాయి. ఈ ప్రయత్నం మాదకద్రవ్యాల ప్రమాదాల గురించి ప్రజలలో అవగాహనను కూడా పెంచింది.

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ ప్రాంతంలోని ఫరీద్‌పూర్‌లో  ‘వివేకానంద లోక్ శిక్షా నికేతన్’ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా పిల్లలు, వృద్ధుల సంరక్షణలో నిమగ్నమై ఉంది. గురుకుల వ్యవస్థ ద్వారా విద్యను అందించడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఈ సంస్థ సామాజిక సంక్షేమం కోసం అనేక గొప్ప పనులలో నిమగ్నమై ఉంది. ఈ నిస్వార్థ సేవా స్ఫూర్తి దేశప్రజలలో మరింత బలంగా పెరగాలని కోరుకుంటున్నాను.

శ్రీఅన్న్ పట్ల దేశ ప్రజల ఆసక్తి నిరంతరం పెరుగుతుండడం చూసి సంతోషిస్తున్నాను. 2023ని మిల్లెట్ సంవత్సరంగా మనం ప్రకటించాం. మూడు సంవత్సరాల తరువాత కూడా దేశంలో,  ప్రపంచంలో మిల్లెట్ల విషయంలో అభిరుచి,  నిబద్ధత నిజంగా ప్రోత్సాహకరంగా ఉంది. తమిళనాడులోని కల్ల-కురిచి జిల్లాలోని 800 మహిళా రైతుల బృందం ‘పెరియపాళయం మిల్లెట్’ రైతు ఉత్పత్తి సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. మిల్లెట్ల విషయంలో పెరుగుతున్న ప్రజాదరణను చూసి, ఈ మహిళలు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించారు. ఇప్పుడు, వారు నేరుగా మిల్లెట్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని రాంసర్‌ రైతులు కూడా శ్రీఅన్న్ తో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. 900 మందికి పైగా రైతులు రాంసర్ ఆర్గానిక్ రైతు ఉత్పత్తి సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ రైతులు ప్రధానంగా జొన్నలను  పండిస్తారు. తినడానికి సిద్ధంగా ఉన్న లడ్డులను తయారు చేయడానికి ఇక్కడ జొన్నలను ప్రాసెస్ చేస్తారు. వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా దేవాలయాలు తమ ప్రసాదాలలో చిరు ధాన్యాలను మాత్రమే ఉపయోగిస్తున్నాయని తెలుసుకుని సంతోషిస్తున్నాను. ఈ చొరవకు ఆలయ నిర్వాహకులందరినీ అభినందిస్తున్నాను. చిరు ధాన్యాలు ఆహార దాతల ఆదాయాన్ని పెంచడమే కాకుండా మెరుగైన ఆరోగ్యానికి కూడా హామీ ఇస్తున్నాయి. చిరు ధాన్యాలు పోషకాహారంతో సమృద్ధిగా ఉంటాయి. సూపర్ ఫుడ్ గా ఉంటాయి. మనం చిరు ధాన్యాలను ఖచ్చితంగా తినాలి.