రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలి
దేశంలో ఎక్కడా ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు, ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.2,000 కోట్లకు పైగా రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు మనస్తాపంతో మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా బిజెపి ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో బిజెపి ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డి, మల్క కొమరయ్య పాల్గొన్నారు. ఎన్.రాంచందర్ రావు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ తదితరులు ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు తరలివచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని వారు ఘాటుగా విమర్శించారు.
ధర్నాలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశించారు, కానీ రాష్ట్రంలో ఉద్యోగాల పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ రోజున అన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలు ఒకేసారి అందించి, ఉద్యోగిని ప్రభుత్వ వాహనంలో సగౌరవంగా ఇంటికి పంపించాలన్న హామీ ఇప్పటికీ అమలు కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సీ, డీఏలు, గ్రాట్యూటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి అన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలను నిలిపివేసింది. గతేడాది మార్చిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ “ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తాం, ఏడాదిలో అన్ని బిల్లులు క్లియర్ చేస్తాం” అని హామీ ఇచ్చారు. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం వల్ల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు తీవ్ర సమస్యల్లో ఉన్నాయి.
బిజెపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శాసనమండలిలో, శాసనసభలో ఉద్యోగుల సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సోయి లేకుండా వ్యవహరించింది. కాంగ్రెస్ నిరుద్యోగులకు రూ.4,000 భృతి ఇస్తామని చెప్పి మాటతప్పింది. ప్రస్తుత ప్రభుత్వంలోనూ TSPSC ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలతో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాల ఆశతో అశోక్ నగర్ వంటి ప్రాంతాల్లో కోచింగులు తీసుకుని, శ్రద్ధగా చదువుతూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా ఆస్తులు అమ్మి, కోచింగ్ ఫీజులు చెల్లిస్తూ వనరులను సమకూర్చుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదు. అదేవిధంగా, విశ్వవిద్యాలయాల్లో కూడా జీతాలు సమయానికి అందడం లేదు, ఫలితంగా ఉద్యోగులు, విద్యార్థులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వ స్పందన లేకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బుద్ధిచెబుతూ, ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగుల, పెన్షనర్ల హక్కుల కోసం బిజెపి ఉద్యమం కొనసాగిస్తుంది.” అని అన్నారు.
.

