Kmnr results

కరీంనగర్‌లో కాషాయ జెండా రెపరెపలు

Kmnr Resultsమున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని, తన కంచుకోటగా చెప్పుకునే బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టి కరీంనగర్‌లో బిజెపి కాషాయ జెండాను రెపరెపలాడించింది. నిజామాబాద్ కార్పొరేషన్ లోనూ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కరీంనగర్‌లోని 66 స్థానాల్లో 30 చోట్ల గెలిచింది. స్వతంత్రులు బిజెపికి మద్దతు తెలపడంతో కరీంనగర్ కార్పొరేషన్ కమలం ఖాతాలో చేరింది. నిజామాబాద్‌లోని 60 స్థానాల్లో 28 చోట్ల గెలిచి మ్యాజిక్ ఫిగర్‌కు మూడడుగుల దూరంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ 17, మూడో స్థానంలో ఉన్న ఎంఐఎం 14 సీట్లతో బిజెపికి చాలా దూరంగా ఉన్నప్పటికీ, అవకాశవాద పొత్తులతో అధికారంలోకి రాకుండా బిజెపిని అడ్డుకున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 8, మంచిర్యాల లో 5, నల్గొండలో 4 సీట్లతో గతంలో మెరుగైన ఫలితాలు సాధించింది. పార్టీకి పెద్దగా బలం లేని రామగుండంలో, కొత్తగూడెంలో ఒక్కొక్క సీటు గెలిచి ఖాతా తెరిచింది.

మొత్తం ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లకు గాను బిజెపి 77 డివిజన్లు గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది. 63 డివిజన్లతో బీఆర్ఎస్ మొదటి స్థానం నుంచి ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. 191 డివిజన్లతో అధికార కాంగ్రెస్ ఊహించినట్టే అగ్రస్థానంలో నిలిచింది. 

మున్సిపాలిటీల్లో నారాయణపేట, భైంసాలను బిజెపి దక్కించుకుంది. నారాయణపేటలో 24 వార్డుల్లో 11 స్థానాల్లో గెలిచి, అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 26 వార్డులున్న భైంసాలో 6 స్థానాల్లోనే గెలిచినా, 7 స్వతంత్ర అభ్యర్థుల సహకారంతో 12 సీట్లతో గెలుపు ముంగిట నిలిచిన ఎంఐఎంను బిజెపి విజయవంతంగా అడ్డుకుంది. ఇప్పటివరకు భైంసాలో ఎంఐఎంతో చేతులు కలిపి బిజెపిని అడ్డుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు ఈసారి పారలేదు. ఆదిలాబాద్, మెట్‌పల్లి, రాయికల్, మున్సిపాలిటీల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా నిలిచింది. చాలా మున్సిపాలిటీల్లో రెండో స్థానంలో ఉంది. మున్సిపాలిటీల్లో 2582 వార్డుల్లో బిజెపి 259 స్థానాల్లో విజయం సాధించింది. 1346 వార్డుల్లో కాంగ్రెస్, 718 స్థానాల్లో బీఆర్ఎస్, 48 స్థానాల్లో ఎంఐఎం, 161 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఇతర పార్టీలు మిగిలిన వార్డులను దక్కించుకున్నాయి. 

ఫిబ్రవరి 11న జరిగిన ఈ ఎన్నికల్లో 13న ఫలితాలు వెలువడ్డాయి. మొత్తానికి బిజెపి ప్రదర్శన గణనీయంగా మెరుగుపడగా, బీఆర్ఎస్ ఘోరంగా పతనమైంది. అధికార పార్టీకి ఉండే సానుకూలతల దృష్ట్యా కాంగ్రెస్ అత్యధిక సంఖ్యలో కార్పొరేషన్లు, మున్సిపాటిలీలు సొంతం చేసుకుంది. గెలుచుకున్న మున్సిపాలిటీలు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిజెపి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల కన్నా బిజెపి ఓట్లు, సీట్లు పెరిగాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ ఘోరంగా దిగజారింది. ఆ పార్టీకి గతం కంటే 14 శాతం ఓట్లు తగ్గాయి, కేవలం 13 మున్సిపాలిటీలకు పరిమితమైంది. గెలుపోటముల సంగతి అటుంచితే, ప్రజలు మాత్రం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు సరైన ప్రత్యామ్నాయం బిజెపినే అన్న సంకేతాన్ని స్పష్టంగా పంపించారు.

రాష్ట్రవ్యాప్తంగా బిజెపి అనుకూల వాతావరణం

”మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనం. ఈ ఎన్నికల ఫలితాల్లో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవులన్నింటిలో కూడా బిజెపి మంచి ఫలితాలను సాధించడం గర్వకారణం. అలాగే నారాయణపేటలో చైర్ పర్సన్ పదవిని సాధించిన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భైంసాలో ఇన్నాళ్లు “ఇది మా గడ్డ” అని చెప్పుకున్న వారి అహంకారాన్ని బద్దలుకొట్టి, బిజెపి అక్కడ విజయపతాకాన్ని ఎగరవేయడం చారిత్రాత్మకం. ఆ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కార్యకర్తలందరూ కష్టపడి పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా అనుకూల వాతావరణాన్ని నిర్మించారు. తెలంగాణలో బిజెపి ఒక శక్తిగా ఎదుగుతోందన్న విశ్వాసాన్ని ప్రజల్లో బలంగా నాటారు. “తెలంగాణలో బిజెపినే ప్రత్యామ్నాయం” అనే విశ్వాసాన్ని నిలబెట్టిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.”

-ఎన్. రాంచందర్ రావు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు