Skilled employee

యువత ఉపాధికి పీఎం-సేతు భరోసా

భారతదేశం ప్రస్తుతం ఒక కీలకమైన సంధి కాలంలో ఉంది. తనకున్న అపారమైన యువ జనాభా శక్తిని ఆర్థిక శక్తిగా మార్చుకోవాల్సిన తరుణమిది. ప్రతి ఏటా సుమారు 1.2 కోట్ల మంది యువత మన శ్రామిక శక్తిలో చేరుతున్నారు. అయితే వీరందరికీ తగిన ఉపాధి అవకాశాలను కల్పించడమే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాలు. ఈ సమస్యను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, అక్టోబర్ 4, 2025న ‘ప్రధాన మంత్రి ఐటిఐల నవీకరణ ద్వారా నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాల పెంపు’ (పీఎం-సేతు) పథకాన్ని ప్రారంభించింది. రూ 60,000 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టిన ఈ పథకం, దేశంలోని వృత్తి విద్యా శిక్షణ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటిఐల) రూపురేఖలను మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేవలం నైపుణ్యాలను నేర్పించడమే కాకుండా, ఆ నైపుణ్యాలను నేరుగా ఉపాధితో అనుసంధానించడంపై ఇది దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI), విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం వంటి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దుతోంది.

గ్రామీణ, ఉప-పట్టణ (సెమీ-అర్బన్) ప్రాంతాల యువతకు ఈ పథకం ఒక గొప్ప వరం. ఉదాహరణకు, బీహార్‌కు చెందిన ఒక యువకుడు ఈ కార్యక్రమం ద్వారా ‘విద్యుత్ వాహనాల ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్’గా శిక్షణ పొందితే, అది అతని ఆదాయాన్ని పెంచడమే కాకుండా అతన్ని ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగంలో భాగస్వామిని చేస్తుంది. ఆకాంక్షలను అవకాశాలుగా మార్చడమే పీఎం-సేతు లక్ష్యం. పీఎం-సేతు పథకానికి కేటాయించిన నిధులు దాని పరిధి, ప్రాముఖ్యాలకు నిదర్శనం. ఈ పథకానికి కేటాయించిన రూ.60,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.30,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20,000 కోట్లు, పారిశ్రామిక రంగం రూ.10,000 కోట్లు భరిస్తాయి. ఈ భాగస్వామ్యం వల్ల దీన్ని బాధ్యతాయుతంగా అమలు చేయడం సాధ్యమవుతుంది.

అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ పథకంపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో ప్రపంచ బ్యాంకు 830 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,000 కోట్లు) రుణాన్ని ఆమోదించింది. అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) కూడా ప్రైవేట్ మూలధనం రూపంలో మరో 680 మిలియన్ డాలర్లను సమకూర్చడంలో తోడ్పడుతోంది. పరిశ్రమల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ప్రత్యేక సంస్థ ద్వారా ఈ శిక్షణ కేంద్రాలు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, కన్సల్టెన్సీ, ఉత్పత్తి కార్యకలాపాల ద్వారా సొంతంగా ఆదాయాన్ని ఆర్జించేలా రూపొందించారు.

ఐటీఐల ఆధునీకరణ

దేశవ్యాప్తంగా ఉన్న 15,000 పైగా ఐటీఐలలో 1,000 ప్రభుత్వ ఐటీఐలను ‘హబ్ అండ్ స్పోక్’ నమూనాలో ఆధునికీకరిస్తున్నారు. అంటే వీటిలో 200 ఐటీఐలను ఆధునిక ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన ‘అధునాతన హబ్‌లు’గా మారుస్తారు. ఇవి మిగిలిన 800 ఐటీఐలకు మార్గదర్శకత్వం వహిస్తాయి. ఈ నమూనా ఇప్పటికే కర్ణాటక (బెంగళూరు, కలబురగి), బీహార్ (పాట్నా, దర్భంగా) వంటి రాష్ట్రాల్లో అమలులోకి వచ్చింది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌ను మార్చడమే కాకుండా, శిక్షణ పొందే వారిలో 25 శాతం మహిళలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా స్త్రీపురుష సమానత్వానికి ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లూథియానాలోని ఐదు జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలను సెంటర్స్ అఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దుతున్నారు. గతంలో మన దేశంలో విద్యార్థుల ఉపాధి సామర్థ్యం 42-55 శాతంగానే ఉండేది. పీఎం-సేతు ద్వారా ఈ అంతరాన్ని పూడ్చి, కనీసం 70 శాతం ప్లేస్‌మెంట్ రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 10 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా వస్తూత్పత్తి, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను తీర్చవచ్చు. మే 2025లో మంత్రివర్గ ఆమోదం పొందిన ఈ పథకం, అక్టోబర్‌లో ప్రారంభమై శరవేగంగా విస్తరిస్తోంది. జనవరి 2026 నాటికి 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ముఖ్య కార్యదర్శుల ఆధ్వర్యంలో సారథ్య సంఘాలను ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పరిశ్రమలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నాయి.

దీర్ఘకాలిక ప్రభావం: వికసిత భారత్ దిశగా..

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో పీఎం-సేతు కీలక పాత్ర పోషిస్తుంది.

  • 2026 నాటికి: 5 లక్షల మంది యువతకు శిక్షణ (60% ప్లేస్‌మెంట్).
  • 2027 నాటికి: 10 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ (70% ప్లేస్‌మెంట్).
  • 2030 నాటికి: కోటి మంది యువతకు నైపుణ్య ఫలాలు.

కేవలం విద్యుత్ వాహనాల రంగంలోనే 2030 నాటికి 30 లక్షల మంది కార్మికుల అవసరం ఉంటుంది. పీఎం-సేతు అటువంటి అవసరాలను స్వదేశీ నైపుణ్యంతోనే తీర్చేలా చేస్తోంది. పీఎం-సేతు అనేది కేవలం ఒక శిక్షణ పథకం కాదు, అది ఒక సామాజిక విప్లవం. ఇది యువతకు ఆత్మగౌరవాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందిస్తుంది. 2047 నాటికి ‘వికసిత భారత్’ నిర్మాణంలో ఈ పథకం ఒక బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది యువత ఇప్పుడు నమ్మకంతో, నైపుణ్యంతో భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

 వివేక్ కుమార్