NRR NIrmal

ధనిక ప్రాంతాలకు అధిక ప్రాతినిధ్యం ప్రజాస్వామ్యానికి విరుద్ధం

Nirmalనియోజకవర్గాల పునర్విభజనలో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు అధిక ప్రాతినిధ్యం ఇవ్వాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. డీలిమిటేషన్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు విచిత్రంగా ఉందని ఎద్దేవా చేస్తూ ”హైదరాబాద్‌లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఖానాపూర్ లాంటి ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. మరి అలాంటి ప్రాంతాలను విస్మరించాలా? అక్కడి ప్రజల ప్రాతినిధ్యం తగ్గించాలా?” అని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ బూర్జువా వైఖరిని అద్దం పడుతుందని మండిపడ్డారు. ధనిక ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చి, వెనుకబడిన ప్రాంతాలను పక్కన పెట్టాలన్న ఆలోచన కాంగ్రెస్‌లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఏప్రిల్ 13న ఆయన నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో పర్యటించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అంకం మౌనిక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కొమురం భీం చౌరస్తా నుండి తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ తో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు గోడం నాగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు  రితేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”ఖానాపూర్ మున్సిపాలిటీ చిన్నదైనా.. ఇక్కడి ఫలితం మాత్రం పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది స్పష్టమైన హెచ్చరిక. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపిదే భవిష్యత్తు అని ఖానాపూర్ ప్రజలు చాటిచెప్పారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీసుల ఒత్తిడి, గూండాయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రయత్నించింది. కానీ ఖానాపూర్ ప్రజలు, కౌన్సిలర్ సభ్యులు ఆ ప్రయత్నాలకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. అంకం మౌనిక చైర్‌పర్సన్‌గా, కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఖానాపూర్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని పూర్తి నమ్మకం ఉంది.

రైతు సమస్యల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతుబంధు అమలు లేదు.. సరిగ్గా రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య సంఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి మరో ఉదాహరణ. అటు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని మొత్తం ఒకటిగా చూస్తుంది. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతోంది. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు నరేంద్ర మోదీ నాయకత్వంలో వేగంగా జరిగాయి. అభివృద్ధి బిజెపితోనే సాధ్యం. ఖానాపూర్ మున్సిపాలిటీకి, నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తిగా అందేలా కృషి చేస్తాం. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బిజెపి తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి రాబోతోంది.” అని అన్నారు.