Narendra Modi

కాంగ్రెస్‌ను మహిళా శక్తి క్షమించదు!

కాంగ్రెస్, ఇండీ కూటమి పక్షాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 18న జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

నారీశక్తి ప్రస్థానాన్ని కొందరు ఎలా అడ్డుకున్నారో ఈ రోజున భారత పౌరులందరూ ప్రత్యక్షంగా చూశారు. మేమెంతగా ప్రయత్నించినా వారి కలలను నిర్దాక్షిణ్యంగా అణచివేసే వారిని నిలువరించడంలో విజయం సాధించలేకపోయాం. నారీశక్తి వందన్ చట్టానికి సవరణపై ఆమోదం పొందలేకపోయాం! ఇందుకుగాను తల్లులు, అక్కచెల్లెళ్లు నన్ను క్షమించాలని కోరుతున్నాను.

కొందరికి తమ స్వార్థమే సర్వస్వమైనపుడు.. జాతి ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే గొప్పవైనప్పుడు… నారీశక్తి, జాతీయ ప్రయోజనాలు ఇలాంటి దుష్పరిణామాలను సహించాల్సి వస్తుంది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ వంటి కుటుంబ పార్టీలు ఆనందంతో కరతాళ ధ్వనులు చేయడం నాకెంతో వేదన కలిగించింది. మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించి, పాపానికి ఒడిగట్టినందుకు నారీశక్తి చేతిలో మీకు శిక్ష తప్పదని ప్రతిపక్షాలకు స్పష్టం చేస్తున్నాను. ఈ పార్టీలు చివరకు రాజ్యాంగ రూపకర్తల అభీష్టాన్ని కూడా కాలదన్ని, వారిని అవమానించాయి. నారీశక్తి వందన్ సవరణ ఎవరి నుంచీ.. ఏదీ లాక్కోవడానికి ఉద్దేశించినది కాదు. ఇది ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఇవ్వడం కోసం సంకల్పించినది. ఈ సవరణ.. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి 40 ఏళ్లుగా మహిళలకు దక్కాల్సిన హక్కును వారికి దఖలు పరిచేందుకే ఉద్దేశించినది. దేశంలోని 21వ శతాబ్దపు మహిళల ఆకాంక్షలకు కొత్త రెక్కలు తొడిగి, వారి పురోగమన మార్గంలోని అవరోధాలను తొలగిస్తూ మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చేసిన గొప్ప ప్రయత్నమే నారీశక్తి వందన్ సవరణ. పార్లమెంటులో ప్రతి రాష్ట్ర గళానికి మరింత బలం చేకూర్చే క్రమంలో ప్రతిపాదించిన సవరణ ఇది. రాష్ట్రం చిన్నదా.. పెద్దదా… జనాభా తక్కువా.. ఎక్కువా.. అనే అంశాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి బలాన్నీ సమ నిష్పత్తిలో పెంచాలనే ప్రయత్నంలో ఇదొక భాగం. ప్రభుత్వం నిజాయితీగా చేపట్టిన ఈ కృషిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పార్లమెంటులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భ్రూణహత్య వంటి పాపిష్టి చర్యకు పాల్పడ్డాయి. 

మహిళా రిజర్వేషన్లంటేనే కాంగ్రెస్ పార్టీకి ద్వేషం… అందుకే వాటిని అడ్డుకోవడానికి నిత్యం కుట్ర పన్నుతూనే వచ్చింది. ఈ సంకల్ప సాకారానికి ఎన్ని సార్లు… ఎంతగా కృషి చేసినా, ప్రతి సారి కాంగ్రెస్ మోకాలడ్డింది. అదే తరహాలో ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్లను నిరోధించడంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో అవాస్తవాలను ఉటంకించాయి. కాంగ్రెస్‌ పార్టీ దశాబ్దాల నాటి తన తప్పిదాన్ని సరిదిద్దుకుంటుందని నేను ఆశించాను. తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈసారి పశ్చాత్తాపం వ్యక్తం చేసుందని భావించాను. అయితే, నారీశక్తికి అండగా నిలిచే చరిత్రాత్మక అవకాశాన్ని కాంగ్రెస్ నిస్సందేహంగా కోల్పోయింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే, టీఎంసీ తదితర పార్టీలన్నీ ఏళ్ల తరబడి ప్రతి సారి అవే సాకులు, తప్పుదోవ పట్టించే వాదనలతో సదా ఏదో ఒక సాంకేతిక అడ్డంకిని సృష్టిస్తూ మహిళల హక్కులను హరించాయి. 

నారీశక్తి వందన్ చట్ట సవరణపై నేటి వ్యతిరేకతకు అసలు కారణం ఈ కుటుంబ పార్టీల్లో నెలకొన్న భయాందోళనలే. మహిళలకు సాధికారత సిద్ధిస్తే, ఈ కుటుంబ పార్టీల నాయకత్వం కూలిపోయే ముప్పు ఉంటుందన్నదే వారి భయం. తమ కుటుంబాల్లోని వారు మినహా ఇతర మహిళలు ముందడుగు వేయడం వీరికి ఎన్నడూ ఇష్టముండదు. ఈ రోజున పంచాయతీలు, స్థానిక స్వపరిపాలన సంస్థలలో వేలాది, లక్షలాది మహిళలు తమ సామర్థ్యం నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు వారు లోక్‌సభ, శాసనసభల స్థాయికి ఎదిగి దేశానికి సేవ చేయాలనే సంకల్పం ప్రకటిస్తే ఈ కుటుంబ పార్టీలు అభద్రత భావనకు లోనవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళలకు మరిన్ని సీట్లు లభిస్తాయి. వారి స్థాయి, హోదా పెరుగుతాయి… కాబట్టే, వీరు నారీశక్తి వందన్ సవరణను వ్యతిరేకించారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన కాంగ్రెస్‌ను, దాని మిత్రపక్షాలను దేశంలోని మహిళా శక్తి ఎన్నటికీ క్షమించదు.

నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పదేపదే అబద్ధాలు వల్లిస్తున్నాయి. ఏవేవో సాకులతో వారు విభజన విద్వేషాగ్నిని రగిలించాలని యత్నిస్తున్నారు. ఎందుకంటే, “విభజించి పాలించు” అనే రాజనీతి బ్రిటిష్ పాలన నుంచి కాంగ్రెస్‌ పార్టీకి వారసత్వంగా సంక్రమించింది. దేశంలో చీలిక తెచ్చే భావజాలాన్ని కాంగ్రెస్ సదా రెచ్చగొడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన కొన్ని రాష్ట్రాలకు హాని చేస్తుందనే అవాస్తవాన్ని విస్తృతంగా వ్యాపింపజేసింది! అయితే, ఏ రాష్ట్రంలోనూ భాగస్వామ్య నిష్పత్తి మారదని, ఎవరి ప్రాతినిధ్యమూ తగ్గదని కేంద్ర ప్రభుత్వం తొలి రోజు నుంచే స్పష్టం చేస్తూవస్తోంది. అన్ని రాష్ట్రాల సీట్లు సమ నిష్పత్తిలో పెరుగుతాయన్నది వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు ఈ నిజాన్ని అంగీకరించేందుకు మనసొప్పడం లేదు. ఈ సవరణ బిల్లు అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాలకు ఒక గొప్ప అవకాశం. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు పెరిగేవి. కానీ తమ స్వార్థ రాజకీయాల వల్ల ఈ పార్టీలు తమ సొంత రాష్ట్ర ప్రజలకే నమ్మకద్రోహం చేశాయి. ఉదాహరణకు ‘డీఎంకే’కి ఎక్కువ మంది తమిళులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసి తమిళనాడు గొంతుకను బలోపేతం చేసే అవకాశం ఉండేది! కానీ అది ఆ అవకాశాన్ని కోల్పోయింది. 

కాంగ్రెస్ ఒక సంస్కరణల వ్యతిరేక పార్టీ. 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన భారత్ కోసం ఏ నిర్ణయాలు, ఏ సంస్కరణలు అవసరమో దేశం తీసుకునే ఆ నిర్ణయాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది.. తిరస్కరిస్తుంది.. అడ్డుకుంటుంది. ఇదే కాంగ్రెస్ చరిత్ర.. ఇదే కాంగ్రెస్ అనుసరించే ప్రతికూల రాజకీయాలు. కాంగ్రెస్ జన్ ధన్–ఆధార్–మొబైల్ త్రయాన్ని వ్యతిరేకించింది, డిజిటల్ చెల్లింపులను వ్యతిరేకించింది, జీఎస్టీని వ్యతిరేకించింది, జనరల్ క్యాటగిరిలోని పేదలకు రిజర్వేషన్‌ను వ్యతిరేకించింది, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని వ్యతిరేకించింది. ఉమ్మడి పౌర స్మృతి అవసరమని మన రాజ్యాంగం, మన కోర్టులు చెప్పినా.. దానిని కూడా వ్యతిరేకిస్తోంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ను వ్యతిరేకిస్తోంది. దేశం నుంచి చొరబాటుదారులను పంపించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తోంది. ఓటర్ల జాబితా శుద్దీకరణ అయిన సర్‌ను వ్యతిరేకిస్తోంది. వక్ఫ్ బోర్డులో సంస్కరణలను కూడా వ్యతిరేకిస్తోంది. శరణార్థులకు భద్రత కల్పించే సీఏఏ చట్టాన్ని కూడా వ్యతిరేకించింది. మావోయిస్టు-నక్సలైట్ హింసను అంతం చేయడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ అడ్డుపడుతోంది. సంస్కరణ అనే మాట ఎత్తగానే కాంగ్రెస్ ప్లకార్డులతో పరుగులు తీస్తుంది. దేశాన్ని బలోపేతం చేసే ఏ పనినైనా అందులో అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ తన శక్తినంతటినీ ఉపయోగిస్తుంది.

దేశానికి ఏ నిర్ణయం అవసరమైనా కాంగ్రెస్ దానిని మూలన పడేస్తుంది. కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి కారణంగానే భారత్‌ చేరుకోవాల్సిన అభివృద్ధి శిఖరాలను అందుకోలేకపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మనతో పాటే అనేక దేశాలకు కూడా స్వాతంత్ర్యం లభించింది. ఆ దేశాల్లో చాలా వరకు మనకంటే ఎంతో ముందుకెళ్లాయి.. దానికి కారణం కాంగ్రెస్ ప్రతి సంస్కరణను అడ్డుకుంటూనే రావడం. జాప్యం, తప్పుదోవ పట్టించడం, అడ్డంకులు సృష్టించడం.. ఇదే కాంగ్రెస్ సూత్రం- ఇదే కాంగ్రెస్ పని సంస్కృతి. పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను కాంగ్రెస్ వాయిదా వేసింది. పాకిస్థాన్‌తో నీటి పంపిణీ వివాదాలను ఆలస్యం చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని 40 ఏళ్ల పాటు వాయిదా వేసింది. సైనికుల కోసం ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ను 40 ఏళ్ల పాటు ఆలస్యం చేసింది. కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి దేశానికి ఎప్పుడూ తీరని నష్టాన్ని కలిగించింది. కాంగ్రెస్ చేసిన ప్రతి వ్యతిరేక, ప్రతి అనిశ్చిత నిర్ణయం, ప్రతి మోసం వల్ల దేశం నష్టపోయింది. నేడు దేశం ముందున్న ప్రధాన సవాళ్లన్నీ కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి నుండే ఉద్భవించాయి. దేశంలోని మహిళల కలలు భగ్నం కావడాన్ని కొందరు ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ విషయం ఎప్పుడూ విజయం లేదా వైఫల్యానికి సంబంధించింది కాదు.. క్రెడిట్ గురించి అసలే కాదు. 

దేశంలోని ప్రతి మహిళకు హామీ ఇస్తున్నాను.. మహిళా రిజర్వేషన్ల మార్గంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగిస్తాం. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలు పార్లమెంటు- శాసనసభలలో మహిళల భాగస్వామ్యం పెరగకుండా ఎప్పటికీ అడ్డుకోలేవు. మహిళా శక్తి సాధికారత పట్ల బిజెపి-ఎన్డీయే సంకల్పం చెక్కుచెదరలేదు. నిన్న మనకు సంఖ్యాబలం లేకపోవచ్చు కానీ అంతమాత్రాన మనం ఓడిపోయినట్లు కాదు. మన ప్రయత్నం ఆగదు.. విరామం తీసుకోదు. భవిష్యత్తులో మనకు మరిన్ని అవకాశాలు వస్తాయి. దేశ జనాభాలో సగభాగమైన మహిళల కలల కోసం, దేశ భవిష్యత్తు కోసం ఈ సంకల్పాన్ని మనం నెరవేర్చి తీరాలి.

మహిళల మనస్సుల్లో ఆ కూటమి పతనమైపోయింది! : నితిన్ నబీన్

పార్లమెంటులో రాజ్యాంగ 131వ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ (SP), టీఎంసీ (TMC), డీఎంకే (DMK) తదితర ఇండీ కూటమి పార్టీలపై విరుచుకుపడ్డారు. వారి చర్యలు మహిళా వ్యతిరేకతను బట్టబయలు చేశాయని విమర్శించారు. ఏప్రిల్ 17ను సువర్ణాక్షరాలతో లిఖించే అవకాశం ఉండేదని, అయితే రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, దాని మహిళా వ్యతిరేక కూటమి దేశంలోని సగం జనాభాకు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. మహిళలకు సరైన భాగస్వామ్యం, ప్రాతినిధ్యాన్ని కల్పించడంలో ఈ సందర్భం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచి ఉండేదని, కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళలకు దక్కాల్సిన హక్కులను, వాటాను దూరం చేశాయని అన్నారు.

పార్లమెంటులో సంఖ్యాపరంగా బిల్లు వీగిపోయినప్పటికీ, దేశవ్యాప్తంగా మహిళల మనస్సుల్లో మహిళా వ్యతిరేక కూటమి పూడ్చలేని విధంగా పతనమైపోయిందని అన్నారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ, ఆయన బృందం ఉపయోగించిన భాషను తప్పుబట్టారు. వారి ప్రవర్తనలో ప్రతిబింబించిన అరాచక మనస్తత్వం తీవ్ర ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. మహిళలకు దక్కాల్సిన న్యాయమైన హక్కులను నిరాకరించిన కాంగ్రెస్ తీరును ఎండగడుతూ బిజెపి ప్రజల్లోకి వెళ్తుందన్నారు. దేశ జనాభాలో సగభాగమైన మహిళలు కాంగ్రెస్, దాని మహిళా వ్యతిరేక కూటమికి వ్యతిరేకంగా దృఢంగా, ఐక్యంగా నిలబడతారని నితన్ నబీన్ స్పస్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయి. దశాబ్దాల మహిళల కలను నిర్వీర్యం చేశాయి. రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ.. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ప్రతిసారి కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళామణులకు, చట్టసభల్లోకి వచ్చి దేశానికి, సమాజానికి మేలు చేయాలనుకున్న యువత, బడుగు బలహీన వర్గాల ఆశల మీద నీళ్లు చల్లారు.

-జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

”భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజు. కాంగ్రెస్ ఓడించింది ఎన్డీఏను కాదు…దేశంలోని మహిళలందరినీ! మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కాల ”కూట” విషం కక్కింది. కాంగ్రెస్ మొదటి నుండి మహిళా వ్యతిరేకి. మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. డూప్లికేట్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ కుటుంబాల మహిళలకు మాత్రమే పదవులుండాలా? సాధారణ మహిళలకు చట్టసభల్లో  వాటా ఇస్తుంటే ఓర్వలేక బిల్లును అడ్డుకున్నారు.”

-బండి సంజయ్ కుమార్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

”రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండీ కూటమి దేశంలోని మహిళలతో పాటు మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఘోరంగా మోసం చేసింది. జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు భవిష్యత్తులో జనగణన తర్వాత ఎలాంటి అన్యాయం జరగకుండా రక్షణ కల్పించడమే ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పార్లమెంటులో బిల్లులు వీగిపోయినప్పుడు కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు సంబరాలు చేసుకోవడం.. దేశాన్ని ఉత్తర-దక్షిణంగా విభజించే కుట్రకు నిదర్శనం.”

-శోభా కరంద్లాజే, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి

”మొదటి నుంచి కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటూనే ఉంది. ఎన్నికల వేళ మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడటం.. తర్వాత తూట్లు పొడవటం కాంగ్రెస్‌కు  పరిపాటిగా మారింది. గతంలో ఏడు సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో రాజ్యసభలో ఆమోదం పొందినా పార్లమెంటులో ప్రవేశపెట్టలేకపోయింది. మహిళా రిజర్వేషన్ అమలు కావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు.”

-డి.కె. అరుణ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు

”ఏప్రిల్ 17 దేశ మహిళలకు, భారీ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు మరోసారి దేశ మహిళలకు ద్రోహం చేశాయి.”

-డా. శిల్పా రెడ్డి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు