సుస్థిర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి
భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఇంధన అభద్రత, ఆర్థిక సంక్షోభాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం ముందు రెండే మార్గాలు ఉన్నాయి-సంకుచిత జాతీయ విధానాల వైపు తిరోగమించడం లేదా వృద్ధి, స్థితిస్థాపకత (పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం), స్థిరమైన అభివృద్ధిని అందించే భాగస్వామ్యాలను బలోపేతం చేయడం. ఐక్యరాజ్యసమితి తన 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ అంతర్జాతీయ సహకారం, బహుళపక్షవాదాల విశిష్టత మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ప్రపంచ పాలనా సంస్థలలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని ఇప్పుడు ఎంతమాత్రం విస్మరించలేం.
అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమ సమానత్వంతో కూడిన నియమబద్ధమైన అంతర్జాతీయ వ్యవస్థ దశాబ్దాల తరబడి ఒక స్థిరత్వానికి, అభివృద్ధికి తోడ్పడ్డాయి. అయినప్పటికీ నేడు ఎదురవుతున్న వాతావరణ మార్పులు, పారిశ్రామిక మార్పులు, సరఫరా గొలుసులకు అంతరాయాలు, ఇంధన పరివర్తన వంటి సవాళ్లు ఒక నూతన ఆచరణాత్మక, సమగ్ర సహకార స్ఫూర్తిని కోరుతున్నాయి. వాతావరణ మార్పు పెను సవాల్‌గా మారింది. ఇది సమాజాలను, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. వాతావరణ మార్పులను నివారించే చర్యలను అభివృద్ధి ఆకాంక్షల నుంచి వేరు చేయలేము. కోట్లాది ప్రజలు ఇప్పటికీ మెరుగైన జీవన ప్రమాణాలు, ఉపాధి, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఇంధన లభ్యతను కోరుకుంటున్నారు. కనుక స్థిరత్వాన్ని పెంపొందిస్తూనే వృద్ధిని, అవకాశాలను అందించడం అనేది ఒకదానికొకటి విరుద్ధమైన విషయం కాదు; అది మన కాలపు అత్యంత కీలకమైన ఆర్థిక, రాజకీయ కర్తవ్యం.
ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పరివర్తనను కొనసాగిస్తూ, అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం ఆవిర్భవించింది. ఈ విధానం వాతావరణ లక్ష్యాలకు, అభివృద్ధి వాస్తవాలకు మధ్య వారధిని నిర్మించడం అనే ఒక స్పష్టమైన లక్ష్యంతో ముడిపడి ఉంది. ఒక ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా, అభివృద్ధి చెందుతున్న దేశాల బాధ్యతాయుతమైన స్వరంగా భవిష్యత్తు కోసం భారతదేశం రెండు కీలక మైలురాళ్లను నిర్దేశించుకుంది: 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’ హోదాను సాధించడం, 2070 నాటికి నికర శూన్య (నెట్ జీరో) (కాలుష్య) ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడం. ఈ దేశీయ లక్ష్యాలు ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయి.
లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (LeadIT), ఐక్యరాజ్యసమితితో సహా ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి భారత్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సౌర కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, మిషన్ లైఫ్ (Mission LiFE) వంటి ప్రపంచ వేదికల కారణంగా భారత్ ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల బాధ్యతాయుతమైన స్వరంగా నిలిచింది. అదే సమయంలో, వాతావరణ మార్పులను నిరోధించేందుకు యూరప్ చేస్తున్న కృషిలో స్వీడన్ అగ్రగామిగా ఉంది. దశాబ్దాల క్రితం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల, అక్కడి విద్యుత్ గ్రిడ్ 98 శాతం శిలాజ ఇంధన రహితంగా మారింది. వాతావరణ అనుకూల పరిష్కారాల ఆవిష్కరణలలో, ఎగుమతులలో ప్రైవేట్ రంగం అందించిన సహకారాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. మొత్తంగా చూస్తే, 1990 నుండి ఉద్గారాలు మూడో వంతు కంటే ఎక్కువగా తగ్గాయి. ఇదే సమయంలో, స్వీడన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు రెట్టింపు అయింది. భారత్, స్వీడన్ల విధానాలు ఒక విస్తృతమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి. వాతావరణ పరిరక్షణ చర్యలు ఉద్యోగాలను సృష్టించగలవు, అవకాశాలను విస్తరించగలవు, ఇంధన భద్రతను బలోపేతం చేయగలవు, జీవితాలను మెరుగుపరచగలవు. దీని ఉద్దేశం కేవలం దేశీయ అభివృద్ధి మార్గాలను కర్బన రహితంగా మార్చడం మాత్రమే కాదు, భారీయెత్తున స్వచ్ఛమైన పారిశ్రామికీకరణను సాధ్యం చేసే భాగస్వామ్యాల నిర్మాణానికి సహాయపడటం కూడా. ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఆవిష్కర్తలు, ఆర్థిక సంస్థల మధ్య సహకారం ద్వారా పారిశ్రామిక పరివర్తనను ముందుకు తీసుకెళ్లవచ్చనే ఉమ్మడి విశ్వాసాన్ని మా భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది.
(మోదీ స్వీడన్ పర్యటన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసం)

