ప్రాణత్యాగమే కాదు, జీవించి దేశానికి సేవ చేయడమూ దేశభక్తే
”దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాదు, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి” అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలు భారత ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. దేశ ఆర్థిక స్వావలంబన, జాతీయ ప్రయోజనాలు, ప్రజల భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన “సప్త సూత్రాలు” అంశంపై మే 14న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర మీడియా బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య అధికార ప్రతినిధి, అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో పాటు ప్రముఖ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డా. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. డా. కృష్ణారెడ్డి “సప్త సూత్రాలు”పై సమగ్ర విశ్లేషణ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లు, విదేశీ మారక ద్రవ్య వినియోగం వంటి అంశాలను గణాంకాలతో వివరించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, ఇంధన వినియోగంలో బాధ్యత, వంటనూనె వినియోగ నియంత్రణ, సహజ వ్యవసాయం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అంశాలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ఎలా దోహదపడతాయో వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు కేవలం ప్రభుత్వ విధానాలు మాత్రమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో అమలు కావాల్సిన జాతీయ ఆర్థిక ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు తీసుకొస్తే దేశ ఆర్థిక శక్తిని గణనీయంగా బలోపేతం చేయవచ్చని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలు రాజకీయ అంశాలు కావని, అవి దేశ ఆర్థిక భద్రత, సామాజిక బాధ్యతలకు సంబంధించినవని స్పష్టం చేశారు. ముఖ్యంగా “లోకల్ ఫర్ వోకల్” భావనతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఖర్చుల్లో మితవ్యయం పాటించాలని, ప్రధాని స్వయంగా తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత వాహనాలను వాడాలని, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కోరారు. ఐటీ రంగంలో అమలవుతున్న కార్‌పూలింగ్ విధానం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇంధన పొదుపునకు ఎంతో మేలు చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్, ఇందిరా గాంధీ కూడా ఆర్థిక ఇబ్బందుల సమయంలో కఠినమైన పొదుపు చర్యలు చేపట్టారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రధాని చేస్తున్న సూచనలను విమర్శించడం సరికాదని హితవు పలికారు. తాను కూడా ఇటీవల ఒక కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రజా రవాణాను వినియోగించానని, విదేశాల్లో ఉన్నతాధికారులు కూడా ఇవే పద్ధతులు పాటిస్తారని ఉదహరించారు. దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రధాని పిలుపును తెలంగాణ ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవలో భాగస్వాములు కావాలని ఎన్. రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు.

