Woman Empowerment

గ్రామస్థాయిలో మహిళా సాధికారత

డిశాలోని దాదాపు 5,000 జనాభా ఉన్న నమన్‌గూడ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ పుష్పాంజలి భుయాన్‌కు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. గ్రామంలో అధికారికంగా ‘గ్రామసభ’ సమావేశం కావడానికి ముందే ఆమె గ్రామంలోని మహిళలందరినీ ఒకచోటకు చేర్చారు. అంతకుముందు జరిగిన ఆ ‘మహిళా సభ’ సమావేశంలో వారిని తీవ్రంగా వేధిస్తున్న సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు: నాలుగు గోడల మధ్య మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, రక్షణలేనివిగా అనిపించే బహిరంగ ప్రదేశాలు, మధ్యలోనే బడి మానేసిన బాలికలు, ఆర్థిక అవకాశాలకు దూరమవుతున్న మహిళల దుస్థితి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత విస్తృత గ్రామ సభ సమావేశమయ్యే సమయానికి, మహిళలంతా ఒకే తాటిపైకి వచ్చి, ఒక ఉమ్మడి గళంతో ఒక కచ్చితమైన కార్యాచరణతో సభకు హాజరయ్యారు. ఫలితంగా, మహిళలపై హింసను ఏమాత్రం సహించేది లేదంటూ (జీరో టాలరెన్స్) గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మహిళల కోసం ఒక ప్రత్యేక సహాయ కేంద్రాన్ని (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేశారు. అలా ఒక గ్రామీణ స్థాయి చర్చ ఒక అద్భుతమైన పాలనా ప్రక్రియగా రూపాంతరం చెందింది. భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నికై, సేవలందిస్తున్న 14 లక్షలకు పైగా మహిళా ప్రజాప్రతినిధులలో పుష్పాంజలి ఒకరు. పరిస్థితులను మార్చేలా మహిళలకు గనుక నిర్ణయాధికారం ఇస్తే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో చెప్పడానికి నమన్‌గూడలో ఆమె చేసిన ప్రయత్నమే ఒక ప్రత్యక్ష నిదర్శనం.

మహిళానుకూల గ్రామ పంచాయతీలు 

ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యుఎన్ఎఫ్ పీఏ) సాంకేతిక మద్దతుతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను — ముఖ్యంగా లింగ సమానత్వంపై నిర్దేశించిన ‘లక్ష్యం 5’ను — స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘మహిళానుకూల గ్రామ పంచాయతీ’ కార్యక్రమానికి ఈ ఆకాంక్షే మూలస్తంభం. దీని వెనుక ఉన్న సూత్రం చాలా సరళమైనది: ప్రపంచవ్యాప్త లక్ష్యాలు ఎంత గొప్పవైనప్పటికీ, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన గ్రామ స్థాయి వ్యవస్థలు బలంగా ఉన్నప్పుడే ఆ లక్ష్యాలకు నిజమైన అర్థం ఉంటుంది. బడ్జెట్ రూపకల్పన, ప్రణాళికలు, ప్రతి స్థానిక సేవలోనూ స్త్రీపురుష సమానత్వం అనేది పాలనలో అంతర్భాగం కావాలి. మొదట మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, ఇప్పుడు దేశంలోని ప్రతి జిల్లాలో ఒక గ్రామ పంచాయతీకి విస్తరించింది. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా 770 పంచాయతీలు ఈ నమూనాను స్వీకరిస్తూ అధికారికంగా తీర్మానాలు చేశాయి. దీని ద్వారా వస్తున్న ఫలితాలు ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి:

  • బాల్యవివాహాల నిర్మూలన: బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లా నౌగఢ్ పంచాయతీలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించారు.
  • విద్యాభ్యాసానికి ఊతం: పాఠశాలలకు దూరం కాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ‘సైకిల్ బ్యాంకులు’ బాలికల చదువుకు ఉన్న అతిపెద్ద అడ్డంకిని తొలగించాయి.
  • ఆర్థిక, ఉపాధి వృద్ధి: 12 రాష్ట్రాల్లోని 163 గ్రామాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, మహిళలకు కల్పించిన రాజకీయ రిజర్వేషన్ల వల్ల ఉపాధి పథకాలలో వారి భాగస్వామ్యం 50 శాతానికి పైగా పెరిగింది. అలాగే మహిళలు స్వయంగా బ్యాంకు ఖాతాలు తెరిచే రేటు రెట్టింపు అయింది. విశేషమేమిటంటే, ఈ రిజర్వేషన్ గడువు ముగిసిన తర్వాత కూడా ఈ సానుకూల ప్రభావాలు సుదీర్ఘ కాలం కొనసాగాయి.

‌‌స్థిరమైన అభివృద్ధికి చర్యలు

ఈ మార్పులను కొనసాగించేందుకు ఉద్దేశపూర్వకమైన, వ్యవస్థీకృతమైన చర్యలు అవసరం:

  • మహిళల అవసరాలను గుర్తించే బడ్జెట్: ఇది గ్రామ పంచాయతీలలో ఒక తప్పనిసరి నిబంధనగా మారాలి.
  • పంచాయతీ అభివృద్ధి సూచి: పంచాయతీలు అభివృద్ధి ఫలితాలను ఎలా అందిస్తున్నాయో పర్యవేక్షించే ఈ జాతీయ పురోగతి నివేదిక గ్రామ స్థాయిలో లింగ సమానత్వ పురోగతిని మరింత కచ్చితంగా కొలవాలి.
  • నిధులు, విధుల వికేంద్రీకరణ: మహిళా నాయకులు ఇప్పటికే సాధిస్తున్న విజయాలను మరింత విస్తృతం చేయడానికి విధులు, ఆర్థిక వనరులను క్షేత్రస్థాయికి మరింతగా బదిలీ చేయాలి.

దీనికి సంబంధించిన వ్యవస్థాగత నిర్మాణం ప్రస్తుతం రూపుదిద్దుకుంటోంది. దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులకు క్రమబద్ధమైన శిక్షణ ఇచ్చేందుకు ‘సశక్త్ పంచాయతీ-నేత్రి అభియాన్’ తోడ్పడుతోంది. అనుభవజ్ఞులైన సర్పంచ్‌ల నుంచి కొత్తగా వచ్చిన వారికి పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని బదిలీ చేయడానికి మార్గదర్శకత్వ వ్యవస్థలు అధికారికంగా పనిచేస్తున్నాయి. ఇక ‘పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు’ కార్యక్రమం గ్రామ పాలన నుంచి దేశ అత్యున్నత సభల వరకు ఒక బలమైన అనుసంధాన మార్గాన్ని నిర్మిస్తోంది.

‌‌అంతర్జాతీయ గుర్తింపు

భారత్ రూపొందించిన ఈ విజయవంతమైన నమూనాను వర్ధమాన దేశాల మధ్య సహకారం ద్వారా తమ సొంత దేశాల పరిస్థితులకు ఎలా అన్వయించుకోవచ్చో ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం ‘నారీ శక్తి’, ‘వికసిత్ భారత్’ అనే నినాదాలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, వాస్తవ కార్యాచరణ రూపం దాల్చుతున్న తరుణమిది. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం గురించి దేశం ఆలోచిస్తున్న వేళ భారతదేశ గ్రామ పంచాయతీలు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తున్నాయి. సమ్మిళిత, సమగ్ర నాయకత్వానికి పునాది ఇప్పటికే పడింది. ఇప్పుడు ఈ నమూనాను మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది.

వివేక్ భరద్వాజ్,
ఆండ్రియా వోజ్నార్ 

(భరద్వాజ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి; వోజ్నార్ భారత్ లో UNFPA ఇండియా ప్రతినిధి)