నేరాలలో అగ్రగామి, సైబర్ క్రైమ్ రాజధానిగా తెలంగాణ!
“తెలంగాణాలో క్రైమ్ రేట్ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్ నగరంలో దారుణం.. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు.. హైదరాబాద్‌లో అయితే చెప్పడానికే వీల్లేదు.. బైక్ రేసులంటూ ఇష్టమొచ్చినట్టు వెళ్తున్నారు..” అని స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దికాలం క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ నేరగణాంకాల బ్యూరో (NCRB) 2024 ఏడాదికి సంబంధించి తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణలో నేరాల నమోదు రేటు పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు కంటే ఎక్కువగా ఉన్నది. 2024లో తెలంగాణలో మొత్తం 2,17,976 కాగ్నిజబుల్ నేరాలు (IPC, BNS, SLLకలిపి) నమోదయ్యాయి. 2023లో నమోదైన 1,83,644 కేసులతో పోలిస్తే ఇది 18.7% పెరుగుదలను సూచిస్తున్నది.
రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకూ నేరాల రేటు 568.9గా ఉన్నది. ఇది జాతీయ సగటు 418.9 కంటే చాలా ఎక్కువ. కేరళ, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ర్టాలు మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువ నేరాల రేటును కలిగి ఉన్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్ (296.6), కర్ణాటక (290.6) వంటి పెద్ద రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో నేరాల నమోదు గణనీయంగా ఎక్కువ ఉండటం గమనార్హం. టెక్నాలజీ పరంగా ముందంజలో ఉన్న తెలంగాణ. దేశంలో అత్యధిక సైబర్ నేరాలు నమోదైన రాష్ట్రంగా నిలిచింది. ఇప్పుడు సైబర్ నేరాలకు కూడా అడ్డాగా మారుతున్నది. 2024లో రాష్ట్రంలో సైబర్ నేరాలు 49% పెరిగాయి. మొత్తం 27,230 సైబర్ కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా మోసం, చీటింగ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు 17% తగ్గినట్టు గణాంకాలు చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా వీటి తీవ్రత పెరుగుతూనే ఉన్నది. పోలీసు విచారణలో 16,084 కేసులకు సంబంధించిన నివేదికలు సమర్పించినా, కేవలం 3,177 కేసుల్లోనే చార్జిషీట్లు దాఖలు కావడం దర్యాప్తులోని జాప్యాన్ని సూచిస్తున్నది. 2025లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా 2,491 హానికరమైన యూఆర్‌ఎల్‌లను గుర్తించి, 1,311 లింకులను తొలగించారు. అలాగే 8,979 ఐఎంఈఐ నంబర్లను, 8,856 సిమ్ కార్డులను బ్లాక్ చేశారు. అయినా రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి.
మహిళల భద్రత విషయంలో తెలంగాణ గణంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలో మహిళలపై అత్యధిక నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2024లో మహిళలపై 24,495 నేరాలు నమోదు కాగా, అందులో భర్త లేదా బంధువుల వేధింపులు 28.4% ఉన్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు (పోక్సో కేసులు) కూడా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. సగటున రోజుకు 8 పోస్కో కేసులు తెలంగాణాలో నమోదు అవుతున్నాయి. లైంగిదాడి కేసుల్లో 98.03% నిందితులు బాధితులకు తెలిసిన వారే ఉండటం సామాజిక విశ్లేషకులను కలవరపెడుతున్నది. వీటి పరిష్కారానికి రాష్ట్రంలో 400 ప్రత్యేక పోక్సో కోర్టులు పనిచేస్తున్నాయి. అయినా నేరస్తుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు.
రాష్ట్రంలో హత్యలు, లైంగికదాడులు, దోపిడీల వంటి తీవ్రమైన నేరాల స్వభావం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. 2025లో హత్యల సంఖ్య 781గా నమోదు కాగా, లైంగికదాడి కేసులు 2,549గా నమోదయ్యాయి. కొద్ది కాలంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్, సెంట్రల్ రీజియన్లలో జరుగుతున్న హత్యలు నేరగాళ్ల తెగింపును బట్టబయలు చేస్తున్నాయి. రద్దీగా ఉండే రోడ్లపై పట్టపగలే హత్యలు జరుగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలీసులంటే భయం లేదు.. ప్రభుత్వమంటే పట్టింపే లేదు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నివాసం ఉండే ప్రాంతంలో జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో డ్రగ్స్ వినియోగం అరికట్టలేకపోతున్నది. నగరంలో నడిరోడ్లపైనే యువత యథేచ్ఛగా గంజాయి సేవిస్తున్నది. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున గంజాయి, సింథటిక్ డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మాదకద్రవ్యాల ముఠాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’ మామూళ్లకు అలవాటు పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025 వార్షిక నివేదిక ప్రకారం, మాదకద్రవ్యాల కేసులు గణనీయంగా పెరిగాయి. 2023లో 1,464 కేసులు నమోదు కాగా.. 2025 నాటికి 2,734కి డ్రగ్స్ కేసులు చేరాయి. 2023లో 3,157 కాగా, 2025లో 5,703 మందిని అరెస్ట్ చేశారు. నైజీరియా, ఘనా, సూడాన్ దేశాలకు చెందిన 93 మంది విదేశీయులను డ్రగ్స్ సరఫరా, మనీ లాండరింగ్ ఆరోపణలపై బహిష్కరించారు. అయినా డ్రగ్స్ సరఫరా తగ్గలేదు. వాటి వినియోగం ఏమాత్రం కట్టడి కాలేదు.
కృష్ణ చైతన్య

