ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త మే 18న నార్వేలో పర్యటించబోతున్నారు. ఆయనే.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! నార్వే రాజు హెరాల్డ్ ఆయనకు స్వయంగా సాదర స్వాగతం పలుకుతారు. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ భారత వాణిజ్య రంగానికి ప్రాచుర్యం కల్పించే దిశగా ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. అటుపైన భారత్-నార్డిక్ దేశాల (నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్) ప్రధానమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నార్డిక్ ప్రధానమంత్రులు తమ భారతీయ సహచరుడి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నార్డిక్ ప్రధానమంత్రులకు తమతమ దేశాల్లో ప్రజామోదం ఇవాళ 30 శాతానికి పరిమితం. అయితే, ఈ విషయంలో సుమారు 70 శాతంతో మోదీ వారికి అందనంత ఎత్తున నిలుస్తున్నారు. ప్రపంచంలోని కీలక దేశాల్లో ఎక్కడా.. ఏ నాయకుడికీ.. మోదీ స్థాయిలో జనాదరణ లభిస్తున్న దాఖలాలు లేవు.
భారత దేశంలో మోదీ పుష్కర కాలానికి మించి అధికారంలో కొనసాగుతున్నారు. మరోసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకుంటే, తిరిగి అధికారం దక్కించుకోవడం నల్లేరుపై నడకేననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐరోపా నాయకుల విషయంలో ఇలాంటి సానుకూలత నిస్సందేహంగా సుదూర స్వప్నమే. మోదీ ఇంతటి విజయం సాధించగలిగారంటే- ఆర్థిక పురోగమనం వేగం పుంజుకోవడం, విజయ సాధనకు తగిన సైద్ధాంతిక పునాది, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాజకీయ పార్టీ సహా ఆయన స్వీయ జీవనగాథను కూడా ఓ కారణంగా పేర్కొనవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలలో దాదాపు ప్రతి ఒక్కరూ ఉన్నత మధ్యతరగతి వర్గం నుంచి వచ్చినవారే. కానీ, మోదీ నేపథ్యం అత్యంత విశిష్టం… ఆయన తల్లిదండ్రులు గుజరాత్లోని వడ్నగర్ రైల్వే స్టేషన్ సమీపాన మూడు దుకాణాలు నడిపేవారు. అదొక చిన్న పాక్షిక పట్టణ ప్రాంతం. ఆ రైల్వే స్టేషన్లో వారు టీ విక్రయిస్తుండే వారు. భారతీయులలో చాలామందికి ఆ ప్రాంతం గురించి తెలిసి కూడా ఉండదు. అలాంటి స్థాయి నుంచి నేటి అత్యున్నత రాజకీయ శిఖర స్థితికి చేరడంలో మోదీ స్వీయ ప్రతిభ అపారం. ఇందుకు ఊతమిచ్చిన హిందూ జాతీయవాద ఉద్యమానికి తప్ప మరెవరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పే అవసరం లేదు. స్వయంకృషితో ఎదిగిన కార్యదక్షుడు, నార్వే ప్రథమ ప్రధానమంత్రి ‘ఐనార్ గేర్హార్సెన్’తో పోల్చదగిన నాయకుడు మోదీ!
శరవేగంగా పురోగమించే భారతదేశానికి నాయకత్వం వహించడం అదృష్టమేనని చెప్పవచ్చు కానీ, ఆ ప్రగతికి బలమైన చోదకశక్తి ఆయనే. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 7 శాతం వృద్ధితో పొరుగున ఉన్న చైనా సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటినీ వెనక్కు నెడుతూ అసమాన వృద్ధి పథంలో దూసుకెళ్తోంది. భారతదేశంలోని అత్యంత ధనిక-పేద రాష్ట్రాల మధ్య అగాధం చాలా లోతైనది. చైనాతో పోలిస్తే ఉన్నత విద్యావంతులైన శ్రామిక శక్తి భారతదేశంలో లేదు. ఇప్పటికీ అధికార యంత్రాంగం అవసరానికి మించిన స్థాయిలో కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఎలాంటి కీలక ఎగుమతి పరిశ్రమనూ భారతదేశం అభివృద్ధి చేయలేకపోయింది. అయినప్పటికీ, ప్రస్తుత వృద్ధి శాతం ప్రకారం- 2050 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 రెట్లు వృద్ధి చెందడం తథ్యం. ఆ విధంగా అమెరికాతో పోటీపడుతూ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది. భారతదేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో నేను పర్యటించాను. ప్రతిచోటా వినూత్న ప్రగతి నమూనాలను గమనించాను. ముఖ్యంగా సరికొత్త-ఆధునిక విమానాశ్రయాలు, దేశంలోని మారుమూల ప్రాంతాలనూ సంధానించే మెరుగైన రహదారులు, గుజరాత్లో నిర్మితమవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి పార్కు, ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర-పవన-జల విద్యుత్ కేంద్రం.. వాటిలో కొన్ని మాత్రమే. కాలుష్య రహిత వృద్ధికి మోదీ భరోసా ఇస్తున్నారు… భారత్ నేడు ప్రపంచంలోనే సౌర, పవన విద్యుదుత్పాదనలో మూడో అతిపెద్ద దేశం కావడం ఇందుకు నిదర్శనం. సమీప భవిష్యత్తులో అమెరికాను అధిగమిస్తూ రెండో స్థానంలోకి దూసుకెళ్తుందనడంలో సందేహం లేదు. భారత్లో నిరుడు బొగ్గు ఉద్గారాలు తొలిసారి బాగా తగ్గాయి.
ఈ నేపథ్యంలో మోదీ కాలుష్య విముక్తి సందేశం పాశ్చాత్య నాయకులకు నిస్సందేహంగా ఓ పాఠం నేర్పుతుంది. మోదీ ఏ వేదికపై ప్రసంగించినా నేను తప్పక హాజరవుతుంటాను. ప్రపంచ వాతావరణ చర్చలు లేదా ఉద్గారాల గురించి దాదాపుగా ఆయనెప్పుడూ ప్రస్తావించింది లేదు. పర్యావరణం కోసం త్యాగాలు చేయాల్సిందిగానూ ఆయనెవరినీ అభ్యర్థించరు. కాలుష్య రహిత వృద్ధి సాధనతో భారత్లోని 150 కోట్ల మంది ప్రజలను పేదరిక విముక్తులను చేయగలమన్నదే ఆయన సందేశం. ఇకపై ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మధ్య ఎంపిక అవకాశమేదీ ఉండదు. భారత్లో తదుపరి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లౌకిక పార్టీలు ఒకవేళ గెలుపు సాధించినా, దేశ భావజాలం హిందూ జాతీయవాదంగానే కొనసాగుతుంది. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుంచి పాశ్చాత్యేతర దేశాలకు ఎదురవుతున్న ఓ ప్రశ్నకు భారత హిందూ జాతీయవాదమే ఓ సమాధానం. పాశ్చాత్య దేశాలను అనుకరించకుండా ఆధునికీకరణ సాధించడం ఎలా? ప్రపంచంలో ఈ చిక్కుముడిని విప్పిన తొలి దేశం జపాన్! ఆ దేశం తన మూలాలను వదులుకోకుండానే అత్యంత ఆధునికంగా రూపొందుతూ వచ్చింది. అలాగే, కొరియా నేడు జపాన్ కన్నా ధనిక దేశం మాత్రమే గాక కొరియన్ సంస్కృతి-సంగీతం ప్రధాన ఎగుమతిదారు. చైనా కూడా తన మూలాలైన కన్ఫ్యూషియనిజం, తావోయిజం, బౌద్ధమతాన్ని వీడకుండానే ఆధునికతను సంతరించుకుంది.
ప్రస్తుతం బిజెపి 10 కోట్ల మందికిపైగా కార్యకర్తల సభ్యత్వంతో ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా పరిగణనలో ఉంది. ఉత్తర, మధ్య భారతంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ పార్టీకి అంకితభావం గల కార్యకర్తలున్నారు. ఈ పార్టీ దేశవ్యాప్తంగా ఒక విశిష్ట, అసాధారణ విజయం సాధించింది. ఆ మేరకు ఉన్నత, నిమ్న, అంటరాని వర్గాలన్నిటి నుంచి ఈ పార్టీకి సమాన మద్దతు లభిస్తోంది. దేశంలోని కోటానుకోటీశ్వరులు సహా మారుమూల ప్రాంతాల గిరిజనం కూడా బిజెపిని విశేషంగా ఆదరిస్తున్నారు. అయితే, బిజెపి కార్యకలాపాల్లో రంధ్రాన్వేషణ పాశ్చాత్య విశ్లేషకులకు ఇప్పుడొక కాలక్షేపంగా మారింది. ఆ పార్టీ హిందువుల ఐక్యతకు బాసటగా నిలుస్తుందన్న విమర్శకుల వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు. కానీ, ఆ పార్టీ పాలనలో ముస్లింలు, హిందువుల మధ్య ఘర్షణలు పెరిగాయనే విమర్శలకు పెద్దగా ఆధారాలేవీ లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడే హింస, మారణకాండ వంటివి అధికంగా చోటుచేసుకున్నాయి. పొరుగు దేశాల ముస్లింలు లక్షలాదిగా భారత్లోకి వలస వస్తుండగా దేశం నుంచి పారిపోయే ముస్లింలు దాదాపుగా ఒక్కరూ లేరు. కానీ… ఇస్లాం, క్రైస్తవం విదేశీ మతాలని, మధ్యయుగాల్లో ముస్లిం దండయాత్రలను, బ్రిటిష్ వలసవాదాన్ని సమానంగానే పరిగణించాలని బిజెపి గట్టిగా వాదించడం అధికశాతం ముస్లింలలో అభద్రతా భావానికి దారితీస్తోంది. బిజెపి వాదనలో చాలావరకూ సహేతుకమే. ఉదాహరణకు.. ఇతర మతాలతో పోలిస్తే ఇస్లాంలో పురుషులు సులువుగా విడాకులు పొందగల ప్రత్యేక వివాహ చట్టం ఉండరాదన్నది బిజెపి వాదన. ఈ నేపథ్యంలో హిందూ ధర్మ మూలాలతో ఓ నవ్య, శక్తియుత భారత్ ఆవిర్భవిస్తున్న తరుణంలో ప్రపంచంలోనే 20 కోట్ల మేర మైనారిటీ జనసంఖ్య భారీగాగల భారత్లో ముస్లింలను తన వెంట నడిపించడం బిజెపికి సాధ్యమవుతుందా అన్నదే అసలైన పరీక్ష.
ప్రజాస్వామ్య నమూనాను ఎంచుకున్న ఒకనాటి ఏకైక అతిపెద్ద, పేద బ్రిటిష్ వలసదేశం భారత్. కానీ, ఇదేదో బ్రిటిష్ వారి గొప్పదనం ఎంతమాత్రం కాదు… వారు తరచూ జబ్బలు చర్చుకుంటూ ఇది తమ ఘనతేనంటుంటారు. అయితే పాకిస్థాన్, మయన్మార్, గల్ఫ్ రాచరిక దేశాల్లోనూ ఇదే తరహాలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లి ఉండాలి కదా? ఏదేమైనా, భారతీయ సంస్కృతి-సంప్రదాయాలలో ప్రజాస్వామ్యం లోతుగా పాతుకుపోయింది కాబట్టే, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా వర్ధిల్లుతోంది. నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను కాపాడాలని చూస్తున్న నార్వేకు, అదే ఆలోచనలు కలిగిన కొత్త దేశాలతో స్నేహం అవసరం. మరోవైపు నేటి ప్రపంచ పరిస్థితుల రీత్యా కొత్త అవకాశాలను అన్వేషిస్తున్న నార్వే వాణిజ్య రంగం కూడా భారత్తో సన్నిహిత సంబంధాల ద్వారా ఎంతో ప్రయోజనం పొందగలుగుతుంది. ఇప్పుడు చేయాల్సిందల్లా- ఉపన్యాసాలివ్వడం మాని, ఇతరులు చెప్పేది వినడానికి చెవులొగ్గడమే. చివరగా- ఉభయతారక ప్రయోజన సిద్ధికి అపార అవకాశాలు అందిరావాలంటే అనుసరణీయ మార్గమిదే!
ఎరిక్ సోల్హీమ్
(ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనకు ముందు ప్రచురితమైన ఈ వ్యాసం జనసందేశ్ పాఠకుల కోసం..)

