రైతుల పక్షాన నిలిచిన ‘రైతు గోస – బిజెపి భరోసా’ యాత్ర
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, రైతు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన “రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమాన్ని విశేష స్పందన వచ్చింది. చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం రాష్ట్రవ్యాప్తంగా మే 25 నుంచి 28 వరకు నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆవేదనను దగ్గరుండి విన్నారు.
మే 25న తొలిరోజు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల, మెదక్ జిల్లా గజ్వేల్ లో సాగగా.. రెండో రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌తో పాటు, వడపర్తి ఐకేపీ (IKP) కేంద్రాన్ని బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించారు. మూడో రోజు పెద్దపల్లి జిల్లా మంథని రూరల్ పరిధిలోని గుంజపడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. చివరి రోజు నిర్మల్ జిల్లాలోని కడెం, ఖానాపూర్, మామడ, సోన్, దిలావర్ పూర్, సారంగాపూర్ మండలాల్లో ఈ పర్యటన కొనసాగింది. మరోవైపు రాంచందర్ రావు నేతృత్వంలోని మరో బృందం నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పీఏసీ సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. బిజెపి బృందం ఎక్కడికెళ్లినా అక్కడ సమస్యల తిష్ట వేశాయి. అన్నదాతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బిజెపి నేతల హెచ్చరికతో జడుసుకున్న కాంగ్రెస్ అంతోఇంతో చర్యలు చేపట్టింది.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”వ్యవసాయ శాఖ నుండి ధాన్యం ఉత్పత్తి అంచనాలపై నివేదికలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఐకేపీ కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం.” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గన్నీ బ్యాగులు, రవాణా, హమాలీ చార్జీలకు కావలసిన నిధులు సమకూరుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులపై భారాన్ని నెడుతోందని మండిపడ్డారు. అంతేకాకుండా, ప్రతి బస్తాకు సుమారు 4 కిలోల చొప్పున తేమ, తరుగు పేరుతో కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని, హమాలీ చార్జీలను కూడా రైతుల నుండే వసూలు చేయడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం, మక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు తడిసి మొలకలు వస్తున్నా, ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంఎస్పీని పెంచుతూ రైతులను ప్రోత్సహిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనే చిత్తశుద్ధి లేక సాకులు వెతుకుతోందని విమర్శించారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా భారీగా నిల్వ ఉందని, అధికారులు చెబుతున్న 80% కొనుగోలు అనేది అబద్ధమని విమర్శించారు. రైతుల కష్టాలను ఏసీ రూముల్లో కూర్చుని కాకుండా, క్షేత్రస్థాయిలో చూడాలని ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. సంచులు లేకపోవడం, హమాలీ చార్జీలు, రవాణా ఖర్చులను రైతులపైనే రుద్దడం అన్యాయమని, చివరి గింజ కొనే వరకు బిజెపి పోరాటం ఆపదని స్పష్టం చేశారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన లారీలను పెంచి, వర్షాకాలం రాకముందే ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, రైతుల ఉసురు పోసుకుంటుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేము ఓటు వేస్తేనే మీరు సీఎం అయ్యారు” అని రైతులు ఆవేదన చెందుతున్నారని గుర్తు చేశారు. భూయజమానుల థంబ్ ఇంప్రెషన్ వంటి మూర్ఖపు నిబంధనలతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు ఒక పక్క ఎండలకు, మరోపక్క ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్నాడని, ఇటువంటి దుర్మార్గాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని హెచ్చరించారు.
ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను పకడ్బందీగా చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక, అమ్ముకోలేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వడ్లు మాత్రమే కాకుండా, అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అలా చేయలేని పక్షంలో రైతులకు కనీస మద్దతు ధరకు గ్యారెంటీ కల్పించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం మొదలవుతున్న తరుణంలో, నానిపోతున్న వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయం అంటేనే భయపడే దుస్థితి
మే 27న కరీంనగర్ లోని బొమ్మకల్ ఐకేపీ కేంద్రాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు. అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తడిసిన వడ్లను చూపిస్తూ రైతులు వాపోయారు. బండి సంజయ్ తో పాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ”రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమిది. నెల రోజులుగా మొత్తుకుంటున్నా వడ్లు కొనకుండా రైతులను అరిగోస పెడుతున్నారు. సీఎం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయమే లేదు. తలో మాట చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. తడిసిన ధాన్యం పేరుతో పెద్ద ఎత్తున కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే దుస్థితి నెలకొంది. పంట నష్టపోతే పరిహారమిచ్చే దిక్కు లేదు. పడించిన వడ్లను కొనకపోతే… రైతులకు ఇంకేం మేలు చేస్తారు? వడ్ల పైసలన్నీ కేంద్రమే ఇస్తుంటే కొనుగోలు చేయడానికి మీకేం ఇబ్బంది? ” అని అన్నారు.
