మరెన్నో రికార్డులు సాధించనున్న మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా మరో మైలురాయిని అధిగమించారు. జూన్ 10 నాటికి ఆయన పదవిలో వరుసగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. తద్వారా తొలి సార్వత్రిక ఎన్నికల అనంతరం జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును మోదీ అధిగమించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించిన 13 ఏళ్ల కాలాన్ని కూడా కలుపుకొంటే, ఒక ప్రభుత్వ అధినేతగా ఎన్నికై ఆయన 9,000 రోజులు పూర్తి చేసుకున్నట్టవుతుంది. ఈ క్రమంలో పవన్ చామ్లింగ్ (సిక్కిం), నవీన్ పట్నాయక్ (ఒడిశా) వంటి ముఖ్యమంత్రుల రికార్డులను సైతం ఆయన దాటారు. అక్టోబర్ నెల వచ్చేసరికి, మోదీ ప్రజా జీవితంలో (రాజకీయ పదవుల్లో) 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. అత్యంత సుదీర్ఘ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా, అలాగే వరుసగా రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. మొత్తంగా మోదీ నేతృత్వంలో బిజెపి వరుసగా ఆరు ఎన్నికల్లో విజయం సాధించింది. ఇందులో మూడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మూడు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. గుజరాత్లో అత్యంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా మోదీదే. అయితే, ఈ గణాంకాలు ఈ కథనంలో ఒక కోణం మాత్రమే. మోదీ రాజకీయ ఎదుగుదలకు, ఆయన కంటే ముందున్న నేతల ఎదుగుదలకు మధ్య ఎన్నో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. నెహ్రూతో పోలిక ఇక్కడ అనివార్యం. ఎందుకంటే స్వతంత్ర భారత చరిత్రలో నెహ్రూ మాత్రమే మోదీ తరహాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా రాణించారు. నెహ్రూ రాజకీయ ఎదుగుదలకు ప్రధాన కారణం స్వాతంత్ర్యోద్యమంలో ఆయన భాగస్వామ్యం, మహాత్మా గాంధీ మద్దతు. 1946లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆపద్ధర్మ ప్రధానిగా నెహ్రూ ఎంపిక వెనుక జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. 15 ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలలో 12 కమిటీలు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును ప్రతిపాదించాయి. నెహ్రూ పేరును ఏ ఒక్క కమిటీ కూడా ప్రతిపాదించలేదు. అయినప్పటికీ, రాజేంద్ర ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే, గాంధీ మాత్రం ‘ఆకర్షణీయమైన నెహ్రూ ‘ వైపే మొగ్గు చూపారు.
మరింత ముఖ్యమైన విషయమేమిటంటే, స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం జాతీయవాదులందరూ ఒకచోటకు చేరిన ఒక ఉమ్మడి వేదిక. అందుకే, ‘హరిజన్’ పత్రికలో ప్రచురితమైన తన ‘చివరి అభీష్టం ‘ లో గాంధీ స్పష్టంగా పేర్కొన్నారు: “పార్లమెంటరీ యంత్రాంగంగా కాంగ్రెస్ తన పాత్రను ముగించేసింది”, కాబట్టి “ప్రస్తుత కాంగ్రెస్ సంస్థను రద్దు చేయాల”ని ఆయన సిఫార్సు చేశారు. కానీ దానికి భిన్నంగా, నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ తొలి సార్వత్రిక ఎన్నికల్లో “స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ”గా ప్రజల్లోకి వెళ్లి భారీగా ఓట్లను రాబట్టుకుంది. ఆ గుర్తింపు కారణంగా స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో కాంగ్రెస్కు అనైతికమైన, మితిమీరిన ఎన్నికల లబ్ది చేకూరి అసమాన పోటీకి దారితీసింది.
ప్రతి ప్రధానిలాగే నెహ్రూ ఖాతాలోనూ కొన్ని విజయాలు ఉన్నాయి. భారతదేశ తొలి నాళ్ల పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన, వ్యవస్థల నిర్మాణానికి ఆయన అభిమానులు నెహ్రూను శ్లాఘిస్తారు. అయితే ఆయనకు ఉన్న ‘సోషలిస్టు తరహా సమాజం ‘ అనే వ్యామోహం దేశానికి మేలు కంటే కీడే ఎక్కువ చేసిందని విమర్శకులు వాదిస్తారు. 1955 నుండి 1965 మధ్య కాలంలో భారతదేశంలో పేదరిక రేటు 52.66 శాతం నుండి 58.60 శాతానికి పెరిగింది. పేద ప్రజల సంఖ్య 1951-55లో 19.87 కోట్లు ఉండగా, అది 1966-70 నాటికి 30.17 కోట్లకు చేరుకుంది. నెహ్రూ హయాంలో జీప్ కుంభకోణం (1948), ముంద్రా కుంభకోణం (1957-58), ధర్మ తేజ షిప్పింగ్ రుణం కుంభకోణం (1960) వంటి అవినీతి ఆరోపణలు చోటుచేసుకున్నాయి. ఆయనను విదేశాంగ విధాన నిపుణుడిగా పరిగణించినప్పటికీ, ఆయన హయాంలోనే అలీన విధానం తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైంది, చైనా చేతిలో భారతదేశం అవమానకరమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీనికి భిన్నంగా, గాంధీ వంటి ఎలాంటి రాజకీయ గాడ్ ఫాదర్ లేకుండా మోదీ రాజకీయ ప్రస్థానం సాగింది. ఆయన అత్యంత సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, హిందూ సాంస్కృతిక-జాతీయవాద ఉద్యమ సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తగా ఎదిగారు. ప్రజా జీవితంలో తన 25 ఏళ్ల కాలంలో మోదీ అవినీతి రహిత పాలనను అందించారు. కేవలం అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించి ‘వికాస్ పురుష్ ‘గా గుర్తింపు పొందారు. ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానాల నిర్వహణలో నెహ్రూ, ఇతరులకంటే మోదీ మరింత విజయవంతమయ్యారని రుజువైంది. గత దశాబ్ద కాలంలో దేశ జీడీపీ రెట్టింపు అయింది. సంపూర్ణ పేదరికం దాదాపుగా నిర్మూలన జరిగింది. దాదాపు 25 కోట్ల మంది ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు. విదేశాంగ విధానంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, బహుళ-అలీన విధానాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా నేటి బహుళ-ధృవ ప్రపంచ వ్యవస్థలో భారతదేశం ఒక కీలకమైన శక్తిగా అవతరించింది.
భారతదేశ చరిత్రలో అత్యంత సమర్థుడైన, విజయవంతమైన ప్రధాన మంత్రిగా మోదీ నిస్సందేహంగా గుర్తుండిపోతారు. ఆయన ప్రస్తుతం తన మూడో విడత పదవీకాలం మధ్యలో ఉన్నారు. అయినప్పటికీ దేశ రాజకీయ రంగంపై ఆయన ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతోంది. రాబోయే మరెన్నో సంవత్సరాల పాటు ఆయన భారతదేశాన్ని నడిపించనుండటంతో, భవిష్యత్తులో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. కానీ కేవలం సంఖ్యలు మాత్రమే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టడం లేదు. ఆయన అందిస్తున్న పాలనా నాణ్యత, సైద్ధాంతిక దార్శనికత, సమర్థమైన అభివృద్ధి ఎజెండాయే ఆయనను భారత రాజకీయాల్లో ఉజ్వల తారగా మార్చాయి.
రామ్ మాధవ్,
బిజెపి నేత

