MISSION POSHAN

మిషన్ పోషణ్ 2.0: బాలల సమగ్రాభివృద్ధికి కొత్త ఊపు

భారతదేశ అభివృద్ధి ఎజెండాలో పోషకాహారానికి పెద్దపీట వేస్తూ మార్చి 8, 2018న ‘పోషణ్ అభియాన్ (Poshan Abhiyaan)’  ప్రారంభమైంది. పోషకాహారాన్ని కేవలం సంక్షేమ అంశంగా చూడకుండా, మానవ మూలధన అభివృద్ధి, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG), దేశ దీర్ఘకాలిక వృద్ధికి కీలకమైన ప్రాధాన్యంగా గుర్తించడంలో ఈ కార్యక్రమం (మిషన్) ఒక మైలురాయిగా నిలిచింది.

గడిచిన ఎనిమిదేళ్లలో పోషణ్ అభియాన్ దేశ పోషకాహార పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 26కు పైగా మంత్రిత్వ శాఖలను సమన్వయం చేస్తూ, కేవలం ఆరోగ్యం లేదా ఆహారం మాత్రమే కాకుండా పారిశుధ్యం, విద్య, తాగునీరు, మహిళా సాధికారత ద్వారా పోషకాహార లోపాన్ని అరికట్టడానికి ఈ మిషన్ కృషి చేస్తోంది. ముఖ్యంగా, శిశువు గర్భంలో పడినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు (మొదటి 1,000 రోజులు) సమయం శారీరక, మేధో వికాసానికి అత్యంత కీలకమని ఈ మిషన్ గుర్తిస్తుంది.

పోషణ్ అభియాన్ నుంచి మిషన్ పోషణ్ 2.0 వరకు

భారతదేశంలో దశాబ్దాలుగా పోషకాహార కార్యక్రమాలు వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో, వేర్వేరు సమూహాలను లక్ష్యంగా చేసుకుని, అనేక పథకాల ద్వారా అమలయ్యాయి. ఇవి పోషకాహారంలోని వివిధ లోపాలను పరిష్కరించినప్పటికీ, వీటి ప్రభావం మాత్రం ఆయా రంగాలకే పరిమితమైపోయింది. కాలక్రమేణా ఈ పథకాలన్నింటినీ ఏకీకృతం చేసి, సమన్వయంతో అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. 1975లో ప్రారంభించిన సమీకృత శిశు అభివృద్ధి సేవలు (ఐసిడిఎస్) పథకం  అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారం, ఆరోగ్య సేవలు, ప్రారంభ బాల్య సంరక్షణకు పునాది వేసింది.

తల్లి ఆరోగ్యం అనేది బిడ్డ ఆరోగ్యం, పోషణను నిర్ణయించే కీలక అంశమని గుర్తిస్తూ, 2017లో ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ను ఎన్డీయే ప్రభుత్వం   ప్రవేశపెట్టింది.  ఈ పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు నేరుగా నగదు బదిలీ చేస్తూ ప్రసూతి ప్రయోజనాలను కల్పించి, వారికి ఆర్థిక చేయూతను అందించారు. అదే ఏడాది నీతి ఆయోగ్ జాతీయ పోషకాహార వ్యూహం (2017) పథకాల ఏకీకరణ, మెరుగైన పర్యవేక్షణ, సామాజిక భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. అంతేకాకుండా దీనిని ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలని సిఫార్సు చేసింది. దీనిని ప్రాతిపదికగా తీసుకుని 2018లో ‘పోషణ్ అభియాన్’ను భారత జాతీయ పోషకాహార మిషన్‌గా ప్రారంభించారు. వివిధ మంత్రిత్వ శాఖలను,  పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, నిర్ణీత కాలపరిమితితో కూడిన లక్ష్యాలు, డిజిటల్ పర్యవేక్షణ, ‘జన ఆందోళన్’ (ప్రజా ఉద్యమం) పద్ధతిలో దీనిని రూపొందించారు.

2021-22 కేంద్ర బడ్జెట్ ద్వారా దేశంలోని విభిన్న పోషకాహార కార్యక్రమాలను ‘మిషన్ పోషణ్ 2.0’ (మిషన్ సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 (Mission Poshan 2.0) పేరుతో మరింత పటిష్టం చేసి, ఒక సమగ్ర ఏకీకృత చట్రాన్ని నిర్మించారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ కింది పథకాలను  విలీనం చేశారు:

  • అంగన్‌వాడీ సేవలు
  • కౌమార బాలికల పథకం  
  • పోషణ్ అభియాన్

ఈ ఏకీకరణ ద్వారా మాతృ పోషణ, శిశు, చిన్న పిల్లల ఆహార నియమాలు,  తీవ్రమైన పోషకాహార లోపం/ మధ్యస్థ పోషకాహార లోపాలకు  చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అలాగే, పిల్లల్లో ఎదుగుదల లోపం, వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం, రక్తహీనత , కృశించిపోవడం  వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుష్  ఆధారిత పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  ఈ మిషన్ ప్రాధాన్యమిచ్చింది.

పునర్వ్యవస్థీకరణ తర్వాత మిషన్ మూడు విభాగాలుగా పనిచేస్తోంది:

  1. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషణ మద్దతు
  2. 3-6 ఏళ్ల పిల్లలకు బాల్య సంరక్షణ, విద్య, 0-3 ఏళ్ల పిల్లలకు ప్రాథమిక శిక్షణ
  3. సక్షమ్ అంగన్‌వాడీలుగా అంగన్ వాడీలలో మౌలిక వసతుల పెంపు

1. పోషణ మద్దతు

జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్-2 ప్రకారం 6 నెలల నుంచి 6 ఏళ్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అనుబంధ పోషకారం అందిస్తున్నారు. 2023 జనవరిలో సవరించిన నిబంధనలు కేవలం క్యాలరీలపైనే కాకుండా నాణ్యమైన మాంసకృత్తులు (ప్రొటీన్), ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, జింక్, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి6, బి12 వంటి సూక్ష్మపోషకాలపై దృష్టి పెట్టాయి. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అదనపు పోషకాహారం అందిస్తున్నారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ భూముల్లో పోషణ్ వాటికలు (న్యూట్రి గార్డెన్స్) ఏర్పాటు చేసి స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. మహిళా శిశు అభివృద్ధి, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా విడుదల చేసిన నిబంధనావళి ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించి, తీవ్ర పోషకాహార లోపం లేదా తీవ్ర బరువు తక్కువ  ఉన్నవారిని గుర్తిస్తారు. వైద్య సమస్యలు ఉన్నవారిని పోషణ పునరావాస కేంద్రాలకు  పంపుతారు. సమస్యలు లేని వారికి ఇంటి వద్దనే స్థానికంగా  పోషకాహారం అందిస్తారు.

2. బాల్య సంరక్షణ, విద్య  

జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించిన 5+3+3+4 విధానంలో మొదటి ఐదేళ్ల పునాది దశలో 3-6 ఏళ్ల బాల్య సంరక్షణ, విద్యను  అంగన్‌వాడీల ద్వారా అనుసంధానం చేశారు. ఈ లక్ష్యంతో ‘పోషణ్ భీ పఢాయీ భీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కింద 

  • 2026 మార్చి 31 నాటికి 41,645 రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లు, 10,58,317 అంగన్‌వాడీ కార్యకర్తలకు మొదటి విడత శిక్షణ పూర్తయింది.
  • 2025 నవంబర్ నుంచి రెండో విడత శిక్షణ ప్రారంభమైంది.

పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా 249 వీడియోలు, 190 వాయిస్ నోట్స్, 159 పిడిఎఫ్లతో రోజువారీ అభ్యాస సూచనలు అంగన్‌వాడీ కార్యకర్తలకు అందుతున్నాయి. ప్రతి నెలా నిర్ణీత సమగ్ర బాల్య శిక్షణ, విద్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి కేంద్రానికి ఏటా రూ 3,000 ప్రీ-స్కూల్ కిట్ల కోసం కేటాయిస్తున్నారు. 2025 ఆగస్టులో ‘విద్యారంభ్’  సర్టిఫికెట్ ప్రారంభించారు. 2026 మార్చి నాటికి 22 లక్షలకు పైగా సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 2025 సెప్టెంబర్ 3న విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి అంగన్‌వాడీలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇప్పటికే 2.9 లక్షల కేంద్రాలు పాఠశాలల్లో విలీనమయ్యాయి. 2026 ఏప్రిల్‌లో పోషణ్ ట్రాకర్‌లో ఇళ్ళకు  వెళ్ళి  చూసే కాలపట్టికను చేర్చారు. గర్భిణులకు 4, ప్రసవం తర్వాత మొదటి నెలలో 4, 2 నెలల నుంచి ఏడాది వరకు 7, 1-2 ఏళ్లలో 5, 2-3 ఏళ్లలో 3 చొప్పున మొత్తం 23 గృహ సందర్శనల గడువును నిర్దేశిస్తారు. 

రెండు లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఎల్ఇడి స్క్రీన్లు, వాటర్ ప్యూరిఫయర్లు, స్మార్ట్ లెర్నింగ్ పరికరాలు, పోషణ్ వాటికలతో ఆధునికీకరిస్తున్నారు. 2021 మార్చి 1న ప్రారంభమైన పోషణ్ ట్రాకర్ దేశంలోనే అత్యంత అధునాతన సామాజిక రంగ డిజిటల్ వేదికగా నిలిచింది. 2026 మార్చి నాటికి 14,03,170 అంగన్‌వాడీ కేంద్రాలు, సుమారు 8,95,29,425 లబ్ధిదారులను ఇది నిజ సమయంలో పర్యవేక్షిస్తోంది. ఆధార్ ఆధారిత గుర్తింపు, ముఖగుర్తింపు వ్యవస్థ ద్వారా నకిలీ నమోదులను తొలగించారు. ఈ వినూత్న పాలనకు 2024లో ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఫిర్యాదుల కోసం 2022 నవంబర్‌లో ప్రారంభించిన 14408 హెల్ప్‌లైన్ స్థానంలో 2025 నవంబర్ నుంచి 1515 నంబర్ అందుబాటులోకి వచ్చింది. ఇది 17 భాషల్లో సేవలందిస్తోంది.

ప్రజా ఉద్యమంగా పోషణ

పోషణ్ అభియాన్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిద్దారు.

  • పోషణ్ పఖ్వాడా (పోషకాహార పక్షోత్సవాలు): ఏటా ఏప్రిల్‌లో రెండు వారాల పాటు పోషకాహార పక్షోత్సవాలు నిర్వహిస్తారు. 2026లో 8వ విడత ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగింది. ఈసారి ఇతివృత్తం ‘మొదటి ఆరేళ్లలో మెదడు అభివృద్ధిని గరిష్టం చేయడం’. తల్లి-బిడ్డ పోషణ, ప్రారంభ ప్రేరణ, ఆట ఆధారిత విద్య, స్క్రీన్ టైమ్ తగ్గింపు, అంగన్‌వాడీల బలోపేతంపై దృష్టి ఇందులో భాగాలు.
  • రాష్ట్రీయ పోషణ్ మాహ్: ప్రతి సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. 2025లో 8వ విడతను ప్రధాని సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్ ధార్ నుంచి ప్రారంభించారు.

ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న పోషణ్ అభియాన్ సమన్వయం, సాంకేతికత, ప్రజా భాగస్వామ్యం ద్వారా పోషకాహార సవాళ్లను ఎలా ఎదుర్కోవచ్చో చూపింది. మిషన్ పోషణ్ 2.0 సేవా నాణ్యత, బాల్య సంరక్షణ, అట్టడుగు స్థాయిలో అమలుపై దృష్టిని పెట్టింది. పోషకాహారం మెరుగుపడితే ఆరోగ్యం, అభ్యాస ఫలితాలు, ఉత్పాదకత పెరుగుతాయి. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో పోషణ, బాలల అభివృద్ధిపై నిరంతర పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయి.