ముఖ్యమంత్రి, మంత్రుల కుమ్ములాటలతో పడకేసిన తెలంగాణ పాలన!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులకు, అధికార పార్టీ నేతలకు ప్రజల సమస్యలు పట్టించుకొనే తీరిక చిక్కడం లేదు. అంతర్గత కుమ్ములాటలతో రచ్చ చేసేందుకే సరిపోతుంది. దానితో పరిపాలన పడకేసిన్నట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే పలు కీలక మంత్రిత్వ శాఖలను ఉంచుకున్నా, వాటిపై కనీసం సమీక్షలు జరిపే తీరిక ఆయనకు చిక్కడం లేదు. ప్రభుత్వం ఆదాయంలో సింహభాగం అందించే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలనను సీనియర్ అధికారులకు వదిలి వేసి, మంత్రులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షునికి, సీనియర్ మంత్రులకు మధ్య అగ్గి రాజుకుంటూ ఉండగా, జిల్లాల్లో మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్యెల్యేల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతున్నది.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ కొంతకాలం జిల్లాలో తిరుగుతూ పార్టీ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తీవ్రమైన కసరత్తు చేసినా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైనప్పటి నుండి ఆమె సైతం అంటీముట్టనట్లు ఉంటున్నారు. మంత్రులపై, పలువురు నాయకులపై పార్టీ ఎమ్యెల్యేలు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు. సీనియర్ నాయకులే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారంటూ క్రమశిక్షణ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విభేదాలకు ప్రతీకగా జూన్ 18న జరిగిన అనధికారిక క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నేరుగా కొందరు మంత్రులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ధాన్యం సేకరణలో ప్రభుత్వం అప్రదిష్టపాలు కావడంతో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించి ‘మీ శాఖ మీద మీకు నియంత్రణ ఉన్నదా?’ అని ముఖ్యమంత్రి నేరుగా నిలదీసినట్టు ప్రచారం జరుగుతున్నది.
పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలపై తన అభిప్రాయాలను ఆయన తరచూ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖల రూపంలో తెలుపుతూ ఉండడం, వాటిని పరిశీలించాలని అధిష్టానం తిరిగి సీఎంఓకు ఆ లేఖలను పంపుతూ ఉండడంతో రేవంత్ రెడ్డి తన అసహనాన్ని ఈ విధంగా వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు. తాజాగా సన్నబియ్యం టెండర్లలో తక్కువ ధరకు బిడ్లు దాఖలవడంపై ఆ మంత్రికి తెలియకుండానే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు తెలియకుండానే తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారంటూ మంత్రి కొండా సురేఖ రాసిన లేఖను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో ఆమె అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి మద్దతుతోనే కడియం దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు బహిరంగంగానే ఆరోపించడం గమనార్హం. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనంతో వ్యవహరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు, ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో కూడా ముద్రించడం లేదు. కొద్ది రోజుల క్రితం టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకాలు రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో కుమ్ములాటలు బహిర్గతం చేశాయి. తమ మద్దతుదారులను పక్కన పెట్టి, తమ ప్రత్యర్థులకు పదవులు కట్టబెట్టారని పలువురు ఎమ్యెల్యేలు జిల్లా మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా, సొంత పార్టీలో అసమ్మతి స్వరాలను అదుపులో ఉంచేందుకు, నాయకులను లొంగదీసుకొనేందుకు వారి రాజకీయ కదలికలతో పాటు కుటుంబ సభ్యుల వ్యవహారాలపై కూడా నిఘా పెట్టారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.
ప్రవీణ్

