Joining

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదలపై ఆర్థిక భారం

Joiningహైదరాబాద్ నగరంపై, పేద, మధ్యతరగతి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల భారం, డిపాజిట్ల పేరుతో నిలువుదోపిడీకి తెరతీసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. జూలై 21న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పలువురు ప్రముఖులు ఆయన సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తీరుపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. క్యూర్ పేరుతో ప్రజలకు పెయిన్ తీసుకొస్తున్నారంటూ ఆయన విమర్శించారు. 1955 నాటి మున్సిపల్ చట్టంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే CURE చట్టంలోని కీలక నిబంధనలు ప్రజలను పీల్చి పిప్పిచేసేలా ఉన్నాయని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సైంటిఫిక్ ట్యాక్సేషన్ విధానం లేకుండా, రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఆధారంగా ప్రతి సంవత్సరం 5 శాతం వరకు పన్నులు పెంచేలా నిబంధనలు పెట్టడం ముమ్మాటికీ పన్నుల దోపిడీయేనని విమర్శించారు. నీరు, సివరేజ్ సేవలను విడదీసి వేర్వేరు పన్నులు విధించడం ద్వారా ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధుల పాత్రపై ఎలాంటి స్పష్టత లేకుండా, జవాబుదారీతనం లోపించిన ఈ చట్టాన్ని తాము అసెంబ్లీలో తీవ్రంగా నిలదీస్తామని స్పష్టం చేశారు. భాగస్వాములైన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రజల సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా ఈ చట్టం తీసుకురావాలనుకోవడం సరైనది కాదని హితవు పలికారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల సంక్షేమం కోసం కాదని, అది మరొక ఆర్థిక దోపిడీ కార్యక్రమమని దుయ్యబట్టారు. 24 నియోజకవర్గాల్లో లక్షలాది మంది అర్హులు ఉంటే, కేవలం 7,680 ఫ్లాట్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి, ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.100 రుసుముతో పాటు రూ.10,000 ఈఎండీ (EMD) డిపాజిట్ వసూలు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పేదల నుంచి దాదాపు రూ.1,000 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నిందని, ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో చేసిన డిపాజిట్ల దోపిడీని గుర్తు చేస్తోందని విమర్శించారు. గత వైఎస్సార్‌ పాలనలో నిర్మించిన సద్భావన, అభిమాన్ (జవహర్‌నగర్), పోచారం, చందానగర్, సహీరా (గాజులరామారం) టౌన్‌షిప్‌లతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో బోలక్‌పూర్, జవహర్‌నగర్‌లలో నిర్మించిన వందలాది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా పడి ఉన్నాయని గుర్తు చేశారు. రాజీవ్ స్వగృహ ఇళ్ల అవకతవకలపై సీబీసీఐడీ విచారణ జరుపుతామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. ఇలా గతంలో కట్టిన ఇళ్లను మరమ్మతులు చేసి పేదలకు ఇవ్వకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద ఇస్తున్న నిధులు, సబ్సిడీలను వాడుకుంటూ, రూ.11 లక్షల ఇల్లు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాటకానికి తెరతీసిందని, ప్రభుత్వం వెంటనే గతంలో నిర్మించిన ఇళ్లను ఉచితంగా అర్హులకు కేటాయించాలని, పాత ఇళ్లు పంపిణీ కాకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.