Vastrakala

సాంప్రదాయ నైపుణ్యాలూ మన సంపదలో భాగమే

టీవల ఫ్రాన్స్‌లోని ప్రాచీన విశ్వవిద్యాలయ నగరమైన ‘ఏక్స్-ఎన్-ప్రోవాన్స్’లో భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సదస్సు జరిగింది. కాలపరీక్షకు నిలిచిన ఈ రెండు దేశాల భాగస్వామ్య విస్తృతిని, భవిష్యత్తు అవకాశాలను అక్కడ ఫ్రెంచ్ ఆర్థిక మంత్రితో కలిసి నేను పునరుద్ఘాటించాను. పారిస్‌లో జరిగిన పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశంలో భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలు రూపొందించుకున్న అనేక ఫ్రెంచ్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడే అవకాశం నాకు లభించింది. భారత్ నుంచి క్రీడా పరికరాలను సేకరించే కంపెనీలు, పారిశ్రామిక వాయువులను తయారుచేసే సంస్థలు, భారత్ లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) తమ వ్యాపారాలకు చేకూరుస్తున్న విలువ పట్ల అమితాసక్తితో ఉన్న కంపెనీలు అందులో ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని భారత రాయబారి ‘వస్త్రకళ’ గురించి ప్రస్తావించారు — ఇది ఫ్రెంచ్ అత్యున్నత స్థాయి ఫ్యాషన్ డిజైన్లను భారతదేశపు శతాబ్దాల నాటి అల్లిక, ఎంబ్రాయిడరీ పరంపరతో మేళవించిన ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్య సంస్థ.

భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లా, గూడపాక్కంలో ఉన్న ‘వస్త్రకళ’ వర్క్‌షాప్‌ను నేను సందర్శించాను. ఆ వర్క్‌షాప్ ఎంతో ప్రశాంతంగా ఉంది కానీ స్తబ్దంగా మాత్రం లేదు. పురుషులు, మహిళలు ఏకాగ్రతతో తలలు వంచుకుని సూదులతో చురుగ్గా పనిచేసుకుంటున్న ఆ దృశ్యం జపనీస్ కళాకారుడు హయావో మియాజాకి స్టూడియోను తలపించింది. వారి ఓపికైన చేతుల కింద, నిశ్చలంగా ఉన్న డిజైన్లు జీవం పోసుకుంటూ ఆకృతిని, వర్ణాలను, లోతును సంతరించుకున్నాయి. అంత చిన్న కదలికల నుంచి అంతటి అత్యంత సంక్లిష్టమైన కళాఖండాలు ఎలా ఆవిర్భవిస్తాయో అర్థం చేసుకోవడానికి నేను వారి దగ్గరకు వెళ్లి పరిశీలించాను. ‘వస్త్రకళ’ కరువు పీడిత కాంచీపురం-శ్రీపెరంబుదూర్-తిరువళ్లూరు ప్రాంతంలో ఉంది. పూర్వకాలంలో వర్షాలు కురవక వ్యవసాయ పనులు నిలిచిపోయినప్పుడు, నాగలి పక్కన పెట్టి రైతులు సూది, దారాలు చేతపట్టేవారు. కాటన్, సిల్క్ వస్త్రాలపై అందమైన డిజైన్లను సృష్టించేవారు. తమలోని సృజనాత్మకతను వెలికితీస్తూ గ్రామస్తులు కరువు తెచ్చే కష్టాలను అధిగమించగలిగారు. ఈ కళకు అపారమైన ఓపిక, కచ్చితత్వం, క్రమశిక్షణ అవసరం — ఇవి మెట్టప్రాంత రైతులలో పుష్కలంగా ఉండే లక్షణాలు. భారత్ ఆర్థిక సంస్కరణలకు తలుపులు బార్లా తెరిచి, చెన్నై నగరం భారీ పెట్టుబడులను ఆకర్షించడం ప్రారంభించాక, ఈ ఎడారి వంటి భూములు రహదారులుగా, పారిశ్రామిక యూనిట్లుగా మారిపోయాయి. చాలామంది గ్రామస్తులు తమ భూములను విక్రయించి ఈ కర్మాగారాల్లో ఉద్యోగాలు పొందారు లేదా చెన్నైకి వలస వెళ్లారు. కుటుంబ ఆస్తులు అమ్ముడుపోయి, చేతిలో డబ్బు కరిగిపోవడంతో అనేక ఇళ్ల నుంచి ఎంబ్రాయిడరీ పని కనుమరుగైంది; ఒకప్పుడు దారాలతో సున్నితమైన ఆకులు, పూలను తీర్చిదిద్దిన వేళ్లు పారిశ్రామిక విడిభాగాలను అమర్చడం (అసెంబ్లింగ్) ప్రారంభించాయి.

అక్కడి కళాకారుల బృందంతో మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు, ‘వస్త్రకళ’ తన మొదటి వర్క్‌షాప్‌ను చెన్నై నుంచి గూడపాక్కంకు ఉద్దేశపూర్వకంగా తరలించిందని తెలుసుకున్నాను. శతాబ్దాలుగా ఈ నైపుణ్యాలను పెంపొందించిన గ్రామీణ ప్రాంతాలకు చేరువగా అధిక విలువైన పనిని తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం. సమయం మళ్లీ వెనక్కి తిరిగినట్లు అనిపించింది. యువతీ యువకులు నగరాలకు వలస వెళ్లే సాధారణ విధానం మనకు తెలిసిందే, కానీ ఇక్కడ ఒక కంపెనీ నగరానికి దూరంగా వెళ్లి గ్రామంలో స్థిరపడింది! ఈ రోజు ఈ వర్క్‌షాప్ నుంచి తయారైన కళారూపాలు రాష్ట్రపతి భవన్‌లో చోటు సంపాదించుకున్నాయి. అంతేకాక ఇప్పుడు ఫ్రాన్స్‌లోని చారిత్రాత్మక కోటలు, మ్యూజియంలు, ప్రైవేట్ నివాసాలు, ఫ్యాషన్ హౌస్‌లకు పయనమవుతున్నాయి. తమిళనాడు గ్రామానికి, ఫ్రెంచ్ చారిత్రాత్మక భవనానికి మధ్య ఉన్న దూరం చాలా ఎక్కువ; కానీ ఈ రోజు వాటిని అనుసంధానిస్తున్న దారం — ఒక అంకితభావంతో కూడిన పరిశ్రమ అండతో నడుస్తున్న అత్యున్నత నైపుణ్యం. 

నేను అక్కడ చూసిన విషయం ఒక బలమైన ఆర్థిక కోణాన్ని ఆవిష్కరించింది: ఒక వ్యాపారం అధిక శ్రమతో కూడుకున్నదిగా ఉంటూ, స్థానిక సాంప్రదాయ కళను ఉపయోగించుకుంటూనే, ప్రపంచ స్థాయిలో విజయవంతం కాగలదు. నన్ను ఆహ్వానించిన మహిళలు చక్కటి చీరలు ధరించి, జడలలో పూలతో ఎంతో అందంగా ఉన్నారు. వారు అంత అద్భుతంగా సిద్ధమై వస్తే, నేను మాత్రం పని దుస్తుల్లో వచ్చినందుకు క్షమాపణలు చెప్పాను. మేమంతా నవ్వుకున్నాం, ఆ అధికారిక పర్యటనలో గాంభీర్యం ఒక్కసారిగా కరిగిపోయింది. భోజనం చేస్తూ నేను మహేష్, కుమార్, కుమారేసన్, అమ్ము, సుమతి, కల్పన, ఇతర కళాకారులతో మాట్లాడాను. స్థిరమైన ఉపాధి వారికి ఏమేమి సాధ్యం చేసిందో వారు చెప్పారు— ఒక ఇల్లు, పిల్లలకు నాణ్యమైన విద్య, ఆపత్కాలం కోసం పొదుపు. వారి పని వారి కళను సజీవంగా ఉంచుతూనే ఆర్థిక భద్రత అందించింది. గ్రూప్ లీడర్ అయిన అమ్ము, 20-25 మంది ఉన్న బృందానికి మార్గదర్శకత్వం వహించడం గురించి వివరించారు, అక్కడ ప్రతి సభ్యునికి ఒక ప్రత్యేకమైన పని కేటాయిస్తారు. నేను వర్క్‌షాప్ లో తిరిగినప్పుడు ఒక ముఖ్యమైన అంశం స్పష్టమైంది: సంప్రదాయానికి విలువనిచ్చి, ప్రోత్సహించి, విస్తరించే అవకాశం ఇచ్చినప్పుడు అది వర్ధిల్లుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ‘వస్త్రకళ’లో పనిచేస్తున్న పురుషులు తమ కళ పట్ల అపారమైన గర్వాన్ని కనబరిచారు. 

ఎంబ్రాయిడరీ అంటే కేవలం మహిళలు మాత్రమే చేసే పని అనే పాత మూసధోరణిని వారు చాలా నైపుణ్యంగా చెరిపివేశారు. దివ్యాంగుడైన గోపి అనే కళాకారుడు, తనకు ఒక డిజైన్‌ను చూపించి దాన్ని మళ్లీ రూపొందించగలవా అని ఒకరు తనను అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ డిజైన్ తన తాతగారు చేసిన డిజైన్‌ను గుర్తుకుతెచ్చిందని చెబుతూ, కేవలం జ్ఞాపకశక్తి ఆధారంగానే ఆ డిజైన్‌ను మళ్లీ ఎలా సృష్టించగలిగాడో ఎంతో ఉత్సాహంగా వివరించాడు. ఆ డిజైన్‌ను పునఃసృష్టించడం ఒక పరిరక్షణ, సృజనాత్మకత, సమస్యా పరిష్కారం. ఒక పరిశోధనాత్మక ప్రయోగశాల లేదా ఇంజనీరింగ్ వర్క్‌షాప్ నుంచి ఉత్పన్నమయ్యే సాంకేతికత ఎంత శక్తిమంతంగా ఉంటుందో, అనుభవం, జ్ఞాపకశక్తి నుంచి వచ్చే ఆవిష్కరణ కూడా అంతే శక్తిమంతంగా ఉంటుందని ఇది నిరూపించింది. ఒక పాత పద్ధతిని మార్చుకోవడంలో, ఒక చారిత్రక డిజైన్‌కు కొత్త భాష్యం చెప్పడంలో, కొత్త మెటీరియల్‌ని పరీక్షించడంలో లేదా ఒక విభిన్నమైన టెక్స్చర్‌ని సృష్టించడంలో ఇది ఎల్లప్పుడూ కనిపిస్తుంది.

‘వస్త్రకళ’లో ఎంబ్రాయిడరీ కళకు డిజైన్ సైన్స్ అండగా నిలుస్తుంది — అందులో వినియోగించే వస్తువులు, ఉష్ణోగ్రత నియంత్రణ, కలర్ కోడింగ్, మన్నిక పరీక్షలు, చారిత్రక కచ్చితత్వాన్ని కాపాడటం వంటివి ఉన్నాయి. కాటన్, సిల్క్, నెట్, మెటాలిక్ దారాలు, ప్యాడింగ్, పొరలు పొరలుగా చేసే ఎంబ్రాయిడరీ.. ప్రతి మెటీరియల్ అంతిమ ఉత్పత్తికి ఒక విభిన్నమైన కోణాన్ని జోడిస్తుంది. ఈ కళను ప్రపంచానికి ప్రదర్శించడంలో ఫ్రాన్స్ దేశస్థులకు ఉన్న ప్రత్యేక నైపుణ్యం, భారతీయ సృజనాత్మక కళాకారుల అద్భుత నైపుణ్యాలతో విజయవంతంగా జతకట్టింది. ఇక్కడ సాంప్రదాయ నైపుణ్యం, ఆవిష్కరణలు భాగస్వాములుగా పని చేస్తాయి. శాస్త్రీయ పద్ధతులు, సమకాలీన డిజైన్, అంతర్జాతీయ ప్రమాణాలు తరతరాలుగా వారసత్వంగా వచ్చిన కళను మరింత బలపరుస్తాయి. ఈ కళ, తద్వారా సాంకేతికతకు, డిజైన్‌కు అప్పటికప్పుడే తయారు చేయలేని ఒక గొప్ప లోతును ఇస్తుంది.

నా సందర్శన సమయంలో ఆ యూనిట్, దాని విస్తృత కళాకారుల నెట్‌వర్క్‌తో సుమారు 650 మంది అనుసంధానమై ఉన్నారని నాకు చెప్పారు. దీనిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీని విస్తృతి ఇప్పటికీ మానవ నైపుణ్యంపైనే ఆధారపడి ఉంది. దీనివల్ల పురుషులు, మహిళలు తమ కుటుంబాలకు, గ్రామాలకు, సాంస్కృతిక నేపథ్యాలకు దూరమవ్వకుండానే ప్రపంచస్థాయి ప్రజాదరణ కలిగిన అత్యంత నాణ్యమైన పనులను చేపట్టగలుగుతున్నారు. నేను కలిసిన మహిళలు, పురుషులు ఈ కళ ఆత్మను తరతరాలుగా ముందుకు తీసుకువెళుతున్నారు. వీరి పని తమిళనాడు గ్రామాలను ఫ్రాన్స్‌లోని రాజభవనాలతో నిరంతరాయంగా అనుసంధానించింది. నవ భారత్ తన సాంప్రదాయాన్ని ఆర్థిక వృద్ధికి ఒక భాగస్వామిగా విజయవంతంగా మార్చగలదు. మన వారసత్వం ఆర్థిక అవకాశాలలో ఒక విడదీయరాని భాగం.

భారతదేశపు సంప్రదాయాలు గత వైభవానికి ఎంతటి నిదర్శనాలో, భవిష్యత్తుకు కూడా అంతే సొంతం. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం భారతీయ వస్త్రాలు అరికామేడు (ప్రస్తుత పుదుచ్చేరి సమీపంలో) నుంచి రోమన్ సామ్రాజ్యంలోని వివిధ మార్కెట్లకు ఓడల్లో ఎగుమతి అయ్యేవి. భారతీయ హస్తకళలకు ఎల్లప్పుడూ ఒక అంతర్జాతీయ భాష ఉంది. ప్రభుత్వ విధానాల కోణంలో, సాంప్రదాయ కళలను తరచుగా కేవలం రక్షణ, సబ్సిడీల భాషలోనే చర్చిస్తుంటారు. అయితే ఒక కళకు సరైన మార్కెట్ లభించినప్పుడు, కళాకారులు తమ అద్భుత నైపుణ్యానికి తగిన, స్థిరమైన ఆదాయాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ కళ నిజమైన భద్రతను పొందుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ (ODOP- ఒక జిల్లా ఒక ఉత్పత్తి) కార్యక్రమం ప్రధాన లక్ష్యం కూడా ఇదే. సమాజ సంక్షేమం కోసం ఉపయోగించుకోదగిన ఒక విశిష్టమైన సాంస్కృతిక వారసత్వం ప్రతి జిల్లాలోనూ ఉంది.

ఈనాడు భారతదేశంలో అపారమైన ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయి. ఈ బలం వల్లే దేశం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCC) అత్యంత ప్రాధాన్యం కలిగిన గమ్యస్థానంగా మారింది. మన ప్రజల నైపుణ్యం, సృజనాత్మకత వల్లే బహుళజాతి కంపెనీలు భారత్ ను ఎంచుకుంటున్నాయి. కళలు, సంప్రదాయాలు, సంస్కృతి రంగంలో కూడా అలాంటి అవకాశమే వేచి ఉంది. భారతదేశపు కళా వారసత్వం ప్రపంచ మార్కెట్లకు పూర్తిగా సిద్ధంగా ఉన్న ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. భారతీయ ఆవిష్కరణల తదుపరి లక్ష్యం ప్రపంచం కోసం సాంకేతికతలను సృష్టించడం మాత్రమే కాదు, భారతీయ హస్తకళలను, సాంప్రదాయ కళలను, సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే కొత్త మార్గాలను అన్వేషించడం కూడా. ‘వస్త్రకళ’ వంటి భాగస్వామ్యాలు, ఫ్రాన్స్ వంటి దేశాలతో కూడిన సహకారం తరతరాలుగా పదునుపెట్టిన నైపుణ్యాలను కాపాడుతూనే, భారతీయ కళాకారులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎలా అనుసంధానించవచ్చో నిరూపిస్తున్నాయి. భారతదేశపు భవిష్యత్ పోటీ సామర్థ్యం మనం సృష్టించే కొత్త ఆలోచనలపై మాత్రమే కాకుండా మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లే సంపన్న సంప్రదాయాలపై కూడా ఆధారపడి ఉంటుందని ఇవి మనకు గుర్తు చేస్తున్నాయి.

నిర్మలా సీతారామన్,
కేంద్ర ఆర్థిక మంత్రి