శ్రీశైలంకు వరద ప్రవాహం.. పాలమూరు పొలాలకు చుక్కనీరు లేదు
కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల అవుతుండటంతో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. జలాశయానికి భారీగా ప్రవాహం వస్తుండటంతో అధికారులు ఇరు రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదకతను ప్రారంభించారు. కండ్ల ముందే నీరున్నా పొలాలకు పారని దుస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. రేవంత్ సర్కార్ కపట నీతితో అన్నదాత కంటనీరు పెట్టుకోవాల్సిన దుర్గతి పడుతున్నది. జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నా తెలంగాణ రైతుల ఆశలను కాంగ్రెస్ నీరుగారుస్తున్నది. ఒకవైపు కృష్ణా, భీమా నదులు పొంగిపొర్లుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంటే రాష్ట్ర సర్కార్ పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయకుండా దోబూచులాడుతున్నది.
ఇరు రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదకతను ప్రారంభించారు. తెలంగాణ ఎడమగట్టు కేంద్రంలో 21,189 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 7.319 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు కేంద్రంలో 9,603 క్యూసెక్కులతో 1.684 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవుతోంది. ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం 30,792 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ దిగువ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు వెలిగోడు ప్రాజెక్టుకు, గోరకల్లు జలాశయానికి చెరీ 4,000 క్యూసెక్కులు విడుదల చేశారు. పక్షం రోజులుగా రోజూ రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు శ్రీశైలానికి చేరుకుంటున్నది. శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులకు గాను 874 అడుగులకు చేరి 162 టీఎంసీల మేర నీటినిల్వ చేరింది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవలే రాష్ట్ర సర్కార్ నాలుగు పంపులను సిద్ధం చేసింది. డ్రైరన్‌తో పాటు వెటరన్ నిర్వహించి, నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పంపులను ప్రారంభించకుండా ప్రభుత్వం దోబూచులాడుతున్నది. జూరాల బేసిన్లో ఉన్న భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కుడి, ఎడమ కాలువలతోపాటు ప్యారలల్ కెనాల్‌కు అరకొరగా నీటిని మళ్లిస్తున్నారు. ఎగువన వస్తున్న కృష్ణా జలాలు కల్వకుర్తి లిఫ్ట్ పంపులకు అందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మోటర్లను ఆన్ చేయకుండా తాత్సారం చేస్తున్నది. ఈ ఎత్తిపోతల పథకం కింద ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ మూడు రిజర్వాయర్లను నింపుకొంటే తాగు, సాగునీటికి ఇబ్బందులే ఉండవు. అంతేగాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి, ఆయన పుట్టి పెరిగిన నియోజకవర్గానికీ ఈ పథకమే శరణ్యం. చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా ఆశించిన స్థాయిలో నీటిని విడుదల చేయడం లేదు. ఈ ఎత్తిపోతల కింద ఉన్న నార్లాపూర్, జొన్నలప్పగూడ రిజర్వాయర్లలో నీటిని నింపి వదిలేశారు. గుడిపల్లి రిజర్వాయర్‌లో నీటిని విడుదల చేయకుండా అడ్డుకట్టలు వేశారు. జూరాల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదికి గత 15 రోజుల నుంచి రోజూ సుమారు 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని సర్కార్ జారవిడిచింది. ఆ నీరు మొత్తం పాలమూరు హెడ్ రెగ్యులేటరీకి చొచ్చుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పంపులను ఆన్‌చేస్తే నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఇప్పటికే ఉన్న జలాలతోపాటు మరో 4 నుంచి 5 టీఎంసీల నీటి వరకు నిలువ చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ వరద తగ్గినా ఈ నార్లాపూర్ లింక్ కెనాల్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు సాగునీటిని విడుదల చేయొచ్చని ఇంజినీర్లే చెబుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్లు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు నీటిని ఎత్తిపోయడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మేల్కొని పాలమూరు , కల్వకుర్తి ఎత్తిపోతల పంపులను పూర్తిస్థాయిలో ఆన్‌చేసి ఆ నీటిని వాటి పరిధిలోని రిజర్వాయర్లలో నిలువ చేసుకొంటే సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరుతాయని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కృష్ణ చైతన్య

