NRR Diksha

విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కాంగ్రెస్‌ను నిలదీస్తాం‌

NRR Deekshanతెలంగాణలోని సుమారు 40 లక్షల విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, నిరంకుశ పోకడలకు నిరసనగా బిజెపి తెలంగాణ పోరుబాట పట్టింది. ‘ఫీజుల బకాయి – బిజెపి లడాయి’ కింద బీజేవైఎం, బిజెపి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం వేదికగా ఆగస్ట్ 24న ప్రారంభమైన ఈ దీక్ష ఆగస్ట్ 25 వరకు కొనసాగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ వెనక్కి తగ్గకుండా, విద్యార్థుల పక్షాన బిజెపి రాష్ట్ర కార్యాలయంలోనే రాంచందర్ రావు దీక్షా శిబిరంలో కూర్చున్నారు. రాంచందర్ రావు నిరాహార దీక్షకు సంఘీభావంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, విద్యార్థులు, విద్యా సంస్థల ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను విద్యార్థులు వివరించారు.

రేవంత్ రాజీనామా చేయాలి: రాంచందర్ రావు‌‌ 

విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని దీక్షలో మాట్లాడుతూ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేని రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇచ్చిన స్కాలర్‌షిప్‌లు పెంచుతామని, ఫీజులను సమయానికి చెల్లిస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి వదిలిపెట్టదని హెచ్చరించిన ఆయన ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? స్కాలర్‌షిప్‌లు ఎందుకు అందడం లేదు? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బిజెపి పోరాటం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో కాలేజీలకు వెళ్లి 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించాం.  “మా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మాకివ్వండి” అంటూ విద్యార్థులు స్వయంగా సంతకాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫీజు బకాయిల కోసం విద్యార్థులు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తే.. వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒక్కటే కాదు.. తెలంగాణలో యావత్ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టి పోయింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖను నిర్వహిస్తున్నారు.. అయినా విద్యా వ్యవస్థను గాలికొదిలేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి రూ.1,000 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.. కానీ ఇప్పటివరకు రూ.1,000 కూడా ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్లు పెంచి మొత్తం బకాయిలను రూ.12 వేల కోట్లకు చేర్చింది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. దీనికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి.. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయి. 

యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో వచ్చే సంవత్సరానికి అడ్వాన్స్‌గా రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల కోసం పోరాడితే వారిపై లాఠీచార్జ్ చేయించి, పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఆయుష్, హోమియోపతి విద్యార్థులు స్టైఫండ్ల కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఇక్కడి విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమాధానం చెప్పాలి. 

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుతున్నాయి. మోదీ పాలనలో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. నేటి భారత యువత రాకెట్లు తయారు చేసి అంతరిక్షంలోకి పంపే స్థాయికి ఎదిగింది. ఇది మోదీ నాయకత్వంలో సాధించిన నూతన భారత ప్రగతికి నిదర్శనం. ఒకవైపు మన యువత అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరోవైపు తెలంగాణలో విద్యార్థులు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు ఎండగడతాం. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించాల్సిన ప్రభుత్వం తమ హామీలను విస్మరించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం ఆపదు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చే వరకు ప్రజా ఉద్యమం ద్వారా ఒత్తిడి తెస్తాం.. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడతాం. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై బిజెపి పోరాడుతుంది.’’ అని రాంచందర్ రావు అన్నారు.

NRR Diskha Viramana

రాహుల్ రాష్ట్రానికి రావాలి‌‌: డా. లక్ష్మణ్

రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ ఆగస్ట్ 25న రాంచందర్ రావుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విదేశీ యూనివర్సిటీల నుంచి ఉన్నత ప్రమాణాల విద్యను తెలంగాణకు తీసుకొస్తామని చెప్పే ముందు రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అమెరికా, లండన్ నుంచి పెట్టుబడులు, విద్యా అవకాశాలు తీసుకొస్తామని చెప్పడం కంటే ముందుగా తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. “అమ్మకు అన్నం పెట్టకుండా పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నట్లుగా” ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. ఎన్నికల సమయంలో అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీ, జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ యువత, విద్యార్థుల సమస్యలపై ఇతర రాష్ట్రాల్లో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువత ఆందోళన చేసినప్పుడు పోలీసుల చర్యలు, లగచర్లలో భూసేకరణను వ్యతిరేకించిన గిరిజనులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యం, నైతిక విలువల గురించి మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నిరసనలను అణచివేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాంచందర్ రావు చేపట్టిన దీక్షతో ఉద్యమం ముగియదని, విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు బిజెపి వెనక్కి తగ్గబోదని డా. లక్ష్మణ్ స్పష్టం చేశారు. 

ఫీజు బకాయిలు చెల్లించాలి.. అందరిదీ ఒకటే డిమాండ్‌‌

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. శాంతియుత దీక్షకు కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను విస్మరించిందని ఆరోపించారు. విద్యారంగానికి బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బిజెపి ఎంపీ రేఖా శర్మ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లు దాటినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. యువతకు రూ.5 లక్షల ఆర్థిక సాయం హామీ కూడా అమలు కాలేదన్నారు. మోదీ నాయకత్వంలో యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత విద్యతో జీవితాలను మార్చుకోవాలని తల్లిదండ్రులు కలలు కంటారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత వహించాలని సూచించారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకుండా వచ్చే ఏడాది రూ.2 వేల కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామనడం సరికాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. బకాయిల కారణంగా విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. “ఇప్పుడు ఆకలిగా ఉంటే వచ్చే ఏడాది భోజనం పెడతామంటే ఎలా?” అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దీక్షకు మద్దతు ఇస్తూ శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిజెపి పదాధికారులు, మోర్చా నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీరంతా తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించాలని ముక్తకంఠంతో నినదించారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా జిల్లాల నుంచీ పెద్దఎత్తున తరలివచ్చి దీక్షకు మద్దతు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదని, దాని ప్రభావం విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, అధ్యాపకులు, సిబ్బంది, మొత్తం విద్యా వ్యవస్థపై పడుతోందని వివిధ వర్గాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బకాయిలను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో ఎన్. రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు రాజకీయ, విద్యా, విద్యార్థి, సామాజిక, వృత్తిపరమైన వర్గాల నుంచి విస్తృత మద్దతు లభించడం బిజెపి పోరాటానికి లభిస్తున్న ప్రజా మద్దతుకు నిదర్శనంగా నిలిచింది.