సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ అవినీతి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను, ముఖ్యంగా రైతులను, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడుతుందని, కమీషన్లకు తెరదీసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణిలోని లోపాలను సరిదిద్దాల్సిన ప్రభుత్వం భూభారతి పేరుతో సమస్యలను మరింత జటిలం చేసిందని ఆరోపించారు. రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రైవేట్ భూములను 22ఏ జాబితాలో చేర్చి వారి ఆస్తి హక్కులను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. భూములను 22ఏలో చేర్చడం, తిరిగి తొలగించడం వెనుక భారీ అవినీతి, కమీషన్ల వ్యవహారం ఉందని ఆరోపిస్తూ.. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏ జాబితాలో ఉన్న అర్హత కలిగిన భూములను వెంటనే తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. భూభారతి సెక్షన్ 22 ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో సెప్టెంబర్ 5న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్దనున్న ధర్నా చౌక్ వద్ద ‘మహా ధర్నా’ నిర్వహించింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు ధర్నాలో భాగంగా దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు సమక్షంలో ఈ ప్రారంభమైన మహా ధర్నాకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, శాసనమండలి పక్షనేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు డా. కె.లక్ష్మణ్, డి.కె. అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, గోడెం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్, రామారావు పాటిల్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మినర్సయ్య, ఇతర బిజెపి నేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. చొప్పదండికి చెందిన రైతు రాజారాం నిమ్మరసం అందించగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ దీక్ష విరమించారు.
ధర్నాలో ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 15 శాతం కమీషన్లతో నిషేధిత జాబితాలోని భూములను తొలగిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులే కాకుండా మల్కాజ్గిరి వంటి శివారు ప్రాంతాలలో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కుని ఇళ్లు నిర్మించుకున్న మధ్యతరగతి ప్రజల ఇళ్లను, చివరకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని నిర్మాణాలను కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు భూముల పేరు చెప్పి ప్రైవేట్ పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఏదైనా సర్వే నంబర్లో కొంత భాగంపై వివాదం ఉంటే, ఏకంగా మిగతా సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల కడుపు కొట్టేలా సాగుతున్న ఈ అక్రమాలపై సమగ్ర విచారణ కోసం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది తమ భూములను అమ్ముకోలేక, పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్లిళ్ల కోసం బ్యాంకుల్లో రుణాలు సైతం తీసుకోలేక తీవ్ర క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. సొంత భూమిపై హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన మానవ హక్కు అని, రాష్ట్ర ప్రభుత్వం ఆ మానవ హక్కులను సైతం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. 22ఏ జాబితాలో పెట్టిన రైతుల, ప్రజల భూములన్నింటినీ తక్షణమే విముక్తి చేయాలని, లేనిపక్షంలో సడక్ నుంచి సదన్ వరకు బిజెపి రాజీలేని పోరాటం చేస్తుందని రాంచందర్ రావు హెచ్చరించారు.
ధర్నాలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, కేంద్ర పరిధిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూములను అమ్మి ఇప్పటికే ప్రభుత్వం రూ. 1200 కోట్లు తీసుకుందని పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు స్థలాలు, కమ్యూనిటీ అవసరాల కోసం, పార్కుల కోసం కేటాయించిన స్థలాలు, చివరకు దేవాదాయ శాఖ భూములను సైతం వేలం పేరుతో అమ్మేస్తూ, భూములు అమ్మకపోతే పూట గడవని, ప్రభుత్వం నడవని దుస్థితికి తెచ్చారని విమర్శించారు. పొద్దున లేస్తే సాయంత్రం వరకు కలెక్టర్లతో మాట్లాడుతూ ఏ భూములు అమ్మాలి, వేటిని దోచుకోవాలనే ఆలోచనలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 22ఏ జాబితా, భూముల అమ్మకాలు, ప్రైవేట్ సెటిల్మెంట్ల ద్వారా దోచుకున్న వేలాది కోట్ల రూపాయల సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్ గాంధీకి ఢిల్లీకి కప్పం కడుతున్నారని, ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చులకు తెలంగాణ ప్రజాధనాన్ని తరలిస్తున్నారని మండిపడ్డారు. ధరణిలోని లోపాలను సరిదిద్దాల్సింది పోయి, వాటిని రెండింతలు మూడింతలు చేసి మరింత అవినీతికి తెరలేపారని అన్నారు. ఎన్టీఆర్ మైదానం మొదలుకొని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, కంపెనీలు, భూభారతిలో భూముల తొలగింపు వరకు 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని, ఇది పొరపాటున జరిగింది కాదని, సీఎం, మంత్రులకు తెలిసి పక్కా ప్లాన్ ప్రకారం పేదల భూములను లాక్కునేందుకు చేసిన కుట్రేనని కిషన్ రెడ్డి అన్నారు.
బిజెపి శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ.. ”పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ధరణిని మార్చి భూభారతి తీసుకొస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు పేరు మాత్రమే మారింది, దోపిడీ విధానం మారలేదు. అదే విధానం, అదే ఫార్మాట్‌తో భూభారతి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల భూములను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఏ ప్రాతిపదికన భూములను సెక్షన్ 22ఏలో చేర్చారు? ఏ ప్రాతిపదికన కొన్ని భూములను రాత్రికి రాత్రే 22ఏ నుంచి తొలగిస్తున్నారు? దీనిపై బిజెపి ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. 22ఏ జాబితా విషయంలో జరుగుతున్న వ్యవహారాలపై అనేక ఆధారాలతో అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నలు లేవనెత్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బదలాయింపు జరుగుతున్నాయని ఆధారాలతో ప్రశ్నించాం. ఆస్తుల బదలాయింపు ఏ విధంగా జరిగింది? ఆ వ్యాపారానికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? రెవెన్యూ శాఖ వంటి కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి అదే సమయంలో వ్యాపార ప్రయోజనాలు కొనసాగించడం ‘కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ కాదా? గతంలో బ్రిటిష్ రెవెన్యూ వ్యవస్థలో పంటలపై, భూములపై పన్నులు ఉండేవి. కానీ ఇప్పుడు భూములనే 22ఏలో పెట్టి, వాటిని తిరిగి బయటకు తీసేందుకు ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ‘Right to Property’ కాస్తా ‘Rate to Property’గా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇప్పుడు కేవలం మూడు బ్యారేజీలకు సంబంధించిన సుమారు రూ.7 వేల కోట్ల అంశాన్నే సీబీఐకి అప్పగించారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పినప్పుడు మొత్తం వ్యవహారాన్ని ఎందుకు సీబీఐకి అప్పగించలేదు? అవినీతి ఆరోపణలను ఎందుకు పరిమితం చేశారు? దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలు తమ భూముల సమస్యలు, అభివృద్ధి, ఉద్యోగాలు, ఎన్నికల హామీల అమలు, అవినీతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రజలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.” అని అన్నారు.

