Sept 17 Parade Grounds

హైదరాబాద్ విమోచనం.. సమైక్య భారతానికి కీలక ఘట్టం

Sept 17 Parade Groundsస్వతంత్ర భారత చరిత్రలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం ఒక కీలక ఘట్టమని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని, జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కవాతులో సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఉపరాష్ట్రపతి.. క్రమశిక్షణతో సాగిన కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. హైదరాబాద్ విమోచన, ఏకీకరణ సమయంలో ప్రజల పోరాటం, శౌర్యం, త్యాగాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక ప్రదర్శనలు సాగాయి. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి పోరాడిన వీరులందరికీ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఉపరాష్ట్రపతి ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాలు, ధైర్యసాహసాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ సైనిక అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ.. హైదరాబాద్ విమోచనం కేవలం ఒక చారిత్రక తేదీని గుర్తుచేసుకునే సందర్భం కాదని, జాతీయ సమైక్యత, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం, దేశ ప్రగతి విలువలను స్మరించుకునే రోజని అన్నారు. 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అనేక సంస్థానాల విలీనం విషయంలో అనిశ్చితి కొనసాగిందని, ఈ నేపథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక బాధ్యతను భుజాన వేసుకున్నారని రాధాకృష్ణన్ గుర్తుచేశారు. వందలాది సంస్థానాలను భారత సమాఖ్యలో విలీనం చేయడంలో పటేల్ అసాధారణ కృషి చేశారని, హైదరాబాద్ సంస్థానం కూడా ఆయన దృఢ సంకల్పంతో భారతదేశంలో విలీనమైందని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు నిజాం పాలకుడు నిరాకరించిన నేపథ్యంలో 1948 సెప్టెంబర్‌లో ‘ఆపరేషన్ పోలో’ చేపట్టిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. అనంతరం నిజాం సైన్యం లొంగిపోవడంతో సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని తెలిపారు. హైదరాబాద్ విమోచన ఉద్యమంలో విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక-రాజకీయ కార్యకర్తలు, రైతులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారని రాధాకృష్ణన్ అన్నారు. అనేకమంది జైలు శిక్షలు, హింస, వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. రామ్‌జీ గోండ్, కొమురం భీమ్, తుర్రేబాజ్ ఖాన్ వంటి వీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. అన్యాయాన్ని ఎదురొడ్డి పోరాడిన సామాన్యుల ధైర్యసాహసాలు కూడా చరిత్రను మలుస్తాయని అన్నారు.

జాతీయ సమైక్యత అంటే కేవలం భూభాగాలను ఒకటిగా చేయడం కాదని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం కల్పించినప్పుడే దేశ సమైక్యత మరింత బలోపేతమవుతుందని అన్నారు. దేశ ప్రజలు వేర్వేరు భాషలు మాట్లాడవచ్చని, భిన్న సంప్రదాయాలు, విశ్వాసాలు కలిగి ఉండవచ్చని, రాజకీయంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చని చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగం, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్య విలువలు అందరినీ ఒకే తాటిపై నిలబెడతాయని పేర్కొన్నారు. దేశ ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు కీలక పాత్ర పోషించాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 1947-48లో సంస్థానాల ఏకీకరణ సమయంలోనే కాకుండా, అనంతరం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ బలగాల త్యాగాలను గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పేర్కొంటున్న నక్సల్ రహిత భారత్ దిశగా కేంద్ర బలగాలు కీలకంగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో వామపక్ష తీవ్రవాదంపై చర్యలు కొనసాగాయని, నక్సలిజం తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ, నేతాజీలు, దేశ ఏకీకరణలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించినట్లే, ప్రస్తుతం ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, దేశ ఏకీకరణ, అభివృద్ధి.. ఇవన్నీ పరస్పరం అనుసంధానమైన భారత ప్రస్థానంలోని కీలక దశలని ఆయన వివరించారు. దేశ సేవలోనే దేశభక్తి అత్యున్నత రూపం కనిపిస్తుందని, హైదరాబాద్ విమోచన వారసత్వం ఈ సందేశాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తుందని అన్నారు.

నిజాం పాలన అంత గొప్పదైతే.. పోరాటాలు ఎందుకు జరిగాయి?: కిషన్ రెడ్డి

ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి సాగిన పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నిజాం, రజాకార్లు సాగించిన దౌర్జన్యాలు, మారణకాండ, దేవాలయాలపై దాడులు, ప్రజలపై జరిగిన అణచివేత వంటి ఘటనలను గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ప్రస్తావించకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి భయపడి చరిత్రను మరుగున పడేయడం సరికాదన్నారు. జర్మనీలో నాజీల అరాచకాలను భవిష్యత్ తరాలకు హెచ్చరికగా గుర్తుచేస్తున్న విధంగానే హైదరాబాద్ సంస్థానంలో నిజాం, రజాకార్ల పాలనలో జరిగిన దౌర్జన్యాలను కూడా చరిత్రలో నమోదు చేసి, వాటి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ సాక్షిగా నిజాంను గొప్ప పాలకుడిగా కీర్తించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నిజాం పాలన అద్భుతంగా ఉండేదని చెబుతున్న వారికి కిషన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. నిజాం పాలన అంత గొప్పదైతే వందేమాతరం రామచంద్రరావు, భాగ్యరెడ్డి వర్మ, కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, పీవీ నరసింహారావు వంటి ప్రముఖులు ఆ పాలనకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో రజాకార్ల దాడుల నుంచి ప్రజలను రక్షించుకునేందుకు గ్రామాల్లో బురుజులు ఎందుకు నిర్మించుకోవాల్సి వచ్చిందని నిలదీశారు. స్వతంత్ర భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య చేపట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చరిత్రను కప్పిపుచ్చే వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ చారిత్రక వాస్తవాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. నిజాం ప్రభుత్వం ‘వందేమాతరం’ను మతపరమైన గేయమంటూ నిషేధించిందని, ప్రస్తుత మజ్లిస్ కూడా వందేమాతరాన్ని వ్యతిరేకిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ, ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రతి చౌరస్తాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించే రోజు ఎంతో దూరంలో లేదని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జాతీయ జెండా ఎగరవేయడాన్ని అడ్డుకునే ధైర్యం కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించే ప్రయత్నాలు జరిగితే తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

‌‌వాళ్లు ఈ దేశ పౌరులేనా?: బండి సంజయ్

ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ.. నిజాంను సమర్థించే నాయకుల దేశభక్తిని ప్రశ్నిస్తూ ”వాళ్లు ఈ దేశ పౌరులేనా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుని, రక్తపాతం సృష్టించిన నిజాంను గొప్ప పాలకుడిగా చిత్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నిజాంను పొగిడే నాయకులు బైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలను గుర్తుచేసుకోవాలని సూచించారు. ఆ ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమెవరో ఆలోచించాలని అన్నారు. తెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగుచేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికే ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో తెలంగాణలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను కేంద్రం ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధిని విస్మరించి అవినీతికి పాల్పడుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికే పరిమితమవుతున్నాయని విమర్శించారు. అవినీతికి తావులేకుండా పాలన కొనసాగిస్తున్న నాయకుడిగా ప్రధాని మోదీని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు ఎలాంటి పాలన అవసరమనే దానిపై ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. అవినీతిమయమైన పాలనా? అవినీతి రహిత పాలనా? అలాగే తెలంగాణ చరిత్రను మరుగున పడేసే పాలనా? లేక ఆ చరిత్రను భావితరాలకు అందించే పాలనా? అనే విషయాలను ప్రజలు పరిశీలించాలని అన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి తెలంగాణ పౌరుడు మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.