Narendra Modi

యువశక్తే వికసిత్ భారత్‌కు చోదకశక్తి: మోదీ

Rozgar Mela2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువత ప్రతిభ, నైపుణ్యాలపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని, భారత ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువశక్తిపై ప్రపంచానికి ఎన్నో ఆశలు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 19న జరిగిన 20వ విడత రోజ్‌గార్ మేళాలో దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51 వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోదీ నూతన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. జాతీయ విద్యా విధానం, స్కిల్ ఇండియా మిషన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, అప్రెంటిస్‌షిప్ విధానంతో యువతను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరించేందుకు పరిశ్రమల భాగస్వామ్యంతో రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో ‘పీఎం-సేతు’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. అదే విధంగా, తొలిసారి అధికారిక కార్మిక శక్తిలోకి ప్రవేశించే రెండు కోట్ల మంది యువతను లక్ష్యంగా చేసుకుని రూ.లక్ష కోట్లతో ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ను అమలు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి రూ.15 వేల వరకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు కొత్త ఉద్యోగాలు కల్పించే యజమానులకు కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, పెట్టుబడులు పెరగడం, పరిశ్రమల విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మోదీ పేర్కొన్నారు. దేశం 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, తొలి త్రైమాసికంలో పెట్టుబడుల్లో 12 శాతం పెరుగుదల నమోదైందని తెలిపారు. భారత్‌లో స్టార్టప్ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. చిన్న పట్టణాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల యువత కూడా కొత్త సంస్థలను స్థాపిస్తూ ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారని తెలిపారు. కొత్తగా ప్రభుత్వ సేవల్లోకి అడుగుపెడుతున్న వారు తమ ఉద్యోగాన్ని కేవలం ఉపాధిగా కాకుండా ప్రజాసేవకు లభించిన అవకాశంగా చూడాలని ప్రధాని సూచించారు. ప్రజలకు అందించే సేవలే ప్రభుత్వంపై వారి అభిప్రాయాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. వృద్ధుల పింఛన్లు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, రైతుల రాయితీలు వంటి ప్రభుత్వ సేవలు సామాన్యుల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతాయని తెలిపారు. కొత్త ఉద్యోగులు నిజాయితీ, సున్నితత్వం, సామర్థ్యంతో పనిచేయాలని సూచించారు. ‘నాగరిక్ దేవో భవ’ భావనతో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.

13 లక్షలకు చేరిన రోజ్‌గా‌‌ర్ మేళా నియామకాలు: కిషన్ రెడ్డి

హైదరాబాద్ మాదాపూర్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొని నూతన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం ఉపాధి మాత్రమే కాదని, దేశానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన 19 విడతల రోజ్‌గార్ మేళాల ద్వారా 12.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగా, 20వ విడతతో ఆ సంఖ్య సుమారు 13 లక్షలకు చేరిందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగాలు పొందుతున్న యువతలో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారేనని, 2047 నాటికి వీరు కీలక స్థానాల్లో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమని అన్నారు. 2014కు ముందు వందల్లో ఉన్న స్టార్టప్‌ల సంఖ్య 2026 జూన్ నాటికి 2.3 లక్షలకు పైగా పెరిగిందని, వీటి ద్వారా 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. AI, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాల్లో యువత నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు.

ఉద్యోగాలు సృష్టించే యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం: బండి సంజయ్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణలో తన చేతుల మీదుగా 221 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ జరుగుతోందని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై భారం పెరగడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని తెలిపారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతున్న యువత కుటుంబ పోషణకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో నిజాయితీ, నిబద్ధత, నిర్భీతితో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.