Modi Ramnath Kovind

నిర్లక్ష్యానికి గురైన వారిని ప్రధాన స్రవంతిలోకి తెచ్చిన మోదీ

నరేంద్ర మోదీ శకం అందించిన అత్యంత శాశ్వతమైన విజయం ఏదైనా ఒక రహదారి, పథకం, సంస్కరణ లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో మాత్రమే కనిపించకపోవచ్చు. అది భారతదేశపు ప్రధాన స్రవంతి విస్తరించడంలో అంతర్భాగంగా ఉంది. రాష్ట్రపతిగా నా పదవీకాలంలో 2017 నుంచి 2022 వరకు ఐదేళ్లపాటు ప్రధానిగా ఆయన పనితీరును అత్యంత సమీపం నుంచి గమనించాను. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, 2014 లో ప్రధాన మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల అధినేతగా 25 ఏళ్లకు పైగా ప్రధాని మోదీ ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ (అందరి భాగస్వామ్యం, అందరి అభివృద్ధి) అనే సూత్రాన్ని స్థిరంగా ముందుకు తీసుకువెళుతున్నారు. ఆయన సమ్మిళితత్వ రాజకీయాన్ని మరొక మాటలో చెప్పాలంటే ‘ఎవరినీ ఎవరూ పట్టించుకోలేదో, వారిని మోదీ పూజించారు లేదా సేవించారు. నిశ్శబ్దంగా, కంటికి కనిపించకుండా, సేవలకు నోచుకోకుండా ఉన్న వారు దేశ అభివృద్ధి ప్రయాణంలో ఎంతమాత్రం ఒకమూలన ఉండిపోలేదు.’ బహుశా మోదీ యుగంలో సంభవించిన అత్యంత కీలకమైన మార్పు ఇదే.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు భారతదేశ అభివృద్ధి విధానంలో ఒక ప్రధాన కేంద్రం, దానికో దూరంగా ఉన్న ప్రాంతాలు ఉండేవి. కొన్ని ప్రాంతాలను సుదూరమైనవిగా భావించారు. కొన్ని గ్రామాలు ప్రభుత్వ సంక్షేమం పూర్తి స్థాయిలో అందనంతగా చాలా దూరంలో ఉండిపోయాయి. కొన్ని ఆకాంక్షలు జాతీయ చర్చల్లో అసలు చోటే సంపాదించలేకపోయాయి. మోదీ ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నించింది ఈ అసమానతల స్థాయిలనే. ఎవరో కొద్దిమందికే కాక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందించడం, మినహాయింపులకు బదులు కలుపుకొని పోవడం, కేవలం ఇవ్వడమే కాకుండా సాధికారత కల్పించడమే పరిపాలనా ప్రమాణంగా మారింది. కేవలం పథకాలను ప్రారంభించడం మాత్రమే కాకుండా, ప్రతి లబ్ధిదారుడికి అవి నిజంగా చేరాయా లేదా అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఈ వాస్తవానికి చక్కటి ఉదాహరణ ఈశాన్య భారతం. దశాబ్దాలుగా ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశపు సుదూర సరిహద్దుగా మాత్రమే చూసేవారు. ప్రధాని మోదీ హయాంలో ఇది ఆగ్నేయాసియాకు భారతదేశ ప్రవేశ ద్వారంగా మారింది. నవంబర్ 2014 నుంచి ఆయన ఈ ప్రాంతంలో జరిపిన 83 పర్యటనలు—రవాణా అనుసంధానం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, శాంతి కోసం నిరంతరం చేస్తున్న కృషిని స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాంతం 12 ప్రధాన శాంతి ఒప్పందాలకు వేదికైంది. గత దశాబ్దంలో సుమారు రూ.1.4 లక్షల కోట్లు కేటాయించగా, 2014-15 నుంచి 2025-26 మధ్య అభివృద్ధి కోసం ఏకంగా రూ. 7 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. ఈశాన్య ప్రాంత మౌలిక సదుపాయాల స్వరూపం కూడా మారుతోంది. భోగీబీల్ వంతెన, సేలా టన్నెల్ వంటివి క్లిష్టమైన భౌగోళిక అడ్డంకులను అధిగమించాయి. బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ప్రారంభంతో మిజోరంకు దేశంలోని ఇతర ప్రాంతాలతో మొదటిసారిగా నేరుగా రైలు అనుసంధానం ఏర్పడింది. మోదీ హయాంలోనే నాగాలాండ్ కు స్వాతంత్య్రం తర్వాత మొదటి రైల్వే స్టేషన్‌ వచ్చింది. ఎయిమ్స్ గౌహతి ఈశాన్యంలో మొదటి ఎయిమ్స్‌గా అవతరించింది. ఒకప్పుడు భౌగోళికంగా సుదూర ప్రాంతంగా భావించిన చోటు నుంచే భారతదేశపు అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన పరిశ్రమలు ఆవిర్భవించగలవనే ఆలోచనకు అస్సాం సెమీకండక్టర్ ప్లాంట్ నిదర్శనం.

భారత సరిహద్దుల వెంట కూడా ఆలోచనా ధోరణిలో ఇటువంటి మార్పే కనిపిస్తుంది. ఏళ్ల తరబడి, సుదూర ప్రాంతాల నివాసాలను దేశపు ‘చివరి గ్రామాలు’గా అభివర్ణించేవారు. మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ పదజాలాన్ని, ఆ గ్రామాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని మార్చింది. ఇవి ఇప్పుడు భారతదేశపు ‘మొదటి గ్రామాలు’. వైబ్రెంట్ విలేజెస్ (చైతన్యవంతమైన గ్రామాలు) కార్యక్రమం ద్వారా సుదూర సరిహద్దు ప్రాంతాలలో రహదారులు, అనుసంధానత, పర్యాటకం, జీవనోపాధి, అత్యవసర సేవలను అందిస్తూ ఈ ఆలోచనకు ఒక వ్యవస్థాగత రూపాన్ని ఇచ్చారు. ఈ సూత్రం ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. చారిత్రాత్మకంగా వెనుకబడిన 112 జిల్లాలను శాశ్వతంగా వెనుకబడినవిగా వదిలేయకుండా, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, జీవనోపాధిలో పురోగతిని వేగవంతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్దిష్ట ఫలితాలు, సమన్వయం, అభివృద్ధిలో పోటీని ప్రవేశపెట్టింది. 2023లో 329 జిల్లాల్లోని 500 మండలాల్లో ఆకాంక్షభరిత మండలాల కార్యక్రమం ద్వారా ఈ విధానాన్ని పాలనా వ్యవస్థలో మరింత బలంగా ప్రతిష్టించారు.

ఇక్కడ సందేశం స్పష్టం, భౌగోళిక స్థితి ఎప్పటికీ ప్రతికూలత కాకూడదు. గిరిజన సమాజాల పట్ల అనుసరిస్తున్న తీరులోనూ ఇదే ఆలోచనా ధోరణి కనిపిస్తుంది. తాత్కాలిక సంక్షేమం నుంచి నిరంతర, లక్షిత, సమగ్ర ప్రభుత్వ కార్యక్రమాల దిశగా మార్పు వచ్చింది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ గత దశాబ్దంలో 243 శాతం పెరిగింది. ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అన్ని 75 అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల ఇళ్లు, రోడ్లు, నీరు, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాలపై దృష్టి సారించింది. ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ సమన్వయంతో కూడిన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా గిరిజనులు ఎక్కువగా ఉన్న గ్రామాలు, అత్యంత వెనకబడిన గిరిజన తెగల నివాసాలలో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది. దేశ భవిష్యత్తులో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం వహించే సామర్థ్యాలను ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న సమూహాలకు కల్పించడమే దీని మౌలిక లక్ష్యం.

59 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ఒకప్పుడు అధికారిక ఆర్ధిక వ్యవస్థకు వెలుపల ఉన్న కుటుంబాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా ప్రభుత్వ సాయం లబ్ధిదారులకు నేరుగా చేరుతోంది. ఇది మధ్యవర్తుల అక్రమాలను అరికట్టడం ద్వారా ఇప్పటివరకు రూ.5.14 లక్షల కోట్లకు పైగా ఆదా చేయడానికి దోహదపడింది. ప్రాథమిక సేవల కల్పనకు దీటుగా సామాజిక ఆర్థిక సమ్మిళితత్వాన్ని మోదీ ప్రభుత్వం సాధించింది. సౌభాగ్య పథకం 100 శాతం గ్రామీణ విద్యుదీకరణను సాధించింది. ఉజ్వల పథకం 10 కోట్లకు పైగా కుటుంబాలకు స్వచ్ఛమైన వంట గ్యాస్‌ను అందించింది. జల్ జీవన్ మిషన్ 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను కల్పించింది. ఈ కార్యక్రమాలన్నీ ఒకే సాధారణ సూత్రాన్ని ప్రతిబింబిస్తాయి: నిర్లక్ష్యానికి గురైన వారిని గుర్తించి, పాలనా ప్రయోజనాలను వారి వద్దకు తీసుకెళ్లడం. అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్నదే ప్రధాన లక్ష్యం.

మహిళల విషయంలో కూడా ఈ మార్పు అంతే ముఖ్యమైనది. తరతరాలుగా మహిళలను ప్రధానంగా సంక్షేమ ప్రయోజనాలు పొందేవారిగానే చూశారు. మోదీ ప్రభుత్వ విస్తృత కార్యక్రమాలు వారిని లబ్ధిదారులుగా కాక భాగస్వాములుగా, ప్రయోజనాలు పొందేవారిగా కాక పారిశ్రామికులుగా మార్చింది. స్వచ్ఛ భారత్ మిషన్ మహిళల గౌరవం, భద్రత, ఆరోగ్యంతో ముడిపడి ఉన్న సమస్యను పరిష్కరించింది. ముద్రా పథకం మహిళలు మున్నెన్నడూలేని స్థాయిలో పారిశ్రామికులుగా మారడానికి వీలు కల్పించింది. పీఎం స్వనిధి లబ్ధిదారులలో మహిళలు 46 శాతం ఉన్నారు. లఖ్‌పతి దీదీ కార్యక్రమం మహిళా ఆర్థిక సాధికారతను గ్రామీణ పరివర్తనకు ఇరుసుగా నిలిపింది. విడివిడిగా చూస్తే—ఈశాన్య ప్రాంతం, గిరిజన సమూహాలు, సరిహద్దు గ్రామాలు, మహిళలు, గ్రామీణ కుటుంబాలు, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురైన పౌరులు వేర్వేరు విధానపరమైన సవాళ్ళుగా కనిపిస్తాయి. కానీ కలిసి చూస్తే, అవి మోదీ ప్రభుత్వ పాలనా విధానం, ఆలోచనా ధోరణుల విస్తృతిని వెల్లడిస్తాయి. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ ఎవరికి సహాయం అందలేదు, ఎవరి గళం వినబడలేదు, అభివృద్ధి చెందుతున్న భారత్ లో అవకాశాలకు వెలుపల ఎవరు మిగిలిపోయారు అని అడుగుతుంది. కాబట్టి మోదీ శకపు శాశ్వత వారసత్వం భారతీయ ప్రధాన స్రవంతికి ఇచ్చిన కొత్త నిర్వచనమే. అభివృద్ధి మధ్యభాగంలో ప్రారంభమై క్రమంగా అంచులకు చేరుకోవాలనే ఆలోచనను మోదీ మార్చివేశారు. ఆ అంచులే ఇప్పుడు భారతదేశ అభివృద్ధి ఆకాంక్షలకు కేంద్రంగా మారాయి.

భారతదేశం ‘వికసిత భారత్ 2047’ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, నిర్మితమవుతున్న నవభారతం ఒకప్పుడు అభివృద్ధి గాథలో అతి తక్కువగా కనిపించిన వారికి కూడా సమానంగా చెందేలా చూడటమే మోదీ లక్ష్యం. అది మోదీ శకాన్ని నిర్వచించే వాస్తవం. ఒకప్పుడు దూరంగా, అంచుల్లో ఉన్నవారు భారతదేశ ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించడానికి ఇక వేచి ఉండడం లేదు; వారే దాన్ని నిర్దేశించడంలో భాగస్వాములవుతున్నారు.

రామ్‌నాథ్ కోవింద్,
భారత మాజీ రాష్ట్రపతి