ముందుచూపు లేకపోవడమే సంక్షోభానికి కారణం
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేని విధానాల వల్లే సాగు-తాగునీరు, విద్యుత్ సంక్షోభానికి కారణమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నిప్పులు చెరిగారు. ఎల్-నినో ముప్పు ముందే తెలిసినా ప్రణాళిక లేకుండా వ్యవహరించి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరుబావుల కింద పంటలు ఎండిపోయి అల్లాడుతున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై పీసీ ఘోష్ కమిటీ, ఎన్‌డీఎస్‌ఏ నివేదికలను ప్రజల ముందుంచాలి. కేఆర్ఎంబీ , అపెక్స్ కౌన్సిల్‌లో తెలంగాణ నీటి వాటాపై రాజీపడకుండా గట్టిగా వాదించాలని సూచించారు. రాష్ట్రంలో వరి పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ, క్షేత్రస్థాయిలో రైతులను ప్రత్యక్షంగా కలిసి, వారి సమస్యలను తెలుసుకునేందుకు సెప్టెంబర్ 30న రాంచందర్ రావు నేతృత్వంలో బిజెపి ప్రతినిధి బృందం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించింది. ఈ బృందంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మినర్సయ్య, బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, నేతలు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ముందుగా సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నల్గొండలో నిర్వహించిన స్వచ్చ భారత్‌లో పాల్గొన్న రాంచందర్ రావు చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం చిన్న మాదారం గ్రామంలో పర్యటించి, నీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, కష్టాలను తెలుసుకున్నారు. అలాగే చిన్న మాదారం విద్యుత్ సబ్-స్టేషన్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా గురించి అధికారులను ఆరా తీశారు. అటు నుంచి నాగార్జున సాగర్ వెళ్లి, జలాశయాన్ని, నీటి నిల్వను పరిశీలించారు.
ఈ పర్యటనలో వివిధ సందర్భాల్లో ఎన్. రాంచందర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, విద్యుత్ శాఖ వైఫల్యం, ముందస్తు ప్రణాళిక లేమి కారణంగా రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. రైతులకు అవసరమైన సమయంలో నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సకాలంలో విద్యుత్ సరఫరా లేక బోర్లు నడవక, పొలాలకు నీరందక చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితం కాకుండా కృష్ణా పరీవాహక ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్నదని పేర్కొన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 12 నుంచి 15 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గరిష్ఠంగా ఐదు గంటలే విద్యుత్ అందుతోందని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. అదికూడా తరచూ ట్రిప్పింగ్, బ్రేక్‌డౌన్లతో అంతరాయాలకు గురవుతోందని, దీంతో భూగర్భ జలాలను వినియోగించుకోలేక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పంట నష్టాలకు బీమా రక్షణ లేకపోవడంతో రైతులు పెట్టుబడులు కూడా తిరిగి పొందలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి ఫసల్ బీమాను అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు సంకేతాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన ప్రణాళిక రూపొందించలేదని అన్నారు. కర్ణాటక తరహాలో కేంద్ర సహాయం కోరడంతో పాటు కేంద్ర బృందాన్ని రప్పించి పంట నష్టాన్ని అంచనా వేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలు, కూరగాయలు, వైవిధ్యమైన సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు రాబోయే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం బలంగా వాదించాలని అన్నారు. తెలంగాణకు కేటాయించిన నికర జలాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. జూరాల, నెట్టెంపాడు, డిండి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. చిన్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహిస్తే కృష్ణా పరివాహక ప్రాంతంలోని నీటి సమస్యను కొంతవరకు అధిగమించవచ్చని అన్నారు. ఆర్డీఎస్ వంటి ప్రాజెక్టుల్లో పూడికతీత చేపట్టకపోవడం వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇప్పటికే ఉన్న చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం వెంటనే ప్రజల ముందుంచాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకు బ్యారేజీల మరమ్మతులు, పునర్వినియోగంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని కోరారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరతకు బొగ్గు కొరతే కారణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న వాదనను రాంచందర్‌రావు ఖండించారు. సింగరేణి నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. థర్మల్ విద్యుత్‌తో పాటు జెన్‌కో, డిస్కమ్‌లు, హైడల్, సోలార్ విద్యుత్, ఛత్తీస్‌గఢ్ నుంచి లభించే విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యుత్ సరఫరా లోపాలకు ఇతర కారణాలను చూపకుండా సమగ్ర ప్రణాళికతో సమస్యను పరిష్కరించాలని సూచించారు. రైతుల పంట నష్టంపై తక్షణమే చర్యలు తీసుకుని, విద్యుత్, సాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.

