ఎన్నికలు చెల్లవంటే.. కాంగ్రెస్ సీఎంలతో రాజీనామా చేయించండి!
యావత్ ప్రపంచం మన ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియను చూసి గర్విస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం దేశంపై, ఎన్నికల సంఘంపై ఏడుస్తూ అవాకులు చవాకులు పేలుతోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. ఒక సాధారణ చాయ్‌వాలా దేశానికి ప్రధానమంత్రి కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. నెహ్రూ కుటుంబం నుంచే ప్రధాని కావాలనే సంకుచిత భావనతో దేశంలో జరిగిన ఎన్నికలన్నీ చెల్లవనడాన్ని తప్పుబట్టారు. ఎన్నికలు చెల్లవనుకుంటే.. మొదట తెలంగాణలో అక్రమంగా గెలిచిన రేవంత్ రెడ్డి చేత, అలాగే కేరళం, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల చేత రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో తాము గెలిస్తే ఈవీఎంలు, ఈసీ మంచివని.. ఓడిపోతే మాత్రం వాటిపై నిందలు వేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విరుచుకుపడ్డారు. అక్టోబర్ 5న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, బిజెపి తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శి దశరథ్, కర్ణాటక రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎన్. రాంచందర్ రావు ప్రసంగించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలిచిందని రాంచందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం పనితీరును, ఎలక్షన్ గుర్తింపు కార్డులతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధానాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ పరిపాలించిన కాలంలో విదేశాల నుంచి అక్రమ చొరబాటుదారులు మన దేశంలోకి వచ్చి, అడ్డదారుల్లో రేషన్ కార్డులు సంపాదించి, ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారని రాంచందర్ రావు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరుడైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభిస్తుందని, కానీ బంగ్లాదేశ్, బర్మా వంటి వివిధ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన విదేశీయులకు ఆ హక్కు ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న SIR ప్రక్రియలో కోట్లాది మంది అక్రమ చొరబాటుదారుల పేర్లు వెలుగుచూస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని మహేశ్వరం నియోజకవర్గంలోనే సుమారు 30 వేల మంది రోహింగ్యాలు, అక్రమ ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. చొరబాటుదారుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తుంటే ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్, ‘ఇండీ’ కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా గౌరవించే పార్టీ బిజెపి అని, ఏ మతానికి చెందిన వారైనా సరే 18 ఏళ్లు పైబడిన భారత పౌరులకు ఖచ్చితంగా ఓటు హక్కు ఉండి తీరాలని స్పష్టం చేశారు. బతుకుదెరువు లేదా ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను పరిశీలించి సరిచేసే ప్రక్రియ ఎప్పటినుంచో సాగుతోందని, దీనిపై కూడా కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీలు సహా హామీలేవీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని, రైతు భరోసా లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు అందడం లేదని, ఉపాధ్యాయ నియామకాలు, ఉద్యోగుల ప్రమోషన్లు పూర్తిగా అటకెక్కాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సైతం రాష్ట్రంలో అమలు చేయకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం బాగుపడితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ దోచుకుంటూ బాగుపడ్డారు తప్ప సామాన్య ప్రజల కష్టాలు, సమస్యలు తీరలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం కమీషన్లు, కాంట్రాక్టులు, ఢిల్లీకి ముడుపులు పంపడంలోనే మునిగిపోయారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో అక్రమ ఆస్తుల పంపకాల కోసం పంచాయితీలు నడుస్తున్నాయని, ఇరు పార్టీలు ఒకరి దోపిడీని మరొకరు నిందించుకుంటూ నాటకమాడుతున్నాయని ఫైరయ్యారు. వీరికి ప్రత్యామ్నాయంగా తెలంగాణను రక్షించే సత్తా ఒక్క బిజెపికే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ సాంస్కృతిక విలువలపై తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో “ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం” అంటూ బాహాటంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేడు హిందూ దేవతలను, భక్తుల విశ్వాసాలను, ఆచారాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. “రెండు పెళ్లిళ్లు చేసుకునేటోళ్లకు ఇంకో దేవుడున్నడు.. మందు తాగేటోళ్లకు, కల్లు పోసి కోడిని కోసేటోళ్లకు ఎల్లమ్మ, పోచమ్మలున్నరు.. పప్పన్నం తినేటోళ్లకు ఇంకో దేవుడున్నడు” అంటూ అత్యంత హేయంగా, సంస్కృతిని, హిందూ దేవీదేవతలను అవమానించేలా మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దారుణంగా గాయపరుస్తున్నారని ఆగ్రహించారు. మజ్లిస్ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, హిందూ దేవతలను స్వేచ్ఛగా ఆరాధించుకోవాలన్నా, ప్రజల ఆత్మగౌరవం నిలబడాలన్నా బిజెపి అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

