భారత్ ఆలోచనా విధానాన్ని మార్చిన కార్యశీలి
వారసత్వంగా వచ్చిన సవాళ్లను అంగీకరించడానికి నిరాకరించే అరుదైన వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. ప్రజాజీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా పరిష్కరించడం అసాధ్యమేమీ కాదన్నది ఆయన విశ్వాసం. ఆయన ఆచరణ కూడా అదే విషయాన్ని చూపిస్తుంది. ఒక స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తున్నాయి. భారత్ ‘చల్తా హై’ (నడిచిపోతోంది) అనే ధోరణి నుంచి బయటపడి, ‘బదల్ సక్తా హై’ (మార్చవచ్చు) అనే ఆలోచనా విధానం వైపు అడుగులు వేయాలని ఆయన అన్నారు. నేను తొలుత పార్టీలో సహచరుడిగా, ఆ తరువాత ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేశాను. దశాబ్దాలుగా బిజెపిలో పనిచేసిన మాలాంటి వారికి రాజ్యాంగ అధికరణం 370, రామజన్మభూమి మా గాఢమైన విశ్వాసానికి సంబంధించినవి. వాటి కోసం మేం త్యాగాలు కూడా చేశాం. అయితే నిజాయితీగా చెప్పాలంటే, ఈ సమస్యలకు తమ జీవితకాలంలో పరిష్కారం లభిస్తుందా? అని మాలోని కొందరు కార్యకర్తలు సైతం సందేహించిన సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగంలో తాత్కాలిక నిబంధనగా పేర్కొన్న అధికరణం 370ను రద్దు చేయడం దాదాపు అసాధ్యమనే భావన ఏర్పడింది. దాని రద్దుకు సంబంధించిన చరిత్రాత్మక చట్టాన్ని రాజ్యసభ ఆమోదించిన సమయంలో సభకు అధ్యక్షత వహించే అవకాశం నాకు లభించింది. రామజన్మభూమి ప్రయాణం మరింత సుదీర్ఘమైనది. ఎదో ఒక రోజు శ్రీరాముడి జన్మస్థలంలో భవ్యమైన ఆలయం నిర్మితమవుతుందన్న ఆశతో తరాలు గడిచాయి. 2024 జనవరి 22న ఆ ఆశ సాకారమైంది.
గుజరాత్‌ను ఒక భయంకరమైన భూకంపం కుదిపేసిన కొద్ది నెలలకే మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కచ్ ప్రాంతం భూకంపం కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడమే తొలి కర్తవ్యమని మోదీ గుర్తించారు. ముఖ్యమంత్రిగా తన తొలి దీపావళిని ఆయన భూకంప బాధిత కుటుంబాలతో కలిసి గడిపారు. ఆ తరువాత సంవత్సరాల్లో ఆయన విధానాలు కచ్ ప్రాంతం తనను తాను పునర్నిర్మించుకునేలా దోహదపడ్డాయి. పర్యాటక అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగంలో సాధించిన ఫలితాలతో కచ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. నీటి సమస్య కూడా గుజరాత్‌కు శాశ్వత సవాలుగా కనిపించేది. దశాబ్దాల క్రితమే ప్రతిపాదించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు అనేక సమస్యల్లో చిక్కుకుంది. మోదీ దానిపై ప్రత్యేక దృష్టి సారించి, ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యేలా చూశారు. నర్మదా జలాలు నీటి కొరతతో ఉన్న గుజరాత్ ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకున్నారు. చెక్‌డ్యామ్‌లతో పాటు ఇతర చిన్న నీటి సంరక్షణ నిర్మాణాలు కూడా నీటి పొదుపును ప్రజా ఉద్యమంగా మార్చాయి. దీంతో గుజరాత్ రైతులు గణనీయమైన ఫలితాలు సాధించగలిగారు.
భారత్‌ను ఒకప్పుడు ప్రపంచంలోని ‘ఫ్రాజైల్ ఫైవ్’ (అత్యంత సున్నితమైన ఐదు) ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పరిగణించిన సమయంలో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు దేశ బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో సతమతమవుతోంది. ఆస్తుల నాణ్యతా సమీక్ష, బ్యాంకింగ్ సంస్కరణలు, దివాళా స్మ్రుతి వంటి చర్యల ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించే ప్రక్రియను ఆయన ప్రారంభించారు. అనంతరం భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు అవసరమైన రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం కష్టమని చాలామంది భావించారు. అయితే మోదీ రాజకీయంగా నష్టాన్ని ఎదుర్కోడానికి సైతం సిద్ధంగా ఉండి సంస్కరణను ముందుకు తీసుకెళ్లడంతో అది సాధ్యమైంది. నేడు డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రగామిగా ఉంది. సాంకేతికతే అసలు సవాలు కాదు. నగరాలు, గ్రామాలు, వివిధ తరాలు, వివిధ ఆదాయ వర్గాలకు చెందిన కోట్లమందిని చాలాకాలంగా అలవాటైన విధానాన్ని మార్చుకుని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించడం అసాధ్యంగా కనిపించిన పని. ఒక వీధి వ్యాపారిని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలోకి ఎలా తీసుకురాగలమని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ప్రశ్నించారు. ఆ మార్పును మోదీ సుసాధ్యం చేసి చూపించారు. పేదరికం కూడా భారత్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన సమస్యగా మారిపోయింది. నేడు 25 కోట్ల మంది భారతీయులు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు. విస్తృతమైన సామాజిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆ తరువాత పేదలు పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన వనరులను వారికి అందించడం ద్వారా ఇది సాధ్యమైంది. బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీలు, గృహాలు, పారిశుద్ధ్యం, విద్యుత్, వంటగ్యాస్, ఆహార భద్రత, ఆరోగ్య బీమా, ఆర్థిక అవకాశాలు వంటి అనేక చర్యలు ఇందుకు దోహదపడ్డాయి.
దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా దేశం వేలమందిని కోల్పోయింది. భద్రత, అభివృద్ధి అనే ద్విముఖ విధానంతో ఇప్పుడు దానిని అంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ప్రతి సమస్యా పూర్తిగా కనుమరుగైందని కాదు. అయితే సమస్యల ముందు నిస్సహాయంగా ఉండాల్సిందే అన్న నిరాశానిస్పృహలు మాత్రం తొలగిపోయేలా మోదీ చర్యలు చేపట్టారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చారు. అనేక ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఆ సంక్షోభం అనంతరం వేగంగా కోలుకుంది. పశ్చిమాసియా సంక్షోభం ఇంధన భద్రత, నౌకాయానం, వాణిజ్యం వంటి కొత్త సవాళ్లను ముందుకు తెచ్చింది. ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేసే భారత్ విధానం ఈ విషయంలో పరిపక్వంగా, బాధ్యతాయుతంగా సంక్షోభాలను అధిగమించింది.
ఒకప్పుడు బిజెపి కొన్ని ప్రాంతాలు, కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైన పార్టీగా ముద్రపడింది. ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ప్రధానమంత్రి మోదీ నిరంతరం కృషి చేశారు. ఈశాన్య, తూర్పు భారతదేశంలో బిజెపి విస్తరించడం, పేదలు, గ్రామీణ ప్రజలు, అణగారిన వర్గాల్లో పార్టీకి పెరుగుతున్న మద్దతు దేశ రాజకీయ పటాన్ని మార్చాయి. ఆయన ప్రయాణాన్ని దగ్గరగా గమనించిన వారికి ఒక విషయం స్పష్టమవుతుంది. దేశానికి ఏం అవసరమో ముందుగా మోదీ ప్రశ్నించుకుంటారు. ఆ అవసరాన్ని తీర్చేందుకు అనువైన పరిస్థితులను సృష్టించేందుకు ఆ తరువాత కృషి చేస్తారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశానికి ఈ ఆలోచనా విధానం అత్యంత కీలకమైనది.
ఎం వెంకయ్య నాయుడు,
మాజీ ఉపరాష్ట్రపతి

