‘వికసిత్ భారత్’ సాధించి తీరుతాం: ప్రధాని మోదీ
140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్పంతో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని ఆ లక్ష్యం దిశగా నడిపించేందుకు ”We Will Do It” (మనం చేసి తీరుతాం) అనే ఆత్మవిశ్వాస నినాదాన్ని వినిపించారు. 2047 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపడం, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడం, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, అంతరిక్ష పరిశోధనల్లో కొత్త శిఖరాలను అధిరోహించడం వంటి లక్ష్యాలను ప్రస్తావించారు. 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి నిరంతరాయంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఈ అక్టోబర్ 7న 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు, మోదీ అభిమానులు సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభలు నిర్వహించారు. దిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభల్లో వర్చువల్ గా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంతకుముందు మోదీ వినాయకుడి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దేశం కోసం మరింత ఉత్సాహంతో, రేయింబవళ్లు అలుపెరగకుండా ప్రజాసేవ చేసే శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని కోరుకున్నారు.
140 కోట్ల పరిష్కారాలు
ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ దేశ ప్రజలకు, భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ.. తోడుగా నిలిచిన ఎన్డీయే, బిజెపి సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో సవాళ్లు ఎన్నో ఉన్నప్పటికీ.. వాటికి 140 కోట్ల పరిష్కారాలు కూడా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. మనం కలలు కంటున్న అభివృద్ధి చెందిన భారత్ సాకారమవుతుందని, ఆ లక్ష్యాన్ని చేరుకోకుండా ఏ శక్తీ దేశాన్ని అడ్డుకోలేదని అన్నారు. 140 కోట్ల మంది కలిసికట్టుగా పనిచేస్తే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రజల ఐక్యతను దెబ్బతీసి దేశాభివృద్ధికి అవరోధంగా మారుతాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తులు, కొరతలు, అభివృద్ధి, సమస్యలు ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం కావన్నారు. రైతులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటే దాని ప్రభావం ఒక్క రైతులపైనే ఉండదని, విద్యుత్ కొరత ఏర్పడితే చీకట్లు ఒక్క వర్గానికే పరిమితం కావని పేర్కొన్నారు. సమస్య అందరిదైనప్పుడు పరిష్కారం కూడా అందరి భాగస్వామ్యంతోనే ఉండాలని స్పష్టం చేశారు.
భారత్‌ను ఏ శక్తీ ఆపలేదు
భారత్ సామర్థ్యంపై ప్రజల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే దేశానికి అతిపెద్ద బలమని మోదీ అన్నారు. ఒకప్పుడు సౌర విద్యుత్ రంగంలో భారత్ ప్రపంచ రికార్డులు సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదని, నేడు అదే రంగంలో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. వ్యవసాయ రంగంలోనూ ఇటీవలి కాలంలో స్థిరమైన వృద్ధి నమోదైందని ప్రస్తావించారు. ప్రపంచంలో ఎక్కడైనా పదవులు, హోదాలు లభించవచ్చని.. కానీ భరతమాత వంటి పవిత్ర పుణ్యభూమి ఎక్కడా దొరకదని మోదీ అన్నారు. చీకటి రోజుల్లోనూ ప్రపంచానికి జ్ఞానజ్యోతిని పంచిన ఈ నేలకు సేవ చేయడం తన జీవితానికి దక్కిన గొప్ప వరమని పేర్కొన్నారు. 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న రోజు కేవలం గతాన్ని గుర్తుచేసుకునే సందర్భం మాత్రమే కాదని.. భవిష్యత్ లక్ష్యాలకు కొత్త శక్తిని నింపే రోజని మోదీ అన్నారు. వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాధించేందుకు 140 కోట్ల మంది భారతీయులు ఒకే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపడం నుంచి ఆత్మనిర్భర్ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఒలింపిక్స్ ఆతిథ్యం, అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త శిఖరాలను అధిరోహించడం వరకు ప్రతి లక్ష్యాన్ని సాధించేందుకు దేశ ప్రజలంతా కలసి కృషి చేయాలని అన్నారు. ”140 కోట్ల మంది భారతీయులం ఒక్కతాటిపై నిలబడి 2047 నాటికి వికసిత్ భారత్‌ను కచ్చితంగా నిర్మించి తీరుతాం. We Will Do It” అంటూ ప్రధాని మోదీ ఆహూతుల్లో ఉత్సాహాన్ని నింపారు.
పాతికేళ్లు పూర్తవుతాయని అనుకోలేదు
2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల మైలురాయిని చేరుకుంటానని తాను ఊహించలేదని మోదీ అన్నారు. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్నానని చెప్పారు. ఈ ప్రయాణం తన వ్యక్తిగత విజయం కాదని, కోట్లాది భారతీయుల విశ్వాసం, ప్రజల ఆశీస్సులు, లక్షలాది మంది కార్యకర్తల కృషి ఫలితమని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ప్రజలే తనకు దేవుళ్లని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తన పాతికేళ్ల ప్రజాజీవితంలో ఎదురైన అనుభవాలను మోదీ ప్రస్తావించారు. ఉపాధ్యాయులు తనకు వినయాన్ని నేర్పారని, కష్టాల్లోకి నెట్టిన వారు మళ్లీ పైకి ఎలా లేవాలో నేర్పారని చెప్పారు. విమర్శకులు ఆత్మపరిశీలనకు అవకాశం కల్పించారని, తన వెంట నిలిచిన వారు నమ్మకంలోని శక్తిని చూపించారని అన్నారు. తనను వ్యతిరేకించిన వారు ప్రజాస్వామ్య బలం ఏమిటో తెలియజేశారని, ఎదురైన ప్రతి సంక్షోభం తన సహనాన్ని పరీక్షించిందని చెప్పారు. సాధించిన ప్రతి విజయం మరిన్ని బాధ్యతలను తనపై మోపిందని పేర్కొన్నారు. 25 ఏళ్ల ప్రజాజీవితం తనకు ఎన్నో విలువైన అనుభవాలను అందించిందని మోదీ అన్నారు. అయితే ఆ అనుభవం తన ఒక్కరి ఆస్తి కాదని, దేశ ప్రజలందరి సంపద అని పేర్కొన్నారు. తాను ఇప్పటికీ నిత్య విద్యార్థినేనని, ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పారు. భారత సంస్కృతికి పరిరక్షకులుగా, దేశ సేవే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న స్వయంసేవకులు, కార్యకర్తలకు గౌరవ వందనం చేస్తున్నానని అన్నారు. వారి సేవా స్ఫూర్తి తనకు ఎప్పుడూ బలాన్నిస్తుందని పేర్కొన్నారు.
పదవి కోసం కాదు.. లక్ష్యం కోసం
తన జీవితంలో పదవులపై వ్యామోహం ఎప్పుడూ లేదని మోదీ అన్నారు. ఎన్నికల్లో వ్యక్తిగత ఎదుగుదల కోసం కాకుండా ఇతరుల విజయానికి, ఒక లక్ష్య సాధన కోసం పనిచేశానని చెప్పారు. ఎన్నికల రాజకీయాల్లో ఎదగాలనే కోరికే ఉంటే తాను మరింత ముందుగానే బరిలోకి దిగేవాడినని, అది తన స్వభావం కాదని పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను ఒక్కొక్కటిగా నిర్వర్తిస్తూ ముందుకు సాగానని చెప్పారు. దేశానికి నిస్వార్థ సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని, కర్తవ్యమే తనకు సర్వస్వమని స్పష్టం చేశారు. దేశం కోసం, ప్రజల కోసం పనిచేయడం తన జీవిత సాధన అని మోదీ అన్నారు. కర్తవ్య నిర్వహణలో తన సర్వశక్తులనూ వినియోగించడం, నిరంతరం కృషి చేయడమే తన విధిగా భావిస్తానని చెప్పారు. ”పని ఆగకూడదు.. ప్రయత్నమూ ఆగకూడదు” అని స్పష్టం చేశారు. ‘మా ఫలేషు కదాచన’ అనే గీతోపదేశం స్ఫూర్తితో ఫలితాలను ఆశించకుండా, గుర్తింపు కోసం ఎదురుచూడకుండా పనిచేయడమే తన జీవిత విధానమని పేర్కొన్నారు.
దేశానికి అంకితమైన అసాధారణ ప్రయాణం
దిల్లీ ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రసంగిస్తూ ఈ రోజు ప్రతి భారతీయుడికి, ప్రతి బిజెపి కార్యకర్తకు ఎప్పటికీ గుర్తుండిపోయే అపురూపమైన రోజుగా అభివర్ణించారు. ఎన్నో కష్టాలు, సవాళ్లను అధిగమిస్తూ నిరంతరాయంగా సాగిన మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితం ఒక అసాధారణ ప్రయాణానికి నిదర్శనమని నితిన్ నబీన్ పేర్కొన్నారు. కఠోర తపస్సు, నిస్వార్థ సమర్పణ, అచంచల సంకల్పంతో తన జీవితాన్ని మలుచుకున్న మోదీ.. ప్రజాసేవనే జీవిత పరమావధిగా భావించారని అన్నారు. ప్రజాసేవ ద్వారానే దేశసేవ సాధ్యమనే విశ్వాసంతో రాజకీయాల్లోకి ప్రవేశించి, అధికారాన్ని ప్రజాసేవకు ఒక సాధనంగా మలుచుకున్నారని చెప్పారు.
ప్రధాని మోదీ ఎలాంటి రాజకీయ కుటుంబం లేదా వారసత్వం నుంచి రాలేదని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ ప్రధానులుగా బాధ్యతలు చేపట్టిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావించిన ఆయన.. మోదీ మాత్రం సాధారణ జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, పోరాటాలు, అనుభవాలతో అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతోనే మోదీ దేశ ప్రధానిగా ఎదిగారని అన్నారు. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా దేశ అత్యున్నత ప్రజా పదవిని చేపట్టడం ఆయన రాజకీయ ప్రయాణంలోని ప్రత్యేకతగా పేర్కొన్నారు. దేశ ప్రజల తరఫున, లక్షలాది బిజెపి కార్యకర్తల తరఫున ప్రధాని మోదీకి 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తిచేసుకున్న సందర్భంగా నితిన్ నబీన్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధానిగా మాత్రమే కాకుండా ‘ప్రధాన సేవకుడి’గా మోదీ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం నుంచి ఉజ్వల యోజన వరకు వివిధ కార్యక్రమాల ద్వారా దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్ల భద్రత, గౌరవం, ఆత్మగౌరవానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని నితిన్ నబీన్ పేర్కొన్నారు. ‘లఖ్పతి దీదీ’ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా ఈ కార్యక్రమం దోహదపడుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి గురించి మాట్లాడటానికే పరిమితం కాలేదని, మహిళలే అభివృద్ధికి నాయకత్వం వహించే ‘Women-led Development’ విధానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిందని నితిన్ నబీన్ పేర్కొన్నారు.

