Santohsi Mata

దేవాలయాలపై వరుస దాడుల వెనుక కుట్ర

nrr visits santoshi mata templeదిల్‌సుఖ్‌నగర్‌ సంతోషి మాత ఆలయంపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. అక్టోబర్ 2న ఆయన స్వయంగా ఆలయాన్ని సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, పూజారులు, స్థానిక భక్తులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఉదయం పూజలు జరుగుతున్న సమయంలో హిందూ మతాన్ని, హిందూ దేవీదేవతలను విశ్వసించని ఇతర మతానికి చెందిన ఓ దుండగుడు ఆలయంలోకి చొరబడి పవిత్రమైన సంతోషీమాత విగ్రహంపై కర్రతో దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యావత్ సమాజం చూసి నిర్ఘాంతపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా దేవాలయాలపై దాడులు జరగడం ఇది మొదటిసారి కాదని, గతంలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటన మొదలుకొని ఇటీవల మల్కాజిగిరిలో జరిగిన ఘటనల వరకు ఇది దాదాపు ఏడో దాడి అని ఆయన గుర్తుచేశారు. ఈ వరుస ఘటనలను నిశితంగా పరిశీలిస్తే ఒక స్పష్టమైన కుట్ర, ఒకే పద్ధతి (ప్యాటర్న్) కనిపిస్తోందని విశ్లేషించారు. దాడులన్నీ దేవీమాత ఆలయాలనే లక్ష్యంగా చేసుకొని జరుగుతుండటం, ఈ ఘటనల్లో నిందితులు ఇతర మతస్తులే కావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దాడి జరిగినప్పుడల్లా పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడికి ‘మతిస్థిమితం లేదు’ అంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగానే మతిస్థిమితం లేకపోతే, వాళ్లకు కేవలం హిందూ దేవాలయాలు, అదీ దేవీమాత ఆలయాలు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి? అని ప్రశ్నించారు. పిచ్చివాళ్లని సాకుగా చూపి తప్పించుకునే వైఖరిని పోలీసులు ఇకనైనా మానుకోవాలని, దీని వెనుక ఉన్న అసలు కుట్రదారులను బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వరుస దాడులు యావత్ హిందూ సమాజ మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయని, హైదరాబాద్, తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన నింపుతున్నాయని పేర్కొన్నారు. అసలు నిందితులకు ఇంతటి తెగింపు ఎక్కడి నుంచి వస్తోందో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. స్వయంగా ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ పెద్దలు హిందూ దేవీదేవతలను, ఆలయాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి “మీ కోసమే మేమున్నాం, ఈ ప్రభుత్వమే మీది, ఈ పార్టీనే మీది” అనే రీతిలో ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు చేస్తుండటం వల్లే ఇటువంటి సంఘవిద్రోహ శక్తులు బరితెగిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే, ప్రతిసారీ ‘మతిస్థిమితం లేదనే’ బోగస్ కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే హైదరాబాద్ నగరంలోని హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని, దీనికి తీవ్ర ప్రతిఘటన, ప్రతికారం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలోని దేవాలయాల భద్రతను కాపాడాల్సిన సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తక్షణమే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రతి గుడి పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, భవిష్యత్తులో ఇలాంటి అపవిత్ర చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనిఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు.