గాంధీకి మనమిచ్చే నివాళి.. పరిశుభ్రత
సెప్టెంబర్ 27న ప్రసారమైన మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన సైనికులు తీసుకున్న ఈ చర్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న విధానంలో ఇది ఒక కీలక మలుపు. బాలాకోట్ వైమానిక దాడి నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇస్తామని భారత్ స్పష్టంగా చాటిచెప్పింది. ఒకప్పుడు వరుస ఉగ్రదాడులతో బాధపడిన భారత్ ఇప్పుడు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ ఏడాదితో 9/11 ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
దేశంలో జనగణన మొదటి దశ దాదాపు పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. మారుమూల, మంచు ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జనగణన మనందరి జాతీయ బాధ్యత. మొబైల్ ఫోన్ ద్వారా స్వీయ-నమోదు సౌకర్యం 16 భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 2.6 కోట్ల మందికి పైగా స్వీయ గణన పూర్తి చేశారు. మీ కుటుంబానికి సంబంధించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తుకు వాస్తవ చిత్రాన్ని అందిస్తుంది.
ఈ సంవత్సరం ‘సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం’ను జరుపుకున్నాం. 1026లో గజనీ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అదే సమయంలో మోఢేరా సూర్య దేవాలయంపై కూడా దాడి జరిగింది. అయితే భీమదేవ రాజు దాన్ని పునర్నిర్మించారు. ఎన్నిసార్లు విధ్వంసం జరిగినా మన వారసత్వాన్ని పునర్నిర్మించాలనే సంకల్పం కొనసాగింది. నేడు మోఢేరా సౌరశక్తి గ్రామంగా దేశానికి సుస్థిరతకు ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడ జరిగే నృత్యోత్సవం కూడా మన సాంస్కృతిక వైభవాన్ని చాటుతోంది. తమిళనాడులోని మనప్పారైలో పురాతన విగ్రహాలు, దేవాలయాలను గుర్తించేందుకు తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఎ. సెల్వరాజు చేపట్టిన క్షేత్ర పర్యటనలో వివిధ ప్రాంతాల్లో అనేక విగ్రహాలు, పురాతన దేవాలయాలను గుర్తించారు. ఇలాంటి ప్రయత్నాలు మన గతంతో మమేకం కావడానికి, మన వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి.
అక్టోబర్ 2న బాపూజీ జయంతి. ఆయన మనకు ఎన్నో జీవన మంత్రాలను అందించారు. అందులో పరిశుభ్రత కూడా ఒకటి. మన చుట్టూ పరిశుభ్రత కోసం జరుగుతున్న ఎన్నో ప్రయత్నాలను చూస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో కనిపించే చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మనకు స్ఫూర్తినిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి చిన్న ప్రయత్నంలో క్రమంగా మొత్తం సమాజం భాగస్వామ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో యువకులు పాత మెట్ల బావులు, ఇతర బావులను శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతోంది. ముంబయిలో యువకులు బీచ్‌లను శుభ్రంగా ఉంచేందుకు ప్రతి వారం వందల సంఖ్యలో ఒకచోట చేరి పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో యువకులు, విద్యార్థులు స్థానిక ప్రజలతో కలిసి పిక్నిక్ ప్రాంతాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి ప్రారంభిస్తే మరికొందరు అతనితో చేరతారు. ఆ తర్వాత ఆ ప్రయత్నం పెద్ద ఉద్యమంగా మారుతుంది. ఇదే ప్రజా భాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించగల అత్యంత అందమైన నివాళి పరిశుభ్రత.
పర్యావరణాన్ని పరిరక్షించడం అంటే కేవలం మొక్కలు, జంతువులను కాపాడటం కాదు. మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేయడం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు పెద్ద సంఖ్యలో ఉండేవి. కానీ అటవీ భూములపై మానవ ఆక్రమణలు పెరగడంతో అవి ఈ ప్రాంతానికి దూరమయ్యాయి. మూడేళ్ల క్రితం ఈ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏనుగులు తిరిగి వచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా కనిపించని ప్రాంతాల్లో ఇప్పుడు ఏనుగుల గుంపులు కనిపిస్తున్నాయి. అస్సాంలోనే పిగ్మీ హాగ్ అనే చిన్న జీవిని కాపాడేందుకు మరో ప్రయత్నం జరిగింది. ఒకప్పుడు దాని మనుగడ ప్రమాదంలో పడింది. కేవలం ఆరు పిగ్మీ హాగ్‌లతో సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి వాటిని తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాలను కూడా అభివృద్ధి చేశారు. ఈ ప్రయత్నాల ఫలితంగా నేడు పిగ్మీ హాగ్‌ల సంఖ్య 190కి పైగా పెరిగింది. ప్రకృతితో మన సంబంధం కేవలం దాన్ని పరిరక్షించడంతో ముగియదు. మనం ప్రకృతిని పోషిస్తే అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా నిలుస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్లో జార్ఖాళీకి చెందిన కొంతమంది మహిళలు మడ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. వారిలో చాలామంది పులుల దాడుల్లో భర్తలను కోల్పోయారు. ఆ తర్వాత సుందర్బన్ వారికి జీవనోపాధిగా మారింది. వారు నాటిన మడ మొక్కలు ఇప్పుడు గ్రామాలకు సహజ రక్షణ కవచంగా మారాయి. వాటిని పెంచడం ద్వారా వారు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. మనమంతా పర్యావరణాన్ని కాపాడాలి. ప్రకృతి సమతుల్యతను గౌరవించాలి. దాని వైవిధ్యాన్ని పరిరక్షించాలి. మనం చేసే ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యతను నెరవేర్చడమే.
దేశంలోని లక్షలాది యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేసింది. ‘మాదకద్రవ్య రహిత యువజన ఉద్యమం’ 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్, ఎన్ఎస్ఎస్, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు ఇందులో భాగమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. యువత తమ సొంత భాషలో, సృజనాత్మక పద్ధతుల్లో ‘నిషా విముక్తి సందేశం’ను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. యువత తమ సృజనాత్మక కంటెంట్‌ను #DrugFreeYouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. మాదకద్రవ్య రహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పంతో మనమంతా కలిసి ముందుకు సాగుదాం.
క్రీడల్లో ప్రతిభను గ్రామాలు, పట్టణాల నుంచి గుర్తించడం చాలా అవసరం. పంజాబ్‌లో రాజిందర్ సింగ్ హాకీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఆటగాడిగా, కోచ్‌గా ఆయన చేసిన సేవలు ఎంతో విలువైనవి. ఇప్పుడు గ్రామాల్లో హాకీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ కొత్త ప్రతిభను వెలికితీస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉసిరికాయ రైతులు, మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ పథకం ద్వారా ఉసిరికాయ ఆధారిత సుమారు 100 ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు క్యాండీ, మురబ్బా, జ్యూస్, పచ్చడి వంటి ఉత్పత్తులను తయారు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. దేశంలోని ప్రతి ప్రాంతానికీ ఒక ప్రత్యేక ఉత్పత్తి, కళ లేదా నైపుణ్యం ఉంది. వాటిని ప్రపంచానికి పరిచయం చేయడం ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ లక్ష్యం. రాబోయే పండుగల్లో ‘వోకల్ ఫర్ లోకల్’ను మనం మరచిపోకూడదు.
పోషకాహార లోపంపై పోరాటంలో అనేక రాష్ట్రాలు మంచి కార్యక్రమాలు చేపడుతున్నాయి. మునగ, చిరుధాన్యాలు, పోషకాహార తోటలను ప్రోత్సహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు ‘పోషణ్ ట్రాకర్’తో అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఈ ప్రయత్నాలను మరింత బలోపేతం చేసి పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించాలి.
గణేశుడిపై భక్తి భారతదేశానికే పరిమితం కాలేదు. థాయ్‌లాండ్‌లో గణేశుడిని ‘ఫ్రా ఫికానెత్’గా పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ నాలుగు దశాబ్దాలుగా గణేశ సంప్రదాయాలను అధ్యయనం చేస్తున్నారు. 2002లో చియాంగ్ మాయిలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. అక్కడ 10,000కు పైగా గణేశ విగ్రహాలు ఉన్నాయి. ఇది భారతదేశ విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తున్నాయో చూపిస్తుంది.

