పాలన గాలికొదిలేసి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్న రేవంత్
తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ దగాకోరు దోపిడీ పాలన మీద వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని, బిజెపి-బీఆర్ఎస్ ఒక్కటే అన్న పచ్చి అబద్ధపు భయంకర విష ప్రచారంతో, అలవి కాని హామీలతో, గారడీ మాటలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా పాలనను పక్కకుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ తన చెప్పుచేతుల్లోనే ఉండాలని, దిల్లీలోని సోనియా కుటుంబం కేవలం తనను మాత్రం నమ్మాలని, తనకు ప్రత్యామ్నాయంగా ఇంకొకరు సోనియా కుటుంబానికి లభించకూడదన్న ఎజెండాతో పబ్లిసిటీ స్టంట్లు, గారడీ మాటల రాజకీయాలు సాగిస్తూ వస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికెళ్తే అక్కడ ప్రముఖ దేవీదేవతల మీద ఒట్లు పెడుతూ, అప్పటికే తమ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతను కొంత వరకు తగ్గించుకున్నప్పటికీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ బిజెపి కన్నా ఒక్క లోక్ సభ స్థానం కూడా ఎక్కువ గెలుచుకోలేకపోయింది. అయినా తన పంథా మార్చుకోని రేవంత్ రెడ్డి పాలన కన్నా పబ్లిసిటీ స్టంట్ రాజకీయాలనే కొనసాగిస్తున్నారు.
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల, 13 డిక్లరేషన్ల వైఫల్యాల ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకు తెలంగాణ రైజింగ్, దావోస్ గోయింగ్, మెస్సీ కమింగ్, మిస్ వరల్డ్ కాంటెస్టు లాంటి కార్యక్రమాల గిమ్మిక్కులతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు తరహాలో మాటల పాలన కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిధుల కొరతను సాకుగా చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. హజ్ యాత్రికుల సమావేశంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేయడం ఆయన ఓటుబ్యాంకు రాజకీయాలను ప్రతిబింబిస్తోంది. ‘‘నన్ను కోసినా ఒక్క రూపాయి రాదు.. దిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే దొంగల్లా చూస్తున్నారు.. ఎక్కడా అప్పులు పుట్టడం లేదు’’ అంటూ ఉద్యోగుల డిమాండ్ల విషయంలో చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి.. హజ్ యాత్రికుల ఏర్పాట్లకు మాత్రం డబ్బుకు కొదవ లేదని, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల కోసం కూడా ఖర్చు చేస్తామని ప్రకటించడం విరుద్ధ వైఖరికి అద్దం పడుతోంది. ఒకవైపు ఉద్యోగుల హామీల అమలుకు ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ, మరోవైపు ఇతర రాష్ట్రాల యాత్రికుల ఏర్పాట్లకూ నిధులు కేటాయిస్తామనడం నిర్లజ్జ, నీతిబాహ్యమైన సంతుష్టీకరణ రాజకీయాలకు నిదర్శనం.
అధికారంలోకి రాగానే కేసీఆర్ దోపిడీ సొమ్ము కక్కిస్తాం, కఠినంగా శిక్షిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, కమిషన్ల కోసం కమిషన్లు వేసి, కల్వకుంట్ల కుటుంబం నుంచి భారీగా వసూలు చేసి, దిల్లీకి పంపుతూ, కొంత దిగమింగుతూ, కేసులను నిర్వీర్యం చేస్తున్నారు. తన ఓటుకు నోటు కేసును కేసీఆర్ వాడుకున్న విధంగా కల్వకుంట్ల దోపిడీ కేసులను వాడుకుంటున్న రేవంత్ కేసీఆర్ కుటుంబాన్ని కేసుల నుంచి బయట పడేసే దీర్ఘకాలిక రాజకీయ డ్రామా నడిపిస్తున్నారు. మధ్యలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో హరీష్ రావుకు, కేటీఆర్ కు నోటీసులు పంపుతూ, కల్వకుంట్ల దోపిడీదారులను శిక్షిస్తున్నట్టు ప్రజలను దగా చేస్తూ, మూటలు వసూలు చేస్తున్నాడు తప్పితే ప్రజలకు సరైన అభివృద్ధి, సంక్షేమ పాలన అందించడం లేదు.
గత వర్షాకాలం వడ్ల కొనుగోలు సమయంలో కూడా రైతులను పెట్టిన అరిగోస కేసీఆర్ పాపాలకు దీటుగా అన్నట్టు అనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు టెండర్ల కోసం కొట్లాడుకుంటూ, మంత్రులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా బహిరంగంగా విమర్శించుకోవడం మనం చూశాం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు, పై నుంచి కింది వరకు ఏవిధంగా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యేలకు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మంత్రులకు, కాంగ్రెస్ సొంత నాయకులకు, బయటి నుంచి వచ్చిన నాయకులకు మధ్య నిరంతరం జరుగుతున్న గ్రూపు తగాదాలు వాళ్ల రాష్ట్ర ఇంచార్జీ రాజ్యసభ ఎన్నికకే ఎసరు పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీ భవన్ సుదీర్ఘ కాలంగా పంచాయితీ భవన్ గా నడుస్తుంది. ఇక్కడ పరిష్కారం కాని పంచాయితీలు దిల్లీ వరకు వెళ్తున్నాయి.
కేసీఆర్, హరీష్ రావు లాగానే మాయమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తను నిరంతరం మీడియాలో ఉండేవిధంగా పబ్లిసిటీ స్టంట్లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు తనకు ప్రత్యామ్నాయంగా ఎదగకుండా, ఇచ్చిన దగాకోరు హామీలు ప్రజలు మరచిపోయే విధంగా పబ్లిసిటీ స్టంట్లు నడిపిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. ఉన్నత శ్రేణి ఉద్యోగులను రాజకీయంగా వాడుకుంటూ, కేసీఆర్ తరహాలో పరిపాలనా వ్యవస్థకు మరింత చేటు చేస్తూ, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ, సంక్షేమ పథకాలకు గండికొడుతూ మొత్తంగా పరిపాలనను అటకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి మాటలు, పాలన అంటే స్టంట్లు అన్నవిధంగా నడిపిస్తున్న తీరుపై మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంవత్సరం ముందు నుంచే భయంకర ఎల్ నినో గురించి తీవ్ర హెచ్చరికలు వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు సూచనలు చేసినప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది. నదుల్లో లభిస్తున్న ఆ మాత్రం నీటిని కూడా ముఖ్యంగా గోదావరి నుంచి లిఫ్టు చేయకుండా ఉత్తర తెలంగాణ రైతులను దగా చేస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణ నది నీటిని సరైన రీతిలో వాడుకోకుండా, జూరాల ఆయకట్టు రైతుల పంటలను కూడా ఎండబెడుతూ, దక్షిణ తెలంగాణ ప్రజలను ముంచుతోంది. భవిష్యత్తులో యావత్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు ఊహకందని తాగునీటి కష్టాలు కలిగించేలా రేవంత్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది.
తాము చేసిన దోపిడీని తెలంగాణ ప్రజలు మరచిపోతారనుకుంటున్న కల్వకుంట్ల కుటుంబ నాయకులు కాంగ్రెస్ మీద వస్తున్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని ఆశిస్తున్నారు. అంతర్గత కుమ్మక్కై, పైకి చేస్తున్న కొట్లాడుకుంటున్నట్టు బీఆర్ఎస్ చేస్తున్న ఓవరాక్షన్ డ్రామాలు, అసెంబ్లీ లోపలా, బయటా బాధ్యతాయుత ప్రతిపక్షంగా బిజెపి నాయకులు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలకు అర్థమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందిస్తున్న నిరంతర సహాయం, గత 12 ఏళ్లకు పైగా ఒక్క కుంభకోణం లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ, సంక్షేమాన్ని విస్తరిస్తూ, సురక్ష బలపరుస్తూ, నడుస్తున్న మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా విద్యావంతులను ఎంతో ఆకర్షిస్తోంది. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ లాగానే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి 30 లక్షల నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిన తీరు వారికి పట్టలేని ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇప్పుడు రూ.6000-10000 జీతంతో వాలంటీర్ల నియామకం అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామాను తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు అసహ్యించుకుంటున్నారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ, తాగుబోతుల తెలంగాణగా మారిస్తే.. రేవంత్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత దెబ్బతీసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ, రాష్ట్రం కోలుకోలేనివిధంగా చేస్తోంది. రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు చూస్తే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని భరించే పరిస్థితి లేదని అర్థమవుతోంది.

