వారిది అరాచకత్వం.. మాది ప్రజాస్వామ్యం
కరీంనగర్ జనసంద్రమైంది. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేపడుతున్న దుష్ప్రాచారాన్ని తిప్పికొడుతూ నవంబర్ 23న బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు వెల్లువలా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన జనం, కాషాయ కార్యకర్తలతో కరీంనగర్ వీధులు కిక్కిరిసిపోయాయి. పాదయాత్ర సాగిన వైశ్యాభవన్ నుంచి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు జనసందోహం బారులుతీరింది. లక్ష మందికి పైగా ప్రజలు, కార్యకర్తలు బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెంట నడిచారు. నితిన్ నబీన్ ఓ చేతిలో జాతీయ జెండా పట్టుకొని, మరో చేతితో ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ప్రజలు ఇండ్లు, భవనాలు ఎక్కి పాదయాత్రను ఆసక్తిగా వీక్షించారు. యాత్ర కొనసాగినంత సేపు నితిన్ నబీన్ బృందంపై కరీంనగర్ ప్రజలు పూలవర్షాన్ని కురిపించారు. ఈ పాదయాత్రలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ సునిల్ బన్సల్, సహ ఇంచార్జ్ అభయ్ పాటిల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, రామారావు పాటిల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ సహా రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వారిది అరాచకత్వం.. మాది ప్రజాస్వామ్యం
ఈ పాదయాత్రకు వచ్చిన అనూహ్య స్పందన చూసి నితిన్ నబీన్ సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మహా పాదయాత్రకు ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చి బిజెపికి మద్దతుగా నిలిచారని పేర్కొంటూ, పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు, యువతకు, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ప్రణామాలు తెలిపారు. బండి సంజయ్ పనితీరును గతంలోనూ చూశానని, ఆయనతో పాటు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమర్థవంతమైన నాయకత్వం, కార్యకర్తల కృషి ఫలితంగానే ఈ జనసందోహం కనిపిస్తోందని అన్నారు. కరీంనగర్‌లోని ప్రతి ఇంటికి అన్నదమ్ముడిలా, సొంత బిడ్డలా అండగా నిలిచారంటూ బండి సంజయ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. వైశ్యా భవన్ వద్ద ఏర్పాటు చేసిన వాహనం నుంచి అశేష జనసందోహాన్ని ఉద్దేశించి నితిన్ నబీన్ ప్రసంగించారు. ప్రజాస్వామ్య గొంతుకను ప్రజలతో కలిసి బలంగా వినిపించేందుకే కరీంనగర్ గడ్డపైకి వచ్చామని, రాహుల్ గాంధీ అసలు స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు వివరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని వివరించడంతో పాటు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.
ఈ మహాపాదయాత్రలో కంటికి కనిపించినంత దూరం ప్రజలే కనిపిస్తున్నారని నితిన్ నబీన్ అన్నారు. ఇటీవల విపక్షాలు తమ సర్వశక్తులూ ఒడ్డినా ఒక్క రామ్‌లీలా మైదానాన్ని కూడా నింపలేకపోయాయని విమర్శించారు. అయితే, బిజెపి కార్యకర్తలు దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రాంతాల్లో రామ్‌లీలా మైదానానికి పదిరెట్ల జనసమీకరణతో తమ సత్తా చాటారని పేర్కొన్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి అరాచకత్వాన్ని నమ్ముకుంటే.. బిజెపి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుందని, అందుకే ప్రజల ఆశీర్వాదం లభిస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని, కానీ ప్రజలు, ప్రజల ఓట్లు బిజెపి పక్షాన ఉన్నాయని అన్నారు. రాహుల్ గాంధీకి ఓటు చోరీ రాజకీయాలే మిగిలాయని విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఇండీ కూటమి నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నితిన్ నబీన్ విమర్శించారు. చనిపోయిన మూడు కోట్ల మంది పేర్లు ఓటరు జాబితాలో కొనసాగాలా? ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఆరు కోట్ల మందికి రెండు చోట్ల ఓటు హక్కు కల్పించాలా? అంటూ ప్రశ్నించారు. 2002 నాటి ఓటరు జాబితాలో తమ వివరాలను గుర్తించలేకపోతున్న మూడు కోట్ల మంది ఓటర్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, వారి ఓట్లనే తొలగించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని పేర్కొన్నారు. చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించాలా వద్దా అనే విషయాన్ని కరీంనగర్ ప్రజలే ఆలోచించాలని అన్నారు. మూడు కోట్ల మంది చొరబాటుదారులకు ఓటు హక్కు ఉండాలని కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు కోరుకుంటున్నారని ఆరోపించారు. అసలు ఓట్ల చోరీకి పాల్పడుతున్నదెవరో విపక్షాలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఉల్లంఘించింది
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, కానీ రాజ్యాంగం బిజెపి మనస్సులో, హృదయంలో ఉందని నితిన్ నబీన్ అన్నారు. కాంగ్రెస్ నేతలు కేవలం మాటల్లోనే రాజ్యాంగం గురించి మాట్లాడుతారని, బిజెపి మాత్రం రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల పట్ల కూడా బిజెపికి పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గతంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని ఆరోపిస్తూ, దేశంలో ఎమర్జెన్సీ విధించి కుటుంబ ప్రయోజనాలు, పదవుల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశంలో ఉన్నా, విదేశాలకు వెళ్లినా భారత్‌ను, రాజ్యాంగ సంస్థలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రపంచంలోని అత్యంత బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితా ‘ఫ్రెజైల్ ఫైవ్’లో ఉన్న భారత్, నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక శక్తిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని అన్నారు.
2004 నుంచి 2014 వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఏమి చేసిందని, మహిళలకు ఎలాంటి గౌరవం ఇచ్చిందని నితిన్ నబీన్ ప్రశ్నించారు. ఆ సమయంలో దేశంలో నిరాశానిస్పృహల వాతావరణం ఉండేదని, గుజరాత్ నుంచి నరేంద్ర మోదీ రావడంతో దేశంలో కొత్త ఆశలు, నమ్మకం చిగురించాయని అన్నారు. 2014లో ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, అప్పటి నుంచి దేశ ప్రధాన సేవకుడిగా ప్రజల కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికలు, అధికారం మాత్రమే తెలుసునని, ప్రజాసేవ అంటే తెలియదని విమర్శించారు. బిజెపికి మాత్రం ఎన్నికలు అనేవి ప్రజలకు సేవ చేసే మార్గమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. గతంలో కేంద్రం ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే పేదలకు కేవలం 15 పైసలే చేరేవని, మోదీ ప్రభుత్వంలో రూపాయికి రూపాయి నేరుగా లబ్ధిదారులకు అందుతోందని పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందుతుండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు.
దేశ భద్రత, సైనికుల విషయంలోనూ కాంగ్రెస్, బిజెపి పాలనల మధ్య తేడాను నితిన్ నబీన్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో సరిహద్దులను కాపాడే సైనికులకు స్వేచ్ఛ ఉండేది కాదని, మోదీ పాలనలో సైనికులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో సరిహద్దు గ్రామాలను దేశానికి చివరి గ్రామాలుగా భావించేవారని, మోదీ పాలనలో వాటిని దేశాభివృద్ధిలో మొదటి గ్రామాలుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రతిపక్ష నేతలు ఇళ్లకే పరిమితమైతే, బిజెపి కార్యకర్తలు ప్రధాని మోదీ నాయకత్వంలో సేవాభావంతో ప్రజల మధ్యకు వచ్చి అండగా నిలిచారని గుర్తుచేశారు. ‘మోదీ వ్యాక్సిన్’ అంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన విపక్ష నేతలు సైతం ఆ తర్వాత అదే వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని విమర్శించారు. దేశంలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు, విదేశీ ‘టూల్‌కిట్’లుగా మారి భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తుల కుట్రలను ప్రజలంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి పాలన ఢిల్లీ బాస్‌లకు ఏటీఎంలా మారింది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలకు దేశ అభివృద్ధిపై ఎలాంటి చింత లేదని, తమ కుటుంబం, పార్టీ, వ్యక్తిగత అభివృద్ధిపైనే దృష్టి ఉందని విమర్శించారు. తెలంగాణలో 36 నెలల పాలన కూడా పూర్తికాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 82 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం ముందు మోకరిల్లారని ఆరోపించారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదాల కంటే దిల్లీ పెద్దల ఆశీర్వాదాల కోసమే రేవంత్ రెడ్డి ఎక్కువగా ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు, యువతకు కాకుండా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలకు ఏటీఎంలా పనిచేస్తున్నారని విమర్శించారు. కష్టపడి పనిచేసే తెలంగాణ పేద ప్రజల చెమట, శ్రమను దోచి ఢిల్లీ పెద్దల ఏటీఎంలను నింపే పనిలో ముఖ్యమంత్రి నిమగ్నమయ్యారని ఆరోపించారు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఆ హామీలను నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డికి ఎలాంటి శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలని అన్నారు. ఒక అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించిన తెలంగాణ ప్రజలకు, అంతకంటే పెద్ద అవినీతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పట్లో తెలియదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, రానున్న రోజుల్లో బిజెపి కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ యువత భవిష్యత్తు, ఆడబిడ్డల గౌరవం కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కరీంనగర్ గడ్డపై నుంచే సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ తమ కుటుంబ ప్రయోజనాల గురించే ఆలోచించారని, ఇతరులను గౌరవించే సంస్కృతి వారికి లేదని నితిన్ నబీన్ విమర్శించారు. తెలంగాణ గడ్డపై పుట్టి దేశ ప్రధానిగా ఎదిగిన పీవీ నరసింహారావును సైతం కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు. కరీంనగర్ కార్యకర్తల బలం, ఉత్సాహంతో బిజెపి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
2029లోనూ మోదీనే ప్రధానిగా..!
2028, 2029 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం బిజెపికి లభిస్తుందన్న విశ్వాసాన్ని నితిన్ నబీన్ వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని విడిచి వెళ్లరని, 2029లో మరోసారి ఎర్రకోటపై నుంచి జాతీయ జెండాను ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశ యువత, కార్మికులు, మహిళలు, రైతులు మోదీ నాయకత్వానికి అండగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఏదైనా సంకల్పం తీసుకుంటే దానిని తప్పకుండా సాకారం చేస్తారని అన్నారు. దేశాన్ని ‘నషా ముక్త్ భారత్’గా, అంటే డ్రగ్స్ రహిత భారతదేశంగా మార్చాలన్న ప్రధాని పిలుపును ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్‌డౌన్ మొదలైందని, రానున్న రోజుల్లో బిజెపి కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు, అధికారం మాత్రమే తెలుసునని, ప్రజలకు సేవ చేయడం తెలియదని విమర్శించారు. తెలంగాణ యువత భవిష్యత్తు, మహిళల గౌరవం, రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర: ఎన్. రాంచందర్ రావు
ఈ కార్యక్రమంలో ఎన్.రాంచంరదర్ రావు ప్రసంగిస్తూ.. గత 12 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ అసహనంతో బిజెపి, ఎన్డీఏ ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కేవలం నెహ్రూ కుటుంబం నుండి వచ్చిన వారే దేశాన్ని పరిపాలించాలని, ఇతరులకు ఆ అర్హత లేదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. గత 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ, దాదాపు 50 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుండి బయటపడటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. అధికారం కోసం దేశ విచ్ఛిన్నకర శక్తులను పెంచి పోషిస్తూ, విద్యార్థులను రెచ్చగొడుతూ, కులాలు, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను రాంచందర్ రావు తీవ్రంగా తిప్పికొట్టారు. గతంలో 8 సార్లు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందని, ఇప్పుడు 9వ సారి జరుగుతోందని గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో జరిగినప్పుడు లేని అభ్యంతరం, నేడు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో నిర్వహిస్తుంటే ఎందుకు వస్తోందని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక చెల్లదంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆ ఎన్నికల ప్రక్రియ ప్రకారం మోదీ ఎన్నిక చెల్లకపోతే, అదే ప్రక్రియ ద్వారా గెలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక కూడా చెల్లదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాటలకు కట్టుబడి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అంతకన్నా పెద్ద జోక్, హాస్యాస్పదమైన వ్యాఖ్య మరొకటి ఉండదని రాంచందర్ రావు అన్నారు. రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోవడానికి బిజెపి అగ్రనేతలు అవసరం లేదని, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సరిపోతారని వ్యాఖ్యానించారు. విదేశీ గడ్డపై విదేశీయులతో కలిసి భారతదేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే కరీంనగర్ గడ్డపై ఈ మహా పాదయాత్రను చేపట్టామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

