మోదీని విమర్శించే అంశాలు లేక కాంగ్రెస్ దుష్ప్రచారం
బిజెపి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ శతాబ్దపు పెద్ద అబద్ధమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు దొరకక కాంగ్రెస్ దుష్ప్రచారానికి తెగబడిందని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనతో బిజెపి పాలనను పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, అభివృద్ధి సంక్షేమం విషయంలో మోదీని విమర్శించేందుకు కాంగ్రెస్ కు ఎలాంటి అంశాలు దొరకడం లేదన్నారు. అందుకే అబద్ధపు పునాదులపై ఎదిగిన కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టిందన్నారు. బిజెపి రిజర్వేషన్స్ రద్దు చేస్తుందని ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలను నమ్మించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ దుర్మార్గపు ప్రచారాలను, కుట్రలను, కుతంత్రాలను ప్రజలు గుర్తించారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్దిపేట ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి పరాకాష్ట. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బిజెపి, బీఆర్ఎస్ ఒకటే అని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లపై, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై చర్చకు సిద్ధం… దమ్ముంటే రేవంత్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏప్రిల్ 28న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.
‘‘తెలంగాణలో బీసీ రిజర్వేషన్ లను రద్దు చేసిందే కాంగ్రెస్ పార్టీ… అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తూ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో గండి కొట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్లపై బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదు. దేశంలో అత్యున్నత పదవులు నుంచి మొదలుపెడితే రాజకీయాల వరకు అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం చేసింది బిజెపి పార్టీ. దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను, ఆదివాసి సామాజిక వర్గానికి చెందిన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసింది బిజెపి. ఆదివాసి మహిళా అభ్యర్థిని రాష్ట్రపతి చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. దేశంలో మొదటిసారి బీసీ వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిదే.
కేంద్ర ప్రభుత్వంలో స్వతంత్రం అనంతరం తొలిసారి 27 మంది బీసీలను మంత్రులు చేసిన ఘనత బిజెపిదే. 12 మంది దళితులను కేంద్ర క్యాబినెట్లో మంత్రులు చేసిన ఘనత బిజెపిదే. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కేంద్ర క్యాబినెట్ లో పని చేస్తున్నారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్ధమైన అధికారాలు కల్పించి చట్టబద్ధత కల్పించింది బిజెపి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అత్యధికంగా బిజెపిలోనే ఉన్నారు.
మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకంలో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్న వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలే. విశ్వకర్మ, స్వనిధి, ముద్రా, స్టాండప్ ఇండియా పథకాల్లో బడుగులకే పెద్దపీట వేశాం. బడుగు బలహీన వర్గాల మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ 13 కోట్ల టాయిలెట్లు నిర్మించాం. అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో పని చేస్తున్న బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజలకు అందించే దిశగా వారి జ్ఞాపకాలని, వారి గౌరవాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతోంది.
గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తుంది. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత వాతావరణం కనిపించడం లేదు. భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ యాత్ర చేస్తే కాంగ్రెస్ చోడో అంటూ ఆ పార్టీ నాయకులు పార్టీని వీడారు. మౌలిక వసతులు, విదేశీ విధానం, ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగం… ఇలా అన్ని రంగాలలో మోదీ ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధించింది. రోజు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. మోదీ అవినీతిపరుడని విమర్శించే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని తట్టుకోలేక కాంగ్రెస్, రాహుల్ గాంధీ నిరాశా నిస్పృహలతో ఆశలు అడియాసలైన వేళ కల్లబొల్లి మాటలు చెప్తుంది.
తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు న్యాయం జరగాలంటే అది బిజెపితోనే సాధ్యం. ఏం చెప్పి ఓట్ల అడగాలో రేవంత్ రెడ్డికి తోచడం లేదు, శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఓట్లు.. ప్రమాణాలు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో ప్రజలకు న్యాయం జరగదు. తెలంగాణలో కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో స్పందన లేదు, ప్రజల నుంచి ఆదరణ లేదు, దీంతో కొత్త నాటకానికి తెరలేపింది.
సిద్దిపేటలో అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. ఇది ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీయడమే, సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే. రేవంత్ రెడ్డి… హామీలు అమలు చెయ్… లేదంటే లెంపలేసుకుని గద్దె దిగిపో… పార్లమెంటు ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లకే కాంగ్రెస్ పరిమితం కాబోతుంది. ఇది తట్టుకోలేక బిజెపిపై విష ప్రచారం చేస్తుంది. శాసనసభ ఎన్నికల్లో లానే పెద్ద ఎత్తున అమలు కాని హామీలు ఇస్తోంది. బీసీ రిజర్వేషన్ల పేరుతో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. తెలంగాణ ప్రజలు ఈ వాస్తవాల్ని గమనిస్తున్నారు.
బిజెపి ఇచ్చిన మాట తప్పదు. మేం మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇటలీ అజెండా అవినీతి జెండా బిజెపికి లేదు… రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ పెట్టలేదు.. పత్రిక స్వేచ్ఛను హరించలేదు.. ప్రజా సంఘాలను నిషేధించలేదు.. ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టలేదు.. అక్రమంగా రాజకీయ పార్టీ నాయకులను అరెస్ట్ చేయలేదు… అధికారం కోసం కుర్చీ కోసం రాజ్యాంగాన్ని అవహేళన చేసి ఇందిరా గాంధీ కుర్చీ నిలుపుకొన్న చరిత్రను, ఎమర్జెన్సీని దేశ ప్రజలు మర్చిపోలేదు.’’ అని అన్నారు.

