బిజెపి అభ్యర్థులను గెలిపించాలి: రాజ్ నాథ్ సింగ్
‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్‌వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. బీఆర్ఎస్.. ప్రజల సొమ్మును లూటీ చేసింది. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీనే. అధికారం కోసం బిజెపి రాజకీయాలు చేయదు. దేశ నిర్మాణానికి కృషి చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో అవినీతి రహిత పాలన సాగుతోంది’. అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 19న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత సికింద్రాబాద్‌లోని మెహబూబ్ కళాశాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. అనంతరం ఖమ్మంలో అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీ, రోడ్ షోలోనూ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ప్రధాన మంత్రులు పేదరికాన్ని పెంచి పోషించారని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. కిషన్‌రెడ్డి మంచి విలువలు కలిగిన వ్యక్తి అని, ప్రతి విషయంపైనా సాధికారికంగా మాట్లాడతారని ప్రశంసించారు. ఆయనతోపాటు అన్ని నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులందరినీ గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బిజెపి కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
తెలంగాణలో బిజెపి క్లీన్ స్వీప్: పీయుష్ గోయల్
హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో బిజెపి క్లీన్ స్వీప్ చేస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న చేవెళ్ల, జహీరాబాద్ లోక్‌సభ బిజెపి అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీబీ పాటిల్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ప్రతిపక్షాలు సిద్ధాంతాలను పక్కనపెట్టి ఇండియా కూటమి పేరుతో ఏకమయ్యాయి. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు దిల్లీలో దోస్తీ చేస్తూ… కేరళలో కుస్తీ పడుతున్నాయి. బెంగాల్లో మమత బెనర్జీకి కాంగ్రెస్‌తో పొసగడం లేదు. రాహుల్‌గాంధీ కేరళకు వెళ్లి విజయన్ను, బెంగాల్‌కు వెళ్లి మమతను విమర్శించడం ఇందుకు నిదర్శనం. మోదీ అనుసరించిన సమర్థమైన ఆర్థిక విధానాలతో దేశంలో పేదరికం తగ్గింది’’ అని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తెలంగాణలో అవినీతి బీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.
ఈటల విజయోత్సవ సభకు వస్తా: హర్దీప్సింగ్ పురి
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. ఏప్రిల్ 18న మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోనే పెద్దదిగా, మినీ ఇండియాగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన అన్నారు. ఈటల భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని.. ఆయన విజయోత్సవ సభకు తాను మళ్లీ వస్తానని అన్నారు.
బిజెపితోనే వికసిత్ తెలంగాణ: ప్రమోద్ సావంత్
గత పదేళ్లలో తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆరోపించారు. ఏప్రిల్ 18న రాత్రి మెదక్‌లో బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ, కూడలి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘వికసిత భారత్, వికసిత తెలంగాణ’ బిజెపితోనే సాధ్యమని, బిజెపిని అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలిపించాలని కోరారు. దోపిడీ చేసేందుకే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని కలెక్టర్ ఉద్యోగం నుంచి ఎమ్మెల్సీగా చేశారని ఆరోపించారు.
దేశ ప్రధానిగా మోదీ అవసరం: కిరణ్ రిజిజు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమలు, భూశాస్త్ర శాఖల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి ప్రాధాన్యానికి నోచుకోని ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం.. అభివృద్ధికి బిజెపి పాటుపడిందన్నారు. ఏప్రిల్ 22న మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ల ర్యాలీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘బిజెపి ప్రభుత్వం గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి ఇవ్వడంతోపాటు ఎస్టీ వర్గానికి చెందిన నన్ను కేంద్ర మంత్రిని చేసింది. దేశానికి ప్రధానిగా మోదీ అవసరం ఉంది. నల్గొండలో బిజెపిని గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పుతాం.’ అని పేర్కొన్నారు.

