Hamara Sankalp Vikasit Bharat
Narendra Modi

కాంగ్రెస్ వస్తే ప్రజల సంపద ముస్లింలకు పంచుతుంది

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులపై మైనారిటీలదే తొలి హక్కని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోదీ ఉదాహరించారు. ‘‘ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా?’’ అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు. ఏప్రిల్ 21న రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పర్యటిస్తూ గత పదేళ్ల పాలన విజయాలను వివరిస్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ తదితర ఇండీ కూటమి పార్టీల వైఫల్యాలను ఎండగడుతున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ ప్రజలకు చేరువవుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

కాంగ్రెస్ కు అభ్యర్థులే లేరు

Narendra Modi In Election Campaign

దేశంలో ఒకనాడు 400కు పైగా స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ నేడు 300 నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేయడం కూడా కష్టంగా ఉందని, ఆ పార్టీ చేసిన పాపాలకు దేశం శిక్షిస్తోందని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోందని విమర్శించారు. ‘ఇండియా’ పేరుతో విపక్షాలు ఏర్పాటు చేసినది అవకాశవాద కూటమి అని, అది ఆకాశంలోకి ఎగరకముందే దారం తెగిన గాలిపటం లాంటిదని ప్రధాని అభివర్ణించారు. ‘‘ఎన్నికల క్షేత్రంలో పోటీ పడేందుకు వెనుకాడుతున్నవారు ఈసారి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు వచ్చారు. ఇదీ కాంగ్రెస్‌ దుస్థితి’’ అంటూ పరోక్షంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని యూపీఏ సర్కారులో ప్రధానిని ఎవరూ పట్టించుకోలేదని, పాలన అంతా రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడిచిందని ఆరోపించారు. అప్పటి క్యాబినెట్‌ ఆమోదించిన ఆర్డినెన్సును సొంత పార్టీ నాయకుడే మీడియా సమావేశంలో చించి పక్కన పడేశారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి విమర్శించారు. అస్థిరతకు మారుపేరైన ఇటువంటి పార్టీ దేశాన్ని నడపగలదా? అని ఓటర్లను ప్రధాని ప్రశ్నించారు. వామపక్షాల ఉచ్చులో చిక్కిన కాంగ్రెస్‌ మావోయిజం సిద్ధాంతాలను అమలుచేయాలని చూస్తోందన్నారు. కనీసం 25 శాతం స్థానాల్లో పరస్పరం పోటీ పడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలను మీరు విశ్వసిస్తారా? అని ఓటర్లను ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ వేర్లు, భూమితో సంబంధం లేని ఓ తీగ లాంటిదని.. అది తనకు అండగా నిలిచినవారినే ఎండగట్టి కబళిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మహారాష్ట్ర ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిందన్నారు. 2019లో అమేఠీ నుంచి ఓడిపోయిన కాంగ్రెస్‌ యువరాజు ఈసారి వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఓడిపోనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమిపై మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ అందులోని కాంగ్రెస్‌, నకిలీ శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే పార్టీ) యాకుబ్‌ మెమన్‌ (1993 ముంబయి వరుస పేలుళ్ల దోషి) సమాధిని అలంకరించడంలో నిమగ్నమై ఉన్నాయని  ధ్వజమెత్తారు. బెంగళూరు వంటి టెక్‌ సిటీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీళ్ల సమస్యతో ‘ట్యాంకర్‌ సిటీ’గా మార్చిందని మోదీ విమర్శించారు. ఇక్కడ ఆడబిడ్డలకు రక్షణ లేదా.. స్వేచ్ఛగా భజన చేసుకునే అవకాశం కూడా లేదా అంటూ కర్నాటకలో ఇటీవల జరిగిన ఘటనలను ప్రస్తావించారు.

లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీల జోడీపై ప్రధాని మోదీ సినీ పరిభాషలో ధ్వజమెత్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సభలో ఆయన ఎస్పీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘‘ఇద్దరు యువరాజుల జోడీ (దో షెహజాదేకీ జోడీ) సినిమా షూటింగు ఇక్కడ జరుగుతోంది. వారిద్దరి చిత్రాన్ని యూపీ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు’’ అని ఎద్దేవా చేశారు. బాబ్రీ మసీదు కేసులో కక్షిదారుగా ఉన్న ఇక్బాల్‌ అన్సారీ అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు పిలిస్తే వచ్చారని.. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు మాత్రం తిరస్కరించాయని దుయ్యబట్టారు. ద్వారకలో శ్రీకృష్ణుని పూజించేందుకు తాను సముద్రం అడుగుకు వెళితే, కాంగ్రెస్‌ యువరాజు అక్కడ ఏమీలేదని ప్రజల విశ్వాసాలను కించపరిచారన్నారు.

గ్యారంటీకి ఉదాహరణ ఈశాన్యం

‘‘మొదటిసారి 2014 ఎన్నికల్లో ప్రజల వద్దకు ఆశతో వెళ్లాం. రెండోసారి 2019లో నమ్మకంతో, ఇప్పుడు మూడోసారి 2024లో గ్యారంటీతో వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా మోదీ గ్యారంటీలు వినిపిస్తున్నాయి. ఆ హామీలన్నీ నెరవేర్చే పూచీ నాది అని కూడా నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈశాన్య భారతమే దీనికి ఉదాహరణ. ఈ ప్రాంతానికి కాంగ్రెస్‌ ఏమైనా ఇచ్చిందంటే అవి సమస్యలు మాత్రమే. బిజెపి  ఈ ప్రాంతాన్ని అవకాశాలకు వనరుగా మార్చింది. కాంగ్రెస్‌ ఇక్కడ తిరుగుబాటుకు ఆజ్యం పోసింది. నేను ఈశాన్య ప్రజల్ని హత్తుకుని ఇక్కడ శాంతిని నెలకొల్పాను. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరగనిదానిని పదేళ్లలోనే నేను చేసి చూపించాను’’ అని వివరించారు.

తూర్పున ఉన్న ప్రాంతాలను దోచుకునేందుకు ‘లూట్‌ఈస్ట్‌’ను కాంగ్రెస్‌ ఒక విధానంగా పాటిస్తే బిజెపి మాత్రం ఆ ప్రాంతానికి మేలు చేసేలా ‘యాక్ట్‌ఈస్ట్‌’ను అమలు చేసిందని మోదీ చెప్పారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండిఉంటే మొబైల్‌ ఫోన్ల బిల్లులు నెలకు రూ.4,000-5,000కి చేరేవన్నారు.

అంబేడ్కర్‌ రాజ్యాంగానికి రుణపడి ఉంటా

నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగేందుకు తనకు తోడ్పడిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగానికి రుణపడి ఉంటానని ప్రధాని మోదీ అన్నారు. బిజెపి రాజ్యాంగాన్ని రద్దు చేసే యోచన చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను దీటుగా తిప్పికొట్టారు. అమృతకాల్‌ ఉత్సవాల తరహాలో భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన వేడుకను సైతం ఈ ఏడాది జరుపుకోబోతున్నట్లు తెలిపారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టి, దాని స్వరూపాన్ని మార్చాలని చూసినవారికి రాజ్యాంగమంటే చిన్నచూపే ఉంటుంది’’ అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. బిహార్‌కు జంగిల్‌రాజ్‌ నుంచి ఎన్డీయే విముక్తి కల్పించిందని, ఆర్జేడీ నేతల అవినీతిపై విచారణ కొనసాగుతుందన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌ను చొరబాటుదారులు, గూండాలకు లీజుకు ఇచ్చిందని ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోయిందన్నారు. అవినీతి, నేరాలు నిత్య వ్యవహారంగా మారిన  టీఎంసీ పాలనలో దర్యాప్తునకు వచ్చిన కేంద్ర ఏజెన్సీలపై కూడా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ‘‘రాష్ట్ర జనాభాను ప్రభావితం చేసేలా దేశంలోకి అక్రమంగా ప్రవేశించే రోహింగ్యాలు, చొరబాటుదారులకు టీఎంసీ మద్దతు ఇచ్చి.. శాంతిభద్రతల సమస్యలకు దోహదం చేస్తుంది. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ‘సీఏఏ’ను మాత్రం వ్యతిరేకిస్తోంది’’ అని మోదీ విస్మయం వ్యక్తం చేశారు. 

సహకార బ్యాంకుల కుంభకోణంలో సీపీఎం పేదల సొమ్మును దోచుకొందని, దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత మౌనం ఎందుకు పాటిస్తున్నారని నిలదీశారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి దేశంలో నిషేధించిన పీఎఫ్‌ఐ సంస్థ రాజకీయ విభాగమైన సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాతో కాంగ్రెస్‌ రహస్య ఒప్పందం చేసుకుందని మోదీ ఆరోపించారు. ‘‘త్రిపుర, పశ్చిమబెంగాల్‌ నుంచి కేరళ వరకు వామపక్ష ప్రభుత్వాలకు ఒక లక్షణం ఉంది. లెఫ్ట్‌ ప్రభుత్వాలు పాలించినచోట ఏమీ మిగలదు.. ఏదీ సరిగా జరగదు’’ అని వ్యాఖ్యానించిన ప్రధాని ‘నథింగ్‌ లెఫ్ట్‌ అండ్‌ నథింగ్‌ రైట్‌’ అనే పదజాలాన్ని వాడారు.

సుస్థిర ప్రభుత్వంతోనే దేశ ప్రయోజనాలు

దేశంలో శక్తిమంతులైన కొందరు వ్యక్తులు తనను అధికారం నుంచి తొలగించేందుకు విదేశీ శక్తులతో చేతులు కలిపారని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన బిజెపి ప్రభుత్వం అవసరమని నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మాట్లాడుతూ పాకిస్థాన్‌ పేరెత్తకుండా ‘‘ఉగ్రవాదులను సరఫరా చేసే మన పొరుగు దేశమొకటి, నిత్యావసరమైన రొట్టెల పిండి కోసం నేడు పాట్లు పడుతోంది’’ అని విమర్శించారు. మన రక్షణరంగాన్ని బలహీనం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి  ఫ్రాన్స్‌ తయారీ రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు రావడం ఇష్టం లేదని మోదీ విమర్శలు గుప్పించారు.