బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తండాల నిర్లక్ష్యం
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్.. రెండూ తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, సరైన నిధులు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఐటీడీఏ నిధుల ద్వారానే నేడు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు. ఫిబ్రవరి 15న బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సేవాలాల్ మహారాజ్ జీవితం బిజెపి సిద్ధాంతాలకు ఎంతో దగ్గరగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని విదేశీ శక్తుల ఆధిపత్యం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో పాటు, ప్రకృతి-పర్యావరణ పరిరక్షణకు ఆయన జీవితాంతం అంకితమయ్యారని తెలిపారు. బంజారా సమాజానికి సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవమని, పర్యావరణాన్ని కాపాడే దేవుడిగా ఆయనను గిరిజన సమాజం భావిస్తుందని అన్నారు. విదేశీ పాలన కాలంలో ఒకవైపు విదేశీయులపై పోరాటం చేస్తూనే, మరోవైపు ప్రకృతి పరిరక్షకుడిగా నిలిచిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. జగదాంబ మాత ఉపాసకుడిగా, భక్తిశ్రద్ధలతో జీవించిన సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా గిరిజన సమాజం సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకుంటోందన్నారు.
గిరిజనుల సంక్షేమానికి సంబంధించి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటు, ప్రత్యేకంగా గిరిజన మంత్రిత్వ శాఖ, గిరిజన సంక్షేమానికి అత్యధిక నిధుల కేటాయింపు.. ఇవన్నీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ములుగులో సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు విస్తరించాయని తెలిపారు. అలాగే మహారాష్ట్రలో సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం చేపట్టడం గిరిజన సంస్కృతికి ఇచ్చిన గౌరవంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజనుల విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలులోకి వచ్చాయని తెలిపారు. గిరిజన సమాజాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే బిజెపి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గిరిజనుల అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారితో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

