హింస నుంచి అభివృద్ధి వైపు బస్తర్ పయనం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల నక్సలైట్లతో (మావోయిస్టులతో) చర్చలకు తావు లేదని, వారు ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానాన్ని అంగీకరిస్తేనే చర్చలుంటాయని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని ఆయన ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ‘ఆర్గనైజర్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వామపక్ష తీవ్రవాదంపై పోరాటం, సమన్వయంతో కూడిన భద్రతా కార్యకలాపాలు, లొంగుబాట్లలో మున్నెన్నడూ లేని పెరుగుదల, బస్తర్ రూపురేఖలు మార్చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:
ప్ర: జగదల్‌పూర్‌లో జరిగిన బస్తర్ దసరా లోకోత్సవ్, స్వదేశీ మేళాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానాన్ని అంగీకరించే వరకు చర్చలకు తావు లేదని తేల్చి చెప్పారు. ఈ అల్టిమేటంను మీరు ఎలా చూస్తున్నారు?
జ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలనే ప్రభుత్వ స్పష్టమైన, దృఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తూ బస్తర్‌తో పాటు ఇతర నక్సల్ ప్రభావిత ప్రాంతాలన్నింటిలో శాంతి భద్రతలను, అభివృద్ధిని పెంపొందిస్తున్నాయి. సందేశం చాలా సరళంగానూ, బలంగానూ ఉంది— ‘వికసిత్ ఛత్తీస్‌గఢ్’ నిర్మాణంలో హింసకు చోటు లేదు. ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలనుకునే వారికి రాష్ట్ర సమగ్ర లొంగుబాటు, పునరావాస విధానం కింద వారి జీవితాలను పునర్నిర్మించుకోవడానికి ప్రతి అవకాశమూ లభిస్తుంది. గత సంవత్సర కాలంలో భద్రతా కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వందల సంఖ్యలో యువత లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి వచ్చారు; అనేక గ్రామాలను నక్సల్స్ రహిత ప్రాంతాలుగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పూర్తిగా రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, జీవనోపాధిపైనే ఉంది. హోం మంత్రి ఇచ్చిన పిలుపు తుది సందేశం. ఉగ్రవాదాన్ని ఓడించడమే కాదు, ప్రతి గిరిజన, నక్సల్ ప్రభావిత కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే శాశ్వత మార్పును సాధించడం ప్రభుత్వ లక్ష్యం.
ప్ర: నక్సలిజాన్ని సమాజంలో ఒక వర్గం ‘అభివృద్ధి కోసం పోరాటం’ అని అభివర్ణిస్తుంది. ఈ వాదనపై మీ అభిప్రాయం?
జ: ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు. నక్సలిజం ఎప్పుడూ అభివృద్ధి కోసం పోరాటం కాదు; నిజానికి, అభివృద్ధికి అది అతిపెద్ద అవరోధంగా ఉంది. దశాబ్దాల పాటు బస్తర్, ఇతర గిరిజన ప్రాంతాల ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాదు, హింస, భయం కారణంగా రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణం నిలిచిపోయింది. ఈరోజు ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్తున్నప్పుడు, ఒకప్పుడు ఆయుధాలు పట్టినవారు కూడా సంఘర్షణ వల్ల కాదు, పురోగతి వల్లనే జీవితాలు మారుతాయని తెలుసుకుంటున్నారు.
ప్ర: మార్చి 2026 నాటికి ఛత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారా?
జ: అవును. మార్చి 2026 గడువులోపు మా లక్ష్యం నెరవేరుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. గట్టి భద్రతా చర్యలను, లక్ష్యంతో కూడిన అభివృద్ధిని కలిపి అమలు చేస్తున్న ప్రభుత్వ సమన్వయ విధానం క్షేత్రస్థాయిలో పరిస్థితిని మార్చేసింది. మా బలగాలు అద్భుతమైన అంకితభావాన్ని ప్రదర్శించాయి. 477 మంది నక్సలైట్లను మట్టుబెట్టడం, 1,731 మందిని పట్టుకోవడం, శాంతి మార్గాన్ని ఎంచుకున్న 1,890 మంది వ్యక్తుల లొంగుబాటుకు సహకరించడం ఇందులో భాగం. మావోయిస్టుల ఉనికి గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు కొన్ని పరిమిత ప్రాంతాలకే పరిమితమైంది. బస్తర్ అంతటా సాధారణ జనజీవనం, పాలన వేళ్లూనుకుంది. ఈ పరివర్తనలో అంతే ముఖ్యమైన మరో అంశం నియాద్ నెల్లా నార్ యోజన. భయం, ఒంటరితనంలో జీవించిన వారికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా దీన్ని రూపొందించాం. భద్రతా శిబిరాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన ఈ పథకాన్ని ఇప్పుడు 10 కిలోమీటర్ల పరిధికి విస్తరిచాం. సుక్మా, బిజాపూర్, నారాయణ్‌పూర్, దంతేవాడ, కాంకేర్ అనే ఐదు నక్సల్స్ ప్రభావిత జిల్లాల 327 గ్రామాలలో ఇది అమలు జరుగుతుంది.
ప్ర: నక్సలైట్ల లొంగుబాటులో భారీ పెరుగుదలను మనం చూస్తున్నాం. అక్టోబర్ 2న ఏకంగా 103 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు, వారిలో 49 మందిపై రూ.1 కోటి కంటే ఎక్కువ రివార్డు ఉంది. ఈ సామూహిక లొంగుబాటు వెనుక ప్రధాన కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు?
ప్ర: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల లొంగుబాట్లు పెరగడానికి ప్రధాన కారణం ఉన్నత స్థాయి మావోయిస్ట్ నాయకులను మట్టుబెట్టడం. ఇది పార్టీ యంత్రాంగాన్ని గణనీయంగా బలహీనపరిచింది. సభ్యుల్లో ప్రతీకార భయాన్ని తగ్గించింది. ఈ మార్పు వాతావరణాన్ని మార్చివేసింది. లొంగుబాటు అవకాశాలు పెంచింది. పరిపాలనపై పెరుగుతున్న నమ్మకం, హింస ఆధిపత్యం వహించిన ప్రాంతాలకు అభివృద్ధి వాస్తవంగా చేరుతుందనే భావన దీనికి ప్రధాన కారణం. గత 20 నెలల్లో ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు, సహాయక చర్యలు, అభివృద్ధితో కూడిన వ్యూహాన్ని అనుసరించింది. ‘ఛత్తీస్‌గఢ్ నక్సలైట్ లొంగుబాటు, బాధితులకు ఉపశమనం, పునరావాస విధానం-2025’ లొంగుబాట్లను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది.
ప్ర: అడవుల్లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకుంటోంది. కానీ ‘పట్టణ నక్సలైట్ల’ (అర్బన్ నక్సల్స్) మాటేమిటి?
జ: నక్సలిజం ముప్పు అటవీ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదని, సాయుధ సభ్యులకు ఆర్థిక, సిద్ధాంతపరమైన మద్దతును అందించే పట్టణ కేంద్రాలకు ‘పట్టణ నక్సల్స్’ రూపంలో విస్తరించిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పట్టణ నెట్‌వర్క్‌లు ఉద్యమాన్ని కొనసాగించడంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య సంస్థలకు, అభివృద్ధికి ఇవి పెద్ద సవాలుగా నిలిచాయి. దీనిని ఎదుర్కోవడానికి, రాష్ట్రం నిఘా వ్యవస్థలను బలోపేతం చేసింది. అనుమానిత పట్టణ నక్సల్ కార్యకలాపాలపై నిఘా పెంచింది. ఇప్పుడు భద్రతా కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ఎదురయ్యే ముప్పులు రెండింటినీ సమన్వయంతో పరిష్కరించేలా రూపొందాయి. ఇందులో భాగంగా ముసుగు సంస్థలు (ఫ్రంట్ సంస్థలు), నిధుల మార్గాలు, హింసకు దోహదపడే ఇతర రకాల మద్దతుపై నిశిత పరిశీలన ఉంటుంది.
ప్ర: నక్సల్స్ నుంచి విముక్తి పొందిన (నక్సల్స్ రహిత) ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తారా?
జ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పథకం అయిన నియాద్ నెల్లా నార్ గిరిజన ప్రాబల్యం గల గ్రామాలకు, ముఖ్యంగా బస్తర్‌లోని భద్రతా శిబిరాల దగ్గర ఉన్నవాటికి, ఆరోగ్య సంరక్షణ, శుభ్రమైన నీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, హెలిప్యాడ్‌లు, కమ్యూనిటీ హాళ్లను అందిస్తుంది. ముఖ్యంగా ‘ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన’ సమూహాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వ పీఎం జన్ మన్ (ప్రధానమంత్రి గిరిజన ఆదివాసీ న్యాయ మహా అభియాన్) శాశ్వత గృహాలు, పైపుల ద్వారా నీరు, గ్రామీణ రోడ్లు, విద్యుదీకరణ, హాస్టళ్లు, వెల్‌నెస్ కేంద్రాలు, వన ధన్ కేంద్రాలు, నైపుణ్య శిక్షణ, సామాజిక మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ప్రత్యేక పీఎంఏవై గృహ నిర్మాణ ప్రాజెక్టు హింసకు గురైన కుటుంబాలకు, లొంగిపోయిన వారికి ఇళ్లను నిర్మిస్తోంది, తద్వారా నమ్మకం, గౌరవం, ప్రధాన స్రవంతిలోకి వారిని తీసుకురావడానికి తానూ కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం వారికీ భరోసా కల్పిస్తుంది.
నాగార్జున

