Sardar Patel

సమైక్య భారత నిర్మాత సర్దార్ పటేల్

Sardar Patelయన లేకుంటే భారతదేశ చిత్రపటం మరోలా ఉండేది. కోడి ఈకలు పీకినట్టున్న దేశం, దాని ఒళ్లంతా గుచ్చుకున్న బాకుల్లా 565 రాజ సంస్థానాలు, జాగీర్లు స్వతంత్రంగా ఉండేవి. ఆయన ప్రయత్నంతోటే ఆ సంస్థానాలన్నీ త్రివర్ణ పతాకం నీడలోకి వచ్చాయి. ముక్కలుముక్కలుగా కాక ఒక్క దేశంగా భారతదేశం అవతరించింది.

కలిస్తే

నిలుస్తాం

నిలిస్తే

గెలుస్తాం

విడిపోతే

పడిపోతాం

పడిపోతే

చెడిపోతాం

అన్న మాటను అక్షరాలా నిజం చేసి అనైక్యత నుంచి సమైక్యతకు భారతీయుల్ని తీసుకెళ్లిన మహనీయుడు ఆయన. ఎవరు అవునన్నా ఎందరు కాదన్నా ఆయనే నిజమైన సర్దార్. ఆయన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్.

సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే భారతీయులకు ‘ఉక్కు మనిషి’గా గుర్తుకొస్తారు. సర్దార్ పటేల్ 1875 అక్టోబర్ 31న జన్మించారు. దేశ స్వాతంత్య్రంలో ఆయనది చిరస్మరణీయమైన పాత్ర. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేందుకు తన లాయర్ వృత్తిని, ఆర్థిక లాభాలను వదులుకుని వచ్చారాయన. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆధునిక భారత నిర్మాతల్లో ఒక అతి విశిష్ట వ్యక్తి. మిగతా నాయకులందరూ పట్టణాల నుంచి, ధనిక కుటుంబం నుంచి వస్తే, ఆయన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అందుకే ఆయనకు రైతుల సమస్యలు బాగా తెలుసు. బార్డోలీ రైతాంగ పోరాటానికి సర్దార్ పటేల్ నాయకత్వమే వెన్నెముక. ఆయన ఖేడా, బోర్సద్ వంటి ప్రాంతాల్లోనూ సఫల రైతాంగ పోరాటాలను నడిపించారు. 1934, 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఆయనదే కీలక పాత్ర. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆయనది తిరుగులేని నాయకపాత్ర.

గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలిసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవివక్షలకు వ్యతిరేకంగా పని చేసారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన దేశానికి తొలి ఉప ప్రధాని గానూ, తొలి హోం మంత్రి గానూ బాధ్యతలు నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధాని కావలసిన వ్యక్తి. 1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష పదవితో పాటు ప్రధాన మంత్రిగా కూడా పనిచేయాలని తీర్మానించారు. గాంధీ 16 రాష్ట్రాల ప్రతినిధులను పిలిచి సరైన వ్యక్తిని ఎన్నుకోమని చెప్పారు. 16లో 13 రాష్ట్రాల ప్రతినిధులు వల్లభాయి పటేల్ పేరును ప్రతిపాదించారు. నెహ్రూకు గాంధీ ఈ విషయం చెప్పి, సర్దార్‌ను ప్రధాన మంత్రిని చేయాలన్న విషయంపై మీ అభిప్రాయం చెప్పండి అనగా, ఆయన తల దించుకొని మౌనంగా ఉన్నారు. నెహ్రూకు ప్రధాని కావాలన్న అలోచన ఉందని అర్థం చేసుకున్న గాంధీ చిన్న కాగితం మీద ఏదో వ్రాసి సర్దార్‌కు ఇవ్వగా ఆయన ప్రధాన మంత్రి పదవికి పోటీ నుంచి తప్పుకొన్నారు. గాంధీ చెప్పిన మాటకు కట్టుబడి తన ప్రధాని పదవిని నెహ్రూకు త్యాగం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన నెహ్రూ ప్రభుత్వంలో తొలి హోం మంత్రిగా విధులను నిర్వర్తించారు.

దేశ విభజన తరువాత ఉత్పన్నమైన భయానక పరిస్థితులు, అరాచక స్థితి, లక్షల సంఖ్యలో వచ్చిన కాందిశీకులు, కుప్పకూలిన శాసన వ్యవస్థ, అనుభవరాహిత్యం వంటి అనేకానేక సమస్యలను ఆయన అధిగమించినతీరు దేశాన్ని నివ్వెరపరిచింది. ఆ సమయంలో ఆయన పగలూ రాత్రి శ్రమించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంత చికాకు పరిచే పరిస్థితులున్నా రాజ్యాంగ నిర్మాణం, మూడేళ్లకే తొలి సార్వత్రిక ఎన్నికలకు ఈ దేశాన్ని సమాయత్త పరచడంలో, యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ఆయన పాత్ర మరచిపోలేనిది. ఆయన రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో చేసిన కృషి నిజంగా చిరస్మరణీయం. బ్రిటిషర్లు పోతూ పోతూ దేశాన్ని హిందుస్థాన్, పాకిస్తాన్‌లుగా విడగొట్టడమే కాదు. దేశం లో ఉన్న 565 రాజసంస్థానాలకు స్వేచ్ఛనిచ్చిపోయారు. అవి కావాలనుకుంటే భారత్‌లో కలవవచ్చు. లేదంటే పాకిస్తాన్‌లో కలవవచ్చు. ఈ రాజసంస్థానాల్లో చిన్నచిన్నవి ఉన్నాయి. కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్, మైసూర్, ట్రాంవెంకోర్ వంటి పెద్ద పెద్ద సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాలన్నిటినీ ఆయన సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి భారతదేశంలో విలీనం చేశారు. కొందరు మహారాజులు స్వచ్ఛందంగా విలీనమైతే, మరి కొందరు బుజ్జగింపులు, బెదిరింపులకు లొంగారు. కొందరు నయాన, కొందరు భయాన లొంగారు. చివరికి గుజరాత్‌లోని జునాగఢ్, దక్షిణాదిన నిజాం నవాబులు విలీనం కావడానికి అంగీకరించలేదు. పైగా స్థానిక హిందువులపై అత్యాచారాలకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో రజాకార్లు విధ్వంసకాండ సృష్టించారు. కనీవినీ ఎరుగని హింసకు పాల్పడ్డారు. ఊళ్లకు ఊళ్లను తుడిచిపెట్టేశారు. మరో వైపు జమ్మూ కాశ్మీర్ మహారాజు విలీనం విషయంలో తర్జనభర్జనపడ్డారు. ఈ పరిస్థితుల్లో సర్దార్ పటేల్ ఉక్కు మనిషిలా వ్యవహరించారు. జునాగఢ్ లో ప్రజా విప్లవాన్ని ప్రోత్సహించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నవాబు తన పెంపుడు కుక్కలు, పిల్లులతో సహా పాకిస్తాన్ పారిపోయాడు. అలా జునాగఢ్ భారత్‌లో విలీనం అయింది. ఇక హైదరాబాద్‌లో నిజాం పైకి భారత సైన్యాలు నలువైపుల నుంచీ దాడి చేశాయి. రజాకార్ మూకలు కకావికలయ్యాయి. నిజాం సేనలు మట్టి కరిచి మోకరిల్లాయి. చివరికి నిజాం నవాబు లొంగిపోయాడు. అలా హైదరాబాద్ సెప్టెంబర్ 17, 1948 న విముక్తం అయింది. సర్దార్ పటేల్ కి నిజాం నవాబు చేతులు జోడించి నమస్కారం చేస్తున్న ఆనాటి దృశ్యాలు ఈనాటికీ ప్రేరణనిస్తూనే ఉన్నాయి. ఒక్క కాశ్మీర్ సమస్యను మాత్రం నెహ్రూ తన నెత్తిన వేసుకున్నారు. సమస్య మానని కురుపుగా మారిపోయింది. ఈ నాటికీ కాశ్మీర్ ఒక తలనొప్పిగానే మిగిలిపోయింది.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పాకిస్తాన్ కంటే ముందే ఆయన లక్షద్వీప్ చేరుకుని భారత పతాకం ఎగురవేసి, లక్ష్వద్వీప్ దీవులను భారత్‌లో విలీనం చేశారు. లేకపోతే లక్షద్వీప్ పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లి సాగర జలాల్లో మనకు పక్కలో బల్లెంలా ఉండేది. ముంబాయి దాడుల వంటి దాడులు చేయడం పాకిస్తాన్ కి మరింత సులువయ్యేది. సర్దార్ పటేల్ స్వతంత్ర భారతదేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు పటిష్టమైన అధికారగణం, పాలనా యంత్రాంగం కావాలని గుర్తించారు. ఉద్యమకారుడిగా పనిచేసిన వారికి పాలకులుగా పనిచేయడం తెలియదు. సర్దార్ పటేల్ ఎంత సమర్థవంతంగా ఉద్యమాలను నిర్వహించారో, అంతే సామర్థ్యంతో పాలన నిర్వహణను కూడా చేశారు. అధికార యంత్రాంగాన్ని పటిష్టపరచడం, వారిని మారిన పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం చేయడం, పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం వంటి పనులను ఆయన దూరదృష్టితో చేశారు. ఒక ఆదర్శ పాలకుడెలా ఉండాలో చూపించారు.

ఈరోజుల్లో దేశం, రాష్ట్రం అనేవి తమ స్వంత జాగీరుల్లాగా, కంపెనీల లాగ చూసుకుంటూ, దానికి తమ తదనంతరం తమ పిల్లల్ని, బంధువుల్ని వారసులుగా తయారు చెయ్యడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్న నాయకులే అడుగడుగునా కనిపిస్తారు. కానీ సర్దార్ పటేల్ అవినీతికి ఆమడ దూరం. ఆయనది నిప్పులాంటి వ్యక్తిత్వం. పటేల్ కు ఒక కుమార్తె – మణిబెన్ పటేల్. ఒక్కడే సుపుత్రుడు దహ్యాభాయ్ పటేల్. సర్దార్ పటేల్ భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి పుత్రుడు బొంబాయిలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. తండ్రి ఎంత నిజాయితీపరుడో కొడుకు అంత అవినీతి పరుడు. తండ్రికి తెలియకుండా ఆయన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడేవాడు. పటేల్ కు ఈ విషయం తెలిసింది. వెంటనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రికి ఒక లేఖ రాసారు. అందులో విషయం చదివితే సర్దార్ పటేల్ నిజాయితీ ఏమిటో, నాయకుడంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ లేఖలో……

“నా కుమారుని పరిశ్రమలతో గానీ, అతని ప్రవర్తనతో గానీ నాకు ఎంతమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా అతని మీద గానీ, అతని పరిశ్రమల విషయంలో గానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైనా మీరేమీ వెనుకాడననక్కరలేదు. మీరే చర్యలు తీసుకున్నా నేనేమీ కలుగజేసుకోను.’’ సర్దార్ వల్లభాయి పటేల్ కుమారుడి అవినీతిని సహించలేక, తన ఏకైక పుత్రుడి మొహం చూడడానికి కూడా ఇష్టపడక చివరి రోజులు తన మిత్రుడి ఇంటిలో గడిపి అక్కడే కన్నుమూసారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే దేశంలో భూ హక్కులను గుర్తించిన మొట్టమొదటి రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలని గట్టిగా ప్రతిపాదించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇలా ఒక స్వాతంత్య్ర సమర యోధుడిగా, దేశభక్తుడిగా, జాతీయ నాయకుడిగా, సమర్థ పాలకుడిగా, దూరదృష్టి కలిగిన నేతగా, భవ్య భారత నిర్మాత గా ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన సేవ మరపురానిది.

కె. రాకా సుధాకర్ రావు