జోరుగా బిజెపి జూబ్లీహిల్స్ ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి దూసుకుపోతుంది. లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టిన బిజెపి గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సహా బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు ప్రచారంలో పాల్గొంటూ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. బిజెపి నాయకుల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ప్రచారానికి వచ్చిన బిజెపి నాయకులను ప్రజలు సాదరంగా స్వాగతిస్తున్నారు. బిజెపి నాయకులు కాంగ్రెస్ పాలనలో సాగుతున్న అవినీతి, అరాచకాలను ప్రజల్లోనే ఎండగడుతున్నారు. అంతకుముందు పదేళ్లు సాగిన బీఆర్ఎస్ దుర్మార్గ పాలనను మరోసారి గుర్తు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన సహకారాన్ని వివరిస్తున్నారు. ఈ పన్నెండేళ్ల కాలంలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందంటూ లెక్కలతో సహా వివరిస్తున్నారు. బిజెపి నాయకుల ప్రచారానికి సానుకూల స్పందన రావడంతో గెలుపుపై నమ్మకం బలపడుతోంది.
బిజెపి అభ్యర్థికి ప్రజల ఆశీర్వాదం
మాజీ సైనికాధికారి తనయుడైన బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో అంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా మార్గదర్శనంలో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దిశానిర్దేశంలో జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తానంటూ ప్రజల వద్దకు వెళ్తున్న దీపక్ రెడ్డికి సర్వత్రా మద్దతు వ్యక్తమవుతోంది. బిజెపి గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలకు తెరతీసింది. మజ్లిస్ పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని రౌడీషీటర్ కుటుంబానికి చెందిన నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా దింపింది. ఈ నవీన్ యాదవ్ 2023 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి. కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం నాయకులు, ముఖ్యంగా ఓవైసీ సోదరులు అధికార చలాయిస్తారన్న భయం ప్రజల్లో నెలకొంది. దీనికి 6 గ్యారెంటీల వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, హైడ్రా పేరిట సాగిస్తున్న అరాచకాలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ సానుభూతి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెటిచ్చింది. అధికార కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతకు, సానుభూతి తోడై గెలుస్తామని బీఆర్ఎస్ ఆశపడుతోంది కానీ, ప్రజలు మాత్రం కారు గుర్తుపై ఓటేసేది లేదని చెప్తున్నారు. 2024లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని బీఆర్ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. ప్రజలు చైతన్యవంతులయ్యారు, సానుభూతికి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. 2020 దుబ్బాక ఉపఎన్నికల్లో ఇది రుజువైంది. అప్పుడు బిజెపి గెలిచింది, ఇప్పుడు కూడా బిజెపి గెలుస్తుందన్న సెంటిమెంట్ బలపడుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిజెపి-కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీగా ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలో ప్రజలు బిజెపి వైపే మొగ్గుచూపుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. రౌడీషీటర్ కుటుంబానికి చెందిన నవీన్ యాదవ్‌ను ఓడించి నీతినిజాయితీలకు నిబద్ధుడైన దీపక్ రెడ్డిని గెలిపించుకుంటామని జూబ్లీహిల్స్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
ఘనంగా నామినేషన్
అక్టోబర్ 21న లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి హైలంకాలనీలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నామినేషన్ ర్యాలీకి ఘనంగా ఆరంభమైంది. డప్పు చప్పుళ్లు, ఆటపాటలతో ఈ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఈ ర్యాలీ కృష్ణానగర్, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, యూసుఫ్ గూడ బస్తీ మీదుగా షేక్ పేట ఎమ్మార్వో కార్యాలయం వరకు కొనసాగింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపక్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. “జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధికి ఓటు వేయబోతున్నారు. దీపక్ రెడ్డి విజయం తథ్యం’’ అని రాంచందర్ రావు, జి. కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలమయ్యాయి
ప్రచారంలో భాగంగా వివిధ సందర్భాల్లో రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘నగరంలోని కాలనీల్లో డ్రైనేజ్ వాసనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ప్రతి రోజు మురుగు నీటి సమస్యలతో బాధపడుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ప్రత్యక్ష ఉదాహరణ. డ్రైనేజ్ వాసన చిన్న సమస్య కాదు, నగర అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. మంచి మంచి కాలనీల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, పేదలు, సామాన్యుల స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చినా, వాటి అమలుపై పురోగతి లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గతంలో ఏ ప్రభుత్వమూ అభివృద్ధి, పథకాల అమలులో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ వాగ్దానాలుఅబద్ధాల మీద ఆధారపడినవి. “6 గ్యారెంటీలు” పేరిట 421 వాగ్దానాలు చేసి, మళ్ళీ ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పార్టీకి ప్రజలు పెట్టే సరైన బిరుదు “420 పార్టీ”. రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి తప్ప మిగతా పార్టీలు అబద్ధాల ప్రచారం, తప్పుడు హామీలతోనే పోటీ పడుతున్నాయి. నిజమైన అభివృద్ధి, ప్రజల నమ్మకానికి, పారదర్శక పాలనకు బిజెపియే ప్రత్యామ్నాయం. హైదరాబాద్ నగర అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పురోగతి, శాంతి స్థిరత్వం కోసం బిజెపి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు.

