కర్మయోగి పటేల్
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తన ఆలోచనలను సాకారం చేయడానికి నిబద్ధతతో పనిచేసిన ‘కర్మ యోగి’. సర్దార్ పటేల్ తన జీవితమంతా భారతదేశ స్వాతంత్య్రం కోసం, సమైక్య భారతదేశాన్ని నిర్మించడానికి, నవ భారతదేశానికి పునాది వేయడానికి అంకితం చేశారు. సర్దార్ పటేల్ వారసత్వాన్ని కాంగ్రెస్ చాలా కాలం విస్మరించింది. ఆయనను భారతరత్నతో సత్కరించడానికి, సర్దార్ పటేల్ స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ఆయన ఆలోచనలను అమలు చేయడం ద్వారా నవతరానికి స్ఫూర్తి కలిగించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సర్దార్ పటేల్ తన రచనల ద్వారా అజరామరుడు, అచంచలమైనవాడు. సర్దార్ సాహెబ్ దార్శనికత, వాస్తవికత కలగలిసిన వ్యక్తి. సర్దార్ పటేల్ ఆలోచనలు 19వ శతాబ్దంలో నాటివైనా అవి నేటికీ వర్తిస్తాయి. 3 లక్షలకు పైగా గ్రామాలకు చెందిన కోట్లమంది రైతుల వ్యవసాయ పనిముట్ల ఇనుమును కరిగించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయించారు ప్రధానమంత్రి మోదీ. దేశం మొత్తం కలలు ఈ విగ్రహంలో ప్రతిబింబిస్తాయి.
సర్దార్ పటేల్ క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాథమిక సిద్ధాంతాన్ని అనుసరించేవారు. ఆయన దేశంలో సహకార ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. సర్దార్ అమూల్ విత్తనాలను నాటారని, పటేల్ ఆలోచనలు, మార్గదర్శకత్వం, ప్రేరణతో త్రిభువన్‌దాస్ పటేల్ జీ అమూల్‌ను స్థాపించారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1920 నుంచి 1930 మధ్య కాలంలో దేశంలో రైతులపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పిన పటేల్ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని చూసి గాంధీజీ వల్లభాయ్‌కి ‘సర్దార్’ అని పేరు పెట్టారు. సర్దార్ పటేల్ కృషి వల్లే లక్షద్వీప్, అండమాన్- నికోబార్, జోధ్‌పూర్, జునాగఢ్, హైదరాబాద్ ఈ రోజు భారతదేశంలో భాగమై ఉన్నాయి. భారతమాతకు పట్టం కట్టిన సర్దార్ పటేల్ వల్లనే కాశ్మీర్ కూడా నేడు భారత్‌తో కలిసి ఉంది.
కాశ్మీర్‌లో చొరబడిన పాకిస్తాన్ దుండగులను మట్టికరిపించి, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చేయడానికే సర్దార్ పటేల్ సైన్యాన్ని జమ్మూ-కశ్మీర్‌కు పంపాలని నిర్ణయించుకున్నారు. సర్దార్ పటేల్ లేకుంటే భారతదేశ పటం ఈనాటిలా ఉండేది కాదు. స్వాతంత్ర్యం తరువాత సర్దార్ పటేల్ భారతదేశం నలుమూలల నుండి 500 కంటే ఎక్కువ సంస్థానాలు రాజులు- యువరాజులను సమీకరించటానికి శ్రమించారు. సర్దార్ పటేల్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ 500పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో కలపడానికి దేశవ్యాప్తంగా పర్యటించారు. స్వాతంత్య్రం తరువాత భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్విరామ కృషితోనే భారతదేశం ఏకమైంది.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు బ్రిటీష్ వారు భారత్‌ను వదిలివెళ్లిన వెంటనే భారతదేశం చిన్నాభిన్నం అవుతుందని, భారతీయ నాయకులకు సామర్థ్యం తక్కువ కాబట్టి వారు అధికారం కోసం కలహించుకుంటారని బ్రిటిష్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అన్నారు. కానీ సర్దార్ పటేల్ మొత్తం దేశాన్ని ఏకం చేశారు. నేడు భారతదేశం అదే బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం 75 సంవత్సరాలలో లోతుగా వేళ్లూనుకుంది. దాని ఫలితంగా, స్వాతంత్య్రం తర్వాత ప్రజలు శాంతియుతంగా ఓటు ద్వారా ఇచ్చిన తీర్పులను అందరూ ఆమోదించారు. దేశంలో ఎటువంటి రక్తపాతం లేకుండా నాయకత్వం చాలాసార్లు మారిపోయింది.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సంస్థానాలను ఏకం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. అలాగే అఖిల భారత సర్వీసులకు, గూఢచార విభాగానికి పునాది వేశారు. కేంద్ర పోలీస్ బలగాల అవసరాన్ని గుర్తించారు. భారతీయతత్వానికి అనుగుణంగా పరిపాలనా సేవలను రూపొందించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కృషి ఫలితంగానే భారతదేశంలో కేంద్ర-రాష్ట్ర వ్యవస్థ ఏ విధమైన ఘర్షణలు లేని విధంగా రూపొందింది. దాని ఫలితంగా నేడు కేంద్రం-రాష్ట్రాల మధ్య వైరుధ్యం లేదు. సర్దార్ పటేల్ అహింసా ధోరణి కూడా చాలా వాస్తవమైంది. ఆయన వ్యక్తిగత కీర్తి కోసం పాకులాడకుండా ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనడం ద్వారా ఫలితాలను తీసుకురావడానికి పనిచేశారు. ఒకవైపు జాతికి మహాత్మా గాంధీ ఆదర్శవంతమైన, ఆధ్యాత్మిక నాయకత్వం లభిస్తే, మరోవైపు సర్దార్ పటేల్ వంటి ఆచరణాత్మక, దూరదృష్టి, వాస్తవిక దృక్పథంగల నాయకుడి మద్దతు లభించింది. ఈ ఇద్దరి కలయిక భారతదేశానికి ఉపయోగపడింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో సర్దార్ పటేల్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాబాసాహెబ్ డా. బీ.ఆర్.అంబేద్కర్‌కు రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతను అప్పగించాలని ఆయనే సూచించారు. రాజ్యాంగం సమతుల్యంగా ఉండేలా సర్దార్ పటేల్ తన ఆలోచనలను అనేకసార్లు రాజ్యాంగ సభ ముందు ఉంచారు. దీని గురించి మరింత తెలుసుకోవడానికి, రాజ్యాంగం ఆత్మను అర్థం చేసుకోవడానికి సర్దార్ పటేల్, కే.ఎం. మున్షీ, బాబాసాహెబ్ అంబేద్కర్‌ల మధ్య రాజ్యాంగ సభలో జరిగిన చర్చలను చదవాలి. స్వాతంత్ర్యానంతరం 75 ఏళ్లు చాలా కష్టతరమైనవి. దేశం కొన్నిసార్లు యుద్ధాన్ని, కొన్నిసార్లు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆర్థిక సమస్యలను కూడా తట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమ్మిళిత, సర్వతోముఖాభివృద్ధి ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యం పునాది మరింత బలోపేతం అయింది. ఆయన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం దేశానికి మార్గనిర్దేశం చేశారు. దేశ భద్రతను కాపాడారు. దీని కారణంగా ప్రపంచంలో ఎవరూ భారతదేశ సైన్యాన్ని ఎదిరించే, సరిహద్దును అతిక్రమించే ధైర్యం చేయలేరు.
సర్దార్ పటేల్‌ను మరుగున పడవేయడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ సర్దార్ ఇప్పటికీ దేశంలోని ప్రతి వ్యక్తి మనస్సులో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆచరణాత్మక నాయకుడు. భారత్ కన్న బిడ్డ. భారతీయ సంస్కృతికి ప్రతీక. కీర్తి సంపాదించాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఉక్కు మనిషి ‘సర్దార్ పటేల్’. స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అత్యధిక ఓట్లు తెచ్చుకున్న తర్వాత కూడా దేశ ప్రధానమంత్రి పదవిని వదులుకున్నాడు. తద్వారా ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం వివాదాలకు దూరంగా ఉంది.
అమిత్ షా,
కేంద్ర హోం మంత్రి

