Bullet Train

హైదరాబాద్‌ కేంద్రంగా హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌

హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్లలో మూడు ఇక్కడి నుంచే ప్రారంభం కానుండటం విశేషం. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె నగరాలకు ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇవి కార్యరూపం దాల్చితే రవాణా ఆధారిత అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయం. 

హైస్పీడ్‌ కారిడార్‌ రైలు ప్రాజెక్టులను 350 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా డిజైన్‌ చేస్తున్నారు. ఇందులో రైళ్ల ఆపరేషనల్‌ స్పీడ్‌ను గంటకు 320 కి.మీ.గా నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు రైల్లో చేరుకునేందుకు 12-15 గంటల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో వెళ్లవచ్చు. పుణెకు 1.55 గంటల్లో, చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చు. హైస్పీడ్‌ కారిడార్‌ పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టు. ప్రస్తుత రైల్వే లైన్లతో సంబంధం లేకుండా కేవలం వీటి కోసమే కొత్తగా నిర్మిస్తారు. పశువులు, అటవీ జంతువులు అడ్డు రాకుండా ఫెన్సింగ్‌ వంటి రక్షణ ఏర్పాట్లు చేస్తారు. 

హైదరాబాద్‌-ముంబయి హైస్పీడ్‌ కారిడార్‌కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను ఇప్పటికే రైల్వేబోర్డుకు సమర్పించారు. అయితే తాజా కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌-పుణె, పుణె-ముంబయి పేరిట రెండు హైస్పీడ్‌ కారిడార్లుగా విభజించింది. ముంబయి-పుణె మధ్య ఘాట్‌ ప్రాంతం ఉండటంతో ప్రత్యేక ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌-చెన్నై ఎలైన్‌మెంట్‌ను రైల్వేశాఖ శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం నుంచి ఏపీలో అమరావతి మీదుగా ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫ్యూచర్‌సిటీ, మిర్యాలగూడ ప్రాంతం నుంచి అమరావతి వైపు ప్రతిపాదించింది. వీటిపై స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేబోర్డుకు డీపీఆర్‌ సమర్పించేందుకు నెలాఖరు వరకు సమయం ఉంది. హైదరాబాద్‌-బెంగళూరు మార్గంలో శంషాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్‌ మీదుగా రైల్వేశాఖ ప్రతిపాదించింది. మన్ననూరు, శ్రీశైలం మార్గంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినప్పటికీ ఈ మధ్యలో పెద్ద పట్టణాలు, నగరాలు లేకపోవడంతోపాటు టైగర్‌రిజర్వు ఉండటంతో మహబూబ్‌నగర్‌ మీదుగా ఎలైన్‌మెంట్‌ ఖరారుకానున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించేందుకూ మార్చి నెలాఖరు వరకు సమయం ఉంది. హైస్పీడ్‌ కారిడార్‌తో తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య ఆర్థిక, వైద్య పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. 

ఏడు హైస్పీడ్‌ కారిడార్లతో పాటు సరకు రవాణాకు ఒక ప్రత్యేక కారిడార్‌ నిర్మించడానికి బడ్జెట్లో కేటాయింపులు చూపించారు. రైలుమార్గాల నిర్మాణం, ఇంజిన్లు/ వ్యాగన్లు/ కోచ్‌ల కొనుగోలు సహా మొత్తంగా రూ.2,77,830 కోట్లను రైల్వేకు మూలధన వ్యయం కింద కేటాయించాలని ప్రతిపాదించారు. రైల్వేకు కేటాయింపుల్లో ఇదే అత్యధికం. మొత్తంగా రైల్వే ఆదాయం రూ.3,85,733 కోట్లు, వ్యయం రూ.3,82,186 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అదనంగా బడ్జెటేతర నిధులుగా రూ.15,000 కోట్లు అందనున్నాయి. మొత్తంగా రూ.3,547 కోట్ల మిగులు సాధించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌తో పోలిస్తే కొత్త కేటాయింపులు 10.25% ఎక్కువ. తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనులకు రూ.5,454 కోట్లు కేటాయించారు. రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్‌ వ్యవస్థ విస్తరణకు ప్రాధాన్యం లభించనుంది.