‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’పై మోదీ దీపావళి వేడుకలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత త్రివిధ దళాలు అద్భుతమైన సమన్వయంతో పనిచేసి, అతి తక్కువ సమయంలోనే పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన సైన్యం పాకిస్తాన్‌ను భయకంపితులను చేసిందన్నారు. వాయుసేన నైపుణ్యాలు, నావికాదళం ధైర్యసాహసాలు పొరుగు దేశానికి చుక్కలు చూపించాయని తెలిపారు. ఏటా సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకొంటున్న ప్రధాని మోదీ ఈ ఏడాది అదే ఆనవాయితీ కొనసాగిస్తూ గోవా తీరంలో స్వదేశీ యుద్ధ విమాన వాహకనౌక ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’పై నావికాదళంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 19 సాయంత్రమే గోవా చేరుకున్న మోదీ రాత్రంతా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లోనే ఉన్నారు. అక్టోబర్ 20న దీపావళి రోజు ఉదయం యోగా చేశారు. నావికా దళం జవాన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. నేవీ అధికారులు, సిబ్బంది దేశభక్తి గీతాలు ఆలపించారు. ఆపరేషన్ సిందూర్‌లో సైనిక దళాల విజయానికి గుర్తుగా ప్రత్యేకంగా రాసిన పాటను సైతం వారు ఆలపించారు. నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ మిఠాయిలు తినిపించారు. విందు భోజనం చేశారు. పగటిపూట, రాత్రిపూట ఐఎంఐ–27 యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను స్వయంగా తిలకించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత నావికాదళం వలస వారసత్వాన్ని విడిచి, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో కొత్త జెండాను స్వీకరించిందని గుర్తు చేశారు. స్వదేశీ రక్షణరంగ సాంకేతికతపై సంతోషం వ్యక్తం చేస్తూ, గత 11 ఏళ్లలో రక్షణ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధ నౌక లేదా జలాంతర్గామి నౌకాదళంలో చేరుతోందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో స్థానిక క్షిపణులు సమర్థత చాటుకున్నాయని చెప్పారు. భారత్ ప్రపంచంలో అగ్ర రక్షణ ఎగుమతిదారుల్లో ఒకటిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ‘‘ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు — ఇది 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతకు నిదర్శనం. ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా సిద్ధాంతాల ప్రతీకగా విక్రాంత్ నిలుస్తోంది. గత దశాబ్దంలో భారత సాయుధ దళాలు స్వయం సమృద్ధి దిశగా వేగంగా పురోగమించాయి. ప్రస్తుతం వేలాది పరికరాలు దేశీయంగా ఉత్పత్తి అవుతున్నాయి. రక్షణ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి రూ. 1.5 లక్షల కోట్లకు చేరింది, రక్షణ ఎగుమతులు 30 రెట్లు వేగవంతమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్, ఆకాశ్ వంటి దేశీయ క్షిపణులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. భారత నౌకాదళం ప్రపంచ సుస్థిరతలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 66 శాతం, కార్గో రవాణాలో 50 శాతం హిందూ మహాసముద్రం మీదుగా సాగుతున్న ఈ ప్రాంతానికి భారత నౌకాదళం భద్రత కల్పిస్తోంది. భారత్ ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయం అందిస్తోంది — మాల్దీవులు, శ్రీలంక, ఇండోనేషియా, మయన్మార్, మొజాంబిక్, మడగాస్కర్ వంటి దేశాల్లో సహాయక చర్యలు చేపట్టింది. దేశ భద్రతా బలగాల ధీరత్వం, త్యాగం వల్ల వామపక్ష తీవ్రవాదం దాదాపుగా అంతరించిపోయింది. తీవ్రవాద ప్రభావిత జిల్లాలు 125 నుండి 11కి తగ్గాయి. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది, 140 కోట్ల ప్రజల కలలను నెరవేర్చుతోంది. సాయుధ దళాలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.’’ అని ప్రధానమంత్రి అన్నారు.

