Modi ji

జిన్నాకు తలొగ్గి ‘వందేమాతరం’కు నెహ్రూ ద్రోహం

Modi jiముస్లింలీగ్‌ నేత మహ్మదాలీ జిన్నాకు తలొగ్గి.. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వందేమాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. దానిని ఛిన్నాభిన్నం చేసి.. భారత్‌ను బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని ఆక్షేపించారు. బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ గేయాన్ని రాసి 150 ఏళ్లయిన సందర్భంగా డిసెంబర్ 8న లోక్‌సభలో ప్రధాని ప్రత్యేక చర్చను ప్రారంభించారు. ఈ చర్చలో ప్రధాని ప్రసంగిస్తూ 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంతో బ్రిటిష్‌ సామ్రాజ్యం గడగడలాడిందని.. ఆ తర్వాత వందేమాతర గేయం దానిని సవాల్‌ చేసిందని.. స్వాతంత్య్ర పోరాటాన్ని ఉర్రూతలూగించి.. స్వాతంత్య్ర సాధన దిశగా జాతీయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని.. దీనివల్లే దీనిని భారత జాతీయ గీతంగా చేయాలని మహాత్మాగాంధీ అభిలషించారని ఆయన చెప్పారు. గాంధీజీ మనోభావాలను తోసిరాజని.. ఈ గేయాన్ని వివాదంలోకి నెట్టి ఎందుకు ద్రోహం చేశారో తనకు అర్థం కాలేదన్నారు. ‘ముస్లిం లీగ్‌ నాయకుడు మహ్మదాలీ జిన్నా లఖ్‌నవూలో 1937 అక్టోబరు 15న వందేమాతరంపై తన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఐదు రోజులకే నెహ్రూ నేతాజీకి లేఖ రాశారు. బంకించంద్ర ఛటర్జీ ‘ఆనందమఠ్‌’ నవల కోసం ఈ గేయాన్ని రాశారని.. ఈ నేపథ్యం ముస్లింలను ఇబ్బందిపెట్టే అవకాశముందని అందులో పేర్కొన్నారు. బంకించంద్ర స్వరాష్ట్రమైన బెంగాల్లోనే.. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం వందేమాతరంపై సమీక్ష జరిపింది. అక్టోబరు 26న సామాజిక సామరస్యం ముసుగులో.. గేయాన్ని రెండు చరణాలకు కుదించాలని నిర్ణయించింది. దీంతో యావద్దేశం దిగ్ర్భాంతికి గురైంది. కాంగ్రెస్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశభక్తులు నిరసనలు చేపట్టారు. ముస్లింలీగ్‌కు కాంగ్రెస్‌ మోకరిల్లి బుజ్జగింపు రాజకీయాలకు దిగిందనడానికి చరిత్ర తార్కాణంగా నిలిచింది. సదరు రాజకీయాల ఒత్తిడితోనే వందేమాతరంతోపాటు దేశవిభజనకూ తలొగ్గింది’ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల వైఖరి ఇప్పటికీ మారలేదని.. బుజ్జగింపు రాజకీయాలు కొనసాగిస్తూ.. వందేమాతరంపై వివాదాలు సృష్టించే యత్నాలు చేస్తూనే ఉన్నాయన్నారు.

”బ్రిటిష్‌వాళ్లు ఎంతగా అణగతొక్కాలని చూసినా, బెంగాల్‌ను విభజించినా, వందేమాతరం ఒక శిలలా నిలిచి దేశమంతటా ఐక్యతాస్ఫూర్తి రగిలించింది. అది ఎంతో ప్రాచుర్యం పొంది జాతీయ గీతంలా అవతరించిందని సాక్షాత్తూ మహాత్మా గాంధీయే పేర్కొన్నారు. అయినా ఆ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో ఆశ్చర్యం కలిగిస్తోంది. గత శతాబ్దంలో దానికి ఎందుకు వెన్నుపోటు పొడిచారు? గాంధీ ఆకాంక్షల్ని తుంగలో తొక్కిన శక్తి ఎవరు? వందేమాతరానికి వందేళ్లు పూర్తయినప్పుడు దేశానికి ఎమర్జెన్సీ అనే సంకెళ్లు వేశారు. వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించుకునే అవకాశం మనకు ఇప్పుడు వచ్చింది. ఈ గేయం మనందరికీ గర్వకారణం. చారిత్రక ఘట్టానికి మనం సాక్షులం” అని మోదీ పేర్కొన్నారు. 

వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం అనేక మైలురాళ్లను దాటిందన్నారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తిచేసుకునే నాటికి దేశం ఇంకా వలస పాలనలోనే ఉండిపోయిందన్న మోదీ.. ఆ గేయానికి వందేళ్లు పూర్తయ్యే నాటికి ఎమర్జెన్సీ సంకెళ్లతో దేశంలో నిర్బంధం నెలకొన్నదని గుర్తుచేశారు. వందేమాతర శతాబ్ది ఉత్సవాల వేళ నాటి పాలకులు భారత రాజ్యాంగం గొంతు నొక్కారన్నారు. వందేమాతరానికి వందేళ్లు పూర్తయిన వేళ.. దేశం కోసమే జీవితాన్ని అంకితం చేసిన వారిని నాటి పాలకులు జైల్లో పెట్టారన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నిచ్చిన ఆ గేయానికి వందేళ్లు పూర్తయిన సమయంలోనే.. దురదృష్టవశాత్తు దేశంలో ఓ చీకటి అధ్యాయం మొదలైందని, ప్రజాస్వామ్యం ఒడుదుడుకులకు లోనైందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్యోద్యమ నాయకులకు లక్ష్యాన్ని నిర్దేశించి ముందుకు నడిపిన ‘వందేమాతరం’ రుణాన్ని తీర్చుకునేందుకు ఈ చర్చలో పాల్గొనేవారందరికీ ఇది సరైన సమయమని వ్యాఖ్యానించారు. దాని ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించి, అందరికీ ఇప్పుడు సభలో భాగస్వాములయ్యే అవకాశం లభించిందన్నారు. ఇది పార్లమెంటు సభ్యులు, ప్రతినిధులందరూ వందేమాతరానికి రుణపడి ఉన్నామని అంగీకరించాల్సిన పవిత్ర సందర్భమన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమాలను ఏకం చేసి దేశం మొత్తం ఒకే గొంతుకగా స్వతంత్రం కోసం పోరాడే స్ఫూర్తిని వందేమాతరం ఇచ్చిందని, మరోసారి ఆ స్ఫూర్తి మనకు మార్గనిర్దేశం చేయాలని మోదీ వ్యాఖ్యానించారు. స్వావలంబనతో కూడిన దేశ నిర్మాణంతోపాటు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించేందుకు ఇది మంచి అవకాశమని ఆయన స్పష్టం చేశారు.

1875లో బంకించంద్ర చటర్జీ వందేమాతర ప్రస్థానాన్ని ప్రారంభించారని మోదీ అన్నారు. 1857 స్వాతంత్ర్య పోరాటానంతరం.. బ్రిటిష్ సామ్రాజ్యం అస్థిరంగా ఉండి, తీవ్ర ఒత్తిళ్లతో భారత్‌ను వంచనకు గురిచేస్తూ భారతీయులను బలవంతంగా లొంగదీసుకోవాలని చూస్తున్న సమయంలో ఈ గేయాన్ని రచించారని ఆయన వివరించారు. ఆ సమయంలో బ్రిటిష్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ది క్వీన్’ను దేశంలోని ప్రతి ఇంటికీ వ్యాప్తి చేసేలా కుట్ర పన్నారని ప్రధానమంత్రి చెప్పారు. అప్పుడే బంకిం దా ధీటుగా ప్రతిస్పందించారని మోదీ అన్నారు. ఆ ధిక్కరణ నుంచే ‘వందేమాతరం’ పుట్టిందని తెలిపారు. కొన్నేళ్ల తర్వాత 1882లో బంకించంద్ర ‘ఆనంద మఠ్’ గ్రంథాన్ని రాసే సమయంలో ఈ గేయాన్ని అందులో చేర్చారని తెలిపారు.

వేల ఏళ్లుగా భారతదేశ నరనరాల్లో వేళ్లూనుకున్న భావాలను వందేమాతరం పునరుజ్జీవింపజేసిందన్న ప్రధానమంత్రి.. అదే భావోద్వేగం, అవే విలువలు, అదే సంస్కృతి, అదే సంప్రదాయాన్ని అద్భుతమైన పదాలతో, ఉన్నతమైన స్ఫూర్తితో వందేమాతరం ద్వారా దేశానికి రచయిత బహూకరించారని కొనియాడారు. వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛనో, లేదా బ్రిటిష్ వారిని తరిమేసి సొంత బాట వేసుకునే మంత్రమో మాత్రమే కాదని, వాటికి అతీతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని మోదీ అన్నారు. వందేమాతర నేపథ్యాన్ని, దాని విలువల స్రవంతిని మనం పరిశీలిస్తే.. వేదకాలం నుంచి పరంపరగా వస్తున్న సత్యం మనకు సాక్షాత్కరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరం అని మనం నినదించిన వేళ.. ‘ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడిని’ అన్న వేద ప్రకటన మనకు స్ఫురిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

లంకా వైభవాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని పలికిన శ్రీరామచంద్రుడి మాటల్లోనూ ఇదే భావన ప్రతిధ్వనించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ గొప్ప సంస్కృతీ సంప్రదాయానికి ‘వందేమాతరం’ ఆధునిక ప్రతిరూపమని వివరించారు. జనసామాన్యంలో వందేమాతరానికి ఉన్న విశేష ఆదరణ సుదీర్ఘ స్వాతంత్ర్యోద్యమ గాథగా వెల్లడైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోని ప్రతి దశా వందేమాతరం స్ఫూర్తితో ముందుకు సాగిందని, దాని లక్ష్యాలు ఆ భావనను పెంపొందించాయని మోదీ చెప్పారు. మొత్తం స్వతంత్ర ప్రస్థానమూ వందేమాతర ఉద్వేగాలతో ముడిపడి ఉన్న ఇలాంటి కవితాత్మక వ్యక్తీకరణ.. బహుశా ప్రపంచంలో మరెక్కడా కనిపించకపోవచ్చని వ్యాఖ్యానించారు.

భారతదేశాన్ని విభజించకపోతే, ప్రజలు తమలో తాము కలహించుకునేలా చేయకపోతే, ఇక్కడ పాలించడం అసాధ్యమని బ్రిటిష్  వారు భావించారన్నారు. బెంగాల్ విభజన జరిగితే దేశం కూడా విచ్ఛిన్నమవుతుందని, తమ పాలనను కొనసాగించుకోవచ్చని విశ్వసించారనీ.. అందుకే వారు మొదట బెంగాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని ప్రధానమంత్రి చెప్పారు. 1905లో బ్రిటిష్ వారు బెంగాల్‌ను విభజించే దుస్సాహసానికి పాల్పడిన వేళ.. వందేమాతరమే అడ్డుగోడలా నిలిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు. బెంగాల్ ఐక్యత కోసం వందేమాతరం ప్రతి వీధిలో ప్రతిధ్వనించిందని, ప్రజలను ఉత్తేజపరిచే నినాదంగా మారిందని అన్నారు. బెంగాల్ విభజనతో బ్రిటిష్ వారు భారత్‌ను బలహీనపరిచేందుకు విభజన బీజాలను నాటేందుకు ప్రయత్నించారని ప్రధానమంత్రి చెప్పారు. కానీ, వందేమాతర నినాదం ఒకే గొంతుకగా, ఐక్యతా సూత్రంగా మారి.. బ్రిటిష్ వారిని సవాలు చేసిందనీ, దేశ శక్తికి పునాదిగా నిలిచిందని వివరించారు. 

బెంగాల్ విభజన జరిగినప్పటికీ.. అదొక భారీ స్వదేశీ ఉద్యమానికి దారితీసిందని, ఆ సమయంలో వందేమాతరం ప్రతిచోటా ప్రతిధ్వనించిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ సృష్టించిన ఆ భావోద్వేగాల శక్తిని బ్రిటీష్ వారు గ్రహించారని చెప్పారు. ఆయన పాట బ్రిటిష్ వారి పునాదులను కదిలించడంతో వందేమాతరంపై చట్టపరమైన నిషేధాలు విధించేలా చేసిందని అన్నారు. వందేమాతరం ఆలపిస్తే శిక్ష, ముద్రించినా శిక్ష, ఆ మాట పలికినా కూడా కఠిన చట్టాల ప్రకారం శిక్ష విధించారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. వందేమాతరం పాడినందుకు అత్యంత దారుణాలు జరిగిన బారిసాల్ ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. వందేమాతరం గౌరవాన్ని కాపాడటానికి బారిసాల్‌లో తల్లులు, సోదరీలు, పిల్లలు ముందుకు వచ్చారని చెప్పారు. ధైర్యవంతురాలైన సరోజిని ఘోష్ గురించి మోదీ ప్రస్తావించారు. వందేమాతరంపై నిషేధం ఎత్తివేసే వరకు ఆమె తన గాజులు తీసివేసి, మళ్లీ ధరించనని  ప్రకటించారని, ఆ కాలంలో ఆ ప్రతిజ్ఞకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు కూడా వెనుకబడలేదని, చిన్న వయస్సులోనే కొరడా దెబ్బలు తిని, జైలు పాలైనప్పటికీ, బ్రిటీష్ వారిని ధిక్కరించి ఉదయం ఊరేగింపుల్లో వందేమాతరం జపిస్తూ కవాతు కొనసాగించారని తెలిపారు.

1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ సవాళ్లు, ప్రాధాన్యతలు మారినప్పటికీ.. దేశ స్ఫూర్తి, జీవశక్తి మాత్రం అలాగే స్పూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. భారత్‌ సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడల్లా, వందే తరం స్ఫూర్తితో ముందుకు సాగిందని ప్రధానమంత్రి అన్నారు. నేటికీ ఆగస్టు 15, జనవరి 26 వంటి సందర్భాల్లో ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతున్నప్పుడు ఆ భావన ప్రతి చోటా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఆహార సంక్షోభం సమయంలో దేశ ప్రజల ఆకలిని తీర్చేందుకు  రైతులకు వందేమాతరం స్ఫూర్తినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యాన్ని అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు, రాజ్యాంగాన్ని చీల్చి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దేశం మళ్లీ పైకి లేచి అధిగమించడానికి దోహదపడేలా చేసింది వందేమాతరం బలమేనని అన్నారు. దేశంపై యుద్ధాలు జరిగినప్పుడు, పోరాటాలు తలెత్తినప్పుడు, సరిహద్దుల్లో సైనికులు దృఢంగా నిలబడేలా చేసింది, భారతమాత జెండా విజయంతో రెపరెపలాడేలా చేసింది వందేమాతరం స్ఫూర్తేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ 19 వంటి ప్రపంచ సంక్షోభ సమయంలో కూడా దేశం అదే స్ఫూర్తితో నిలబడి, సవాలును ఓడించి, ముందుకు సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే దేశ బలం,  దేశాన్ని భావోద్వేగాలతో అనుసంధానించే శక్తిమంతమైన శక్తి ప్రవాహం, చైతన్య స్రవంతి, పురోగతిని ముందుకు నడిపించే చెక్కుచెదరని సాంస్కృతిక ప్రవాహానికి ప్రతిబింబమని ప్రధామంత్రి వ్యాఖ్యానించారు. మనల్ని ఇక్కడికి తీసుకువచ్చిన మార్గాన్ని సృష్టించిన వందేమాతరానికి దేశం రుణపడి ఉందని, కాబట్టి దానిని గౌరవించడం మన కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి సవాలును అధిగమించే సామర్థ్యం భారత్‌కు ఉందని, వందేమాతరం స్ఫూర్తి ఆ బలాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. 

ఇది కేవలం ఒక పాట లేదా శ్లోకం మాత్రమే కాదని, దేశం పట్ల మన కర్తవ్యాల వైపు మనల్ని మేల్కొల్పే ప్రేరణకు మూలమని, దానిని నిరంతరం కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కలను మనం సాధించాలనుకున్నప్పుడు వందేమాతరం మన స్పూర్తిగా నిలుస్తుందన్నారు. కాలాలు, రూపాలు మారవచ్చు, కానీ మహాత్మా గాంధీ వ్యక్తం చేసిన భావన నేటికీ బలంగా ఉందని, వందేమాతరం మనల్ని ఏకం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గొప్ప నాయకుల కల స్వతంత్ర భారతదేశమైతే, నేటి తరం కల సంపన్న భారతదేశమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం కలను వందేమాతరం స్ఫూర్తి ఎలా పోషించిందో అలాగే సమృద్ధి కలను కూడా పెంపొందిస్తుందని అన్నారు. ఈ భావనతో ముందుకు సాగాలని, స్వావలంబన కలిగిన దేశాన్ని నిర్మించేందుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యానికి 50 సంవత్సరాల ముందు అందరూ స్వేచ్ఛా భారత్‌ గురించి కలలు కన్నట్లే.. 2047కి 25 సంవత్సరాల ముందు మనం కూడా సంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశం గురించి కలలు కనగలమని,  దానిని సాకారం చేయడానికి మనల్ని మనం అంకితం చేసుకోవచ్చని చెప్పారు. ఈ మంత్రం, సంకల్పంతో వందేమాతరం మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుందని, మన రుణాన్ని గుర్తు చేస్తుందని, దాని స్ఫూర్తితో మనల్ని ముందుకు నడిపిస్తూ, ఈ కలను నెరవేర్చడానికి దేశాన్ని ఏకం చేస్తుందని ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ చర్చ దేశాన్ని భావోద్వేగంతో నింపడానికి, దేశానికి స్పూర్తినిచ్చేందుకు కొత్త తరానికి ఉత్తేజపరిచేందుకు ఒక కారణమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.