తెలంగాణ రైజింగ్ కాదు.. సింకింగ్!
తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ సింకింగ్ అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. రేవంత్ ప్రభుత్వాన్ని కమీషన్ల ప్రభుత్వం, కాంట్రాక్టర్ల ప్రభుత్వంగా అభివర్ణించిన ఆయన కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఒరిగింది శూన్యమన్నారు. రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియాలకు అప్పగించారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో ‘సీఎం అండ్ సన్’ మోడల్ ఉండేదని, ఇప్పుడు ‘సీఎం అండ్ బ్రదర్స్’ మోడల్‌గా మారిపోయిందని విరుచుకుపడ్డారు. ”విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడంలేదు? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు? రిటైర్డ్ ఉద్యోగులు తమ హక్కుగా పొందాల్సిన ప్రయోజనాలను ఎందుకు ఇవ్వడం లేదు? యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగ భృతి ఏమైంది? రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వడం లేదు? మహిళలకు రూ.2500 ఆర్థిక భరోసా ఏది?” అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన వైఫల్యాలను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బిజెపి మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో రాంచందర్ రావుతో పాటు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్షనేత ఏవీఎన్ రెడ్డి సహా బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ గల్లంతయిన వాగ్దానాలు, నెరవేరని హామీలపై నిరసించారు. ఈ సందర్భంగా ”రెండేళ్ల ప్రజా వంచన పాలనలో కాంగ్రెస్ వైఫల్యాల చిట్టా” పేరిట చార్జ్ షీట్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. ”తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బిజెపి పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూములను వేలం వేసే పాలసీతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లగచర్ల వంటి ప్రాంతాల్లో ఫార్మాసిటీ పేరిట రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక భూములను భారీ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రైవేట్ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు ధారాదత్తం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించింది. కానీ ఒక్క గ్యారంటీ, ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కాంగ్రెస్ కేవలం మత రాజకీయాలు మాత్రమే చేస్తోంది. హిందువుల దేవీదేవతలను పదే పదే అవమానిస్తోంది. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. హిందువులకు మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారని ఎగతాళి చేసే కాంగ్రెస్ నాయకులకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు- ఈ ముగ్గురే దేవుళ్లు! జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలంటే కాంగ్రెస్’ అని స్పష్టంగా చెప్పారు. అదే హిందువులపై కాంగ్రెస్ తీరును బయటపెట్టింది. అందుకే హిందువులను, దేవతలను రేవంతుద్దీన్ అవమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ కాదు, మజ్లిస్ పార్టీ. రాష్ట్రంలో దేవాలయాల భూములను అక్రమంగా ఆక్రమిస్తుంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మరోవైపు గోసేవకులు, గోరక్షకులపై తుపాకీ కాల్పులు జరిగినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎడ్యుకేషన్, లా, హోం.. ఈ కీలక శాఖలన్నీ సీఎం రేవంత్ దగ్గరే ఉన్నాయి. కాని తెలంగాణలో ఎడ్యుకేషన్ నిల్, లా అండ్ ఆర్డర్ నిల్, శాంతిభద్రతలు పూర్తిగా ఫెయిల్. హైదరాబాద్‌లో బాబ్రీ మసీదు కడతామంటూ మాట్లాడే వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిపోషిస్తోంది. బాబ్రీ మసీదు ఇక్కడ కడతామని వాగుతున్న వారి ఘోరిని ఇక్కడ కడతామని హెచ్చరిస్తున్నాం. ఇంత దారుణంగా, నిర్లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. దేశద్రోహులను పోషించే ప్రభుత్వం ఇది.
మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని నిర్మూలిస్తుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తోంది. మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని అంతం చేస్తూ నక్సలైట్ ముక్త్ భారత్ వైపు దేశాన్ని తీసుకుపోతుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లకు ఆశ్రయం ఇస్తోంది, వారిని పెంచిపోషిస్తోంది. బిజెపి అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలైట్లను పూర్తిగా అంతం చేస్తాం.
కాంగ్రెస్ పార్టీ ‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది?’ అని అడుగుతోంది. వారికి చెబుతున్నాం- జాతీయ రహదారుల విస్తరణ, బీబీనగర్ ఎయిమ్స్, వందేభారత్ రైళ్లు, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, హైదరాబాద్ ఏరోస్పేస్ రంగం అభివృద్ధి, పేదలకు ఉచిత బియ్యం – ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం చేసినవే. అనేక పరిశ్రమలను తెలంగాణకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయకపోయినా బిజెపిని, మోదీ ప్రభుత్వాన్ని నిందించడం మాత్రమే చేసింది. అందుకే బీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి పంపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే దారిలో వెళ్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను కూడా ప్రజలు తిరస్కరిస్తారు.
కేవలం రియల్ ఎస్టేట్ లాభాల కోసం హిల్ట్ పాలసీ తీసుకురావడం అవినీతికి తెరదీయడమే. మూసీ సుందరీకరణ మీద మాకు వ్యతిరేకత లేదు. కానీ ఆ ప్రాజెక్టు డీపీఆర్ ఎక్కడ? ప్రజలకు ఎందుకు చూపడం లేదు? కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా రైతులను లక్ష్యంగా చేసుకుంటోంది. తెలంగాణ విద్యార్థులు, మహిళలు, యువత.. కాంగ్రెస్ మోసాలను బయటపెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి చేస్తున్న ఈ మహా ధర్నా మహా ధర్మయుద్ధంగా మారుతుంది. మన హిందూ దేవతలను అవమానించే, యువత భవిష్యత్తును తాకట్టు పెట్టే, మహిళల రక్షణను కాలరాసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఇంకా ఎందుకు కొనసాగించాలా అనే ప్రశ్న తెలంగాణ ప్రజల్లో మెదులుతోంది. తెలంగాణ ప్రజలారా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని బలంగా కొనసాగిద్దాం. తెలంగాణ ప్రజలు గతంలో బీఆర్ఎస్ నియంతృత్వ పాలన చూశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా వీఆర్ఎస్ లో ఉంది. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన ప్రజావ్యతిరేకత వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసారు. రాబోయే రోజుల్లో బిజెపికి ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నా.” అని అన్నారు.
దమ్ముంటే చర్చకు రా!: కిషన్ రెడ్డి
ధర్నాలో జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ”మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ తన పదేండ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చింది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలపై కుటుంబ పాలన రుద్దింది. బీఆర్ఎస్ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయి. పదేండ్లపాటు ప్రజలపై నియంత పాలన రుద్దారు. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణలో ప్రజలంతా పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో ఎలా బందీ అయిపోయిందో మనం చూశాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలన పట్ల విసిగి వేసారి పోయారు. అనేక రకాల హామీలతో, అభయహస్తాలతో, గ్యారంటీలతో వస్తున్నం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారు. రెండు సంవత్సరాల విజయోత్సవ పాలన పేరుమీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నేను ఒక్కటే సవాల్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు ఏ మొఖం పెట్టుకొని ఈ ఉత్సవాలు చేస్తున్నారని బిజెపి ప్రశ్నిస్తున్నది. మీరు ఇచ్చిన హామీలు ఎన్ని? మీరు అమలు చేసిన పథకాలెన్ని అని నిలదీస్తున్నాను. సీఎం ఎంత సేపు రెండే ముచ్చట్లు చెప్తడు.. ఒక్కటి ఫ్రీబస్సు, ఇంకోటి సన్నబియ్యం. రేవంత్ సర్కారు తాము ఇస్తున్నామని చెప్తున్న ప్రతి కిలో సన్నబియ్యంకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రూ.43 ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.13 మాత్రమే ఇస్తున్నది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేశారు? ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పండి. ఒక్క మార్పు మాత్రం జరిగింది. కేసీఆర్ పోయి రేవంత్.. గులాబీ జెండా పోయి కాంగ్రెస్ జెండా వచ్చింది. పాలనలో మార్పు రాలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంలో మార్పు రాలేదు. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఎలా పెరిగాయో చూస్తున్నాం. వైఎస్సార్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా వెలగబెట్టారు. మళ్లీ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందులో మార్పు వచ్చిందో రాహుల్ గాంధీ చెప్పాలి. ఎట్లాంటి మార్పుతో తెలంగాణలో పాలన అందిస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు, నిరుద్యోగులకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, ఉద్యోగులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా? ఏ విషయంలో మీరు ప్రజాపాలన చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. పోలీసులను అడ్డం పెట్టుకొని గ్రామాల్లో సభలు పెట్టుకొని తిరగడం కాదు.. ఇచ్చిన హామీల అమలు మీద చర్చకు సిద్ధమా? బిజెపి తరఫున సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను. ఈ ఇందిరా పార్క్ వేదికగా చర్చకు వస్తావా? మీ ప్రజాభవన్ లో చర్చకు రావాలా? ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి ముందుకు రావాలి. మా పార్టీ తరఫున ఏ కార్యకర్త అయినా చర్చకు సిద్ధంగా ఉన్నాడు. పంటలపై బోనస్ ఇస్తానని మోసం చేశావు. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు ఏమైనయ్? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కదా. మరి ఎందుకు భర్తీ చేయలేదు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏమైంది? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి? మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు. కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల సాయం చేస్తామన్నారు. ఒక్క కుటుంబానికి కూడా రూ.12 లక్షల సాయం అందలేదు. ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి మార్పు రాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, సంక్షేమ పథకాలు ఇవ్వలేని పరిస్థితి. బీరు, బ్రాంది అమ్మకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఏమైంది? రెండేండ్లు అయినా బెల్ట్ షాపులు ఎందుకు మూసివేయడం లేదు? బెల్టు షాపుల రద్దు అటుంచితే.. మద్యం అమ్మకాలతో లక్ష కోట్లకు పైగా ప్రజల నుంచి దోపిడీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ పూర్తి వైఫల్యం చెందింది. గతంలో బీఆర్ఎస్ చేసినట్లే.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు అవినీతి, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కే పార్టీలే, అక్రమాలకు పెద్దపీట వేసే పార్టీలే. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీల అమలు ఏమైందని కాంగ్రెస్ పాలకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని అన్నారు.
తెలంగాణ సంపదతో దిల్లీకి కప్పం: డా. లక్ష్మణ్
ధర్నాలో డా. కె.లక్ష్మణ్ ప్రసంగిస్తూ.. ”తెలంగాణ రైజింగ్ కాదు. తెలంగాణ రైజింగ్ ఇన్ కరప్షన్! రైజింగ్ ఇన్ గన్ కల్చర్! మత్తు పదార్థాలు, డ్రగ్స్, మద్యపానం వల్ల తెలంగాణ విద్యార్థులు, యువత సహా అనేక మంది భవిష్యత్తు నాశనం అవుతోంది. డ్రగ్స్ ను నియంత్రించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. ఇవాళ తెలంగాణలో శాంతి ఎక్కడ ఉంది? గన్ కల్చర్ పీక్‌కు చేరింది. పట్టపగలు పోలీస్ అధికారిని కూడా కాల్చి చంపే స్థాయికి పరిస్థితి దిగజారింది. అంతేకాకుండా, మంత్రుల సిబ్బందే గన్ కల్చర్‌తో రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. దీన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఆన్‌లైన్ గేమ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా కలిసి తెలంగాణ భవిష్యత్తును కుదిపేస్తున్నాయి. ఇది రైజింగ్ తెలంగాణ కాదు.. మాఫియాల చేతిలో చిక్కుకున్న సింకింగ్ తెలంగాణ.
గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ పరిశ్రమ పూర్తిగా కుప్పకూలింది. అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఆ రంగంపై ఆధారపడే సిమెంట్, స్టీల్ ఇండస్ట్రీ, బ్రిక్ ఇండస్ట్రీ.. అలాగే లేబర్ కార్మికులు దిక్కుతోచని స్థితిలోకి చేరిపోయాయి. ఇప్పటికే హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. ఇవాళ తెలంగాణ సంపదను దోచిపెడుతూ, దిల్లీకి కప్పం కడుతున్న పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు తరాల కోసం ఉంచాల్సిన భూములు, ప్రభుత్వ ఆస్తులు—వాటిని తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?” అని అన్నారు.
భస్మాసుర హస్తం: డి.కె. అరుణ
ధర్నాలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ మాట్లాడుతూ ”రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలతో అభయ హస్తం కాదు.. తెలంగాణ ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టాడు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను ఆరు గ్యారంటీలతో నట్టేట ముంచింది. ప్రజలను అవమానించే పాలన ఇది. విజయోత్సవాలు చేసుకునే అర్హత లేకున్నా.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టాలని జిల్లాలు తిరుగుతూ.. నయవంచన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చూసి ఓటు వేయండి అంటున్నాడు. ఆ అభివృద్ధికి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి బలపర్చిన అభ్యర్థులను గెలిపించండి.శిశుపాలుడి పాపాలను శ్రీకృష్ణుడు లెక్కపెట్టినట్లు.. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలను తెలంగాణ ప్రజలు లెక్కపెడుతున్నారు.” అని అన్నారు.

