musi ppt

పేదల ఇండ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం

musi pptమూసీ ప్రక్షాళనకు బిజెపి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నది శుభ్రపడాలి, నీరు స్వచ్ఛంగా ఉండాలని, అయితే దాని పేరుతో పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. కేవలం పేరుకు ప్రాజెక్టులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని, నదిని పునరుద్ధరించాలంటే సరైన ప్రణాళికతో నీటి ప్రవాహాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అవినీతి జరిగితే, ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ పేరుతో అదే పునరావృతం అవుతుందని ఆరోపించారు. మార్చి 23న ‘మూసీ నది పునరుజ్జీవనం – వాస్తవాలు’ అంశంపై బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు, కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మూసీ నది పునరుద్ధరణపై సాంకేతిక విశ్లేషణ చేస్తూ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న మూసీ ప్రాజెక్టు విధానాలను విశ్లేషిస్తూ, శాస్త్రీయ దృక్కోణంతో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు.

మూసీ నది పునరుజ్జీవనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికల్లో అసలు శాస్త్రీయ దృష్టికోణం కనిపించడం లేదని వెదిరె శ్రీరామ్ తెలిపారు. రివర్ రిజువినేషన్ అంటే నదిని ఒక జీవ వ్యవస్థగా పునరుద్ధరించడం కాగా, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే కేవలం సుందరీకరణ మాత్రమేనని చెప్పారు. జీవం లేని నదిపై కేవలం అలంకరణ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ముందుగా నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అత్యవసరమని స్పష్టం చేశారు. నదిలో చేపలు జీవించగలగడం, నీటి నాణ్యత మెరుగుపడడం వంటి సూచికల ద్వారా మాత్రమే పునరుజ్జీవనం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. నది అంటే కేవలం పైన ప్రవహించే నీరు మాత్రమే కాదు, భూమి కింద ఉన్న పాలియో ఛానల్స్, భూగర్భ జలాలు, సెడిమెంట్ ప్రవాహం, సీజనల్ మార్పులు, రైపేరియన్ జోన్ వంటి అంశాల సమగ్ర వ్యవస్థ అని వెదిరె శ్రీరామ్ వివరించారు. నీరు-భూమి కలిసే ప్రాంతమైన రైపేరియన్ జోన్ నది ఆరోగ్యానికి అత్యంత కీలకమని, అక్కడ ఫిల్ట్రేషన్, జీవవైవిధ్యం, హ్యాబిటాట్ సపోర్ట్ జరుగుతుందని చెప్పారు. ఈ సహజ వ్యవస్థలను విస్మరించి కాంక్రీట్ నిర్మాణాలపై మాత్రమే దృష్టి పెట్టడం నది జీవ వ్యవస్థకు హానికరమని ఆయన హెచ్చరించారు.

మూడు దశల సమగ్ర ప్రణాళిక

మూసీ నది పునరుజ్జీవనం కోసం మొత్తం నది ప్రవాహాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించి విశ్లేషించారు:

(A) అప్పర్ స్ట్రెచ్ (దాదాపు 90 కి.మీ – అనంతగిరి హిల్స్ నుండి)

ఈ ప్రాంతంలో క్యాచ్‌మెంట్ ఏరియా ట్రీట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని వెదిరె శ్రీరామ్ వెల్లడించారు. చిన్న వాగులు, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ పునరుద్ధరించకుండా ప్రధాన నది పునరుజ్జీవనం అసాధ్యమని పేర్కొన్నారు. రిడ్జ్ టు వ్యాలీ విధానంలో చెక్ డ్యామ్‌లు, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, పెర్కొలేషన్ ట్యాంకులు, బరాజ్‌లు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేసిన అనుభవం ఉందని తెలిపారు.

(B) సిటీ స్ట్రెచ్ (దాదాపు 55 కి.మీ – హైదరాబాద్ ప్రాంతం)

నగర ప్రాంతంలో ప్రధాన సమస్య సివరేజ్ కాలుష్యమని పేర్కొన్నారు. సివరేజ్ నీరు నదిలోకి చేరకుండా ఇంటర్సెప్టర్ వ్యవస్థలు ఏర్పాటు చేసి, కేవలం శుద్ధి చేసిన నీటినే విడుదల చేయాలని సూచించారు. బఫర్ జోన్ విషయంలో శాస్త్రీయ విధానం అనుసరించాలని, నది సహజ ప్రవాహ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు మాత్రమే తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. నది బెడ్‌లో ఉన్న పరిమిత ఆక్రమణలను రీహాబిలిటేషన్ ద్వారా పరిష్కరించవచ్చని, విస్తృతంగా ప్రజలను నిరాశ్రయులను చేయడం సరైంది కాదని తెలిపారు.

(C) డౌన్ స్ట్రీమ్ (దాదాపు 120 కి.మీ – నల్గొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలు)

నగర కాలుష్యం దిగువ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, నీటి నాణ్యత క్షీణించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని పేర్కొన్నారు. నీరు, పాలు, పంటల నాణ్యతపై ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాల్లో డీసిల్టేషన్, వెట్‌ల్యాండ్స్ అభివృద్ధి, సహజ శుద్ధి విధానాలు అమలు చేయడం ద్వారా నీటి నాణ్యత మెరుగుపరచాలని సూచించారు. రైతులు పండించే పంటలు స్వచ్ఛంగా ఉండే స్థితి రావడమే నిజమైన మూసీ పునరుజ్జీవనం విజయమని స్పష్టం చేశారు.

పాలన, పారదర్శకత

మూసీ నది మొత్తం పరివాహక ప్రాంతాన్ని ఒకే వ్యవస్థ కింద నిర్వహించడానికి ‘మూసీ రివర్ బేసిన్ అథారిటీ’ ఏర్పాటు చేయాలని సూచించారు. వికారాబాద్ నుంచి కృష్ణా నది వరకు మొత్తం నదిపై ఒక సమగ్ర బేసిన్ ప్లాన్ ఉండాలని తెలిపారు. నీటి నాణ్యతపై BOD, DO వంటి పరామితులను రియల్ టైమ్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, పారదర్శక డేటా ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్లో, పొల్యూషన్ లిమిట్స్, దీర్ఘకాలిక ప్రణాళికలతో నది పునరుద్ధరణ జరగాలని సూచించారు.

నది పునరుజ్జీవనం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని వెదిరె శ్రీరామ్ తెలిపారు. నమామి గంగే, సబర్మతి వంటి ప్రాజెక్టుల్లో చేసినట్లుగా విస్తృత ప్రజాభిప్రాయం, నిపుణుల సూచనలు, కాలనీ/వార్డు స్థాయిలో చర్చలు జరిపి, అందరి భాగస్వామ్యంతో ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. మొత్తంగా మూసీ నది పునరుజ్జీవనం అనేది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ కాదు.. ఇది ఒక సమగ్ర పర్యావరణ, సామాజిక, శాస్త్రీయ ప్రక్రియ అని వెదిరె శ్రీరామ్ తెలిపారు. నది పునరుజ్జీవనం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. నమామి గంగే, సబర్మతి వంటి ప్రాజెక్టుల్లో చేసినట్లుగా కాలనీ, వార్డు స్థాయిలో ప్రజలతో, నిపుణులతో, సంస్థలతో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. వేల సంఖ్యలో కన్సల్టేషన్లు జరిపి, అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ అమలు చేయాలని అన్నారు. మూసీని ముందుగా జీవంతో నింపడం, శాస్త్రీయంగా పునరుద్ధరించడం అసలు పరిష్కారమని వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కే పరిమితం కాదు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ..”మూసీ నది అంటే కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదు. ఇది వికారాబాద్ జిల్లా నుంచి ప్రారంభమై, నల్గొండ, సూర్యాపేట జిల్లాల గుండా ప్రవహించి చివరికి కృష్ణా నదిలో కలుస్తుంది. దాదాపు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నది పక్కన వేలాది మంది రైతులు పంటలు పండిస్తున్నారు. కానీ పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఈ నది నీటితో పండుతున్న పంటలు కూడా విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. ఇది రైతుల ఆరోగ్యానికి, వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు. అందుకే మూసీ శుద్ధి అంటే కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు.. ఇది మొత్తం దక్షిణ తెలంగాణకు సంబంధించిన అత్యంత కీలక అవసరం. నది పుట్టుక నుంచి చివరి వరకు సమగ్రంగా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలంటే ఇది తప్పనిసరి.

మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్లు?

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వాతంత్ర్యానికి ముందు వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నప్పుడు, నదుల అనుసంధానం (River Linking) గురించి దూరదృష్టితో ఆలోచించారు. ఆయన ఆలోచనల ఆధారంగానే సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి కీలక సంస్థలు ఏర్పడ్డాయి. అంటే భారతదేశంలో నీటి నిర్వహణలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. కాబట్టి, మూసీ నది శుద్ధి అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు — ఇది మన భవిష్యత్తుకు పెట్టుబడి. మన ఆరోగ్యానికి, రైతుల జీవనానికి, తెలంగాణ అభివృద్ధికి ఇది అత్యవసరం. నదుల అనుసంధానం గురించి అటల్ బిహారీ వాజ్‌పేయి ముందుగానే ఆలోచించారు. ఆ స్ఫూర్తితో గుజరాత్‌లో నర్మదా-సబర్మతి అనుసంధానం చేసి, సబర్మతి నదిని పునరుద్ధరించారు. అక్కడ కూడా డిస్‌ప్లేస్మెంట్ జరిగింది కానీ వారికి సరైన పునరావాసం కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ ద్వారా వేల కిలోమీటర్ల గంగానదిని శుద్ధి చేయడానికి సుమారు రూ.20,000 కోట్ల వ్యయం చేశారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రానికి పెన్షన్లు ఇవ్వడానికి, రైతు భరోసా అమలు చేయడానికి డబ్బులు లేవు అంటున్న ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తుంది? ఈ అప్పుల భారం చివరికి తెలంగాణ ప్రజలపైనే పడుతుంది.

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మొదట రూ.5,000 కోట్లుగా చెప్పి, కొన్ని రోజుల్లోనే రూ.7,000 కోట్లకు పెంచారు. ఖర్చులపై స్పష్టత లేదు. విగ్రహాలు నిర్మించడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పేదల ఇళ్లు కూల్చి వాటి మీద ప్రాజెక్టులు లేదా విగ్రహాలు నిర్మించడం అన్యాయం. అలాంటి చర్యలను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఎక్కడైనా డిస్‌ప్లేస్మెంట్ జరిగితే ముందుగా రీహాబిలిటేషన్ చేయాలి. కానీ ఇక్కడ ‘ముందు కూల్చి, తర్వాత ఇస్తాం’ అనే విధానం కనిపిస్తోంది. ఇది పూర్తిగా అన్యాయం. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో 10 వేల ఇండ్లు కూల్చుతామని అంటోంది, మరోవైపు కాంగ్రెస్ మంత్రి అసెంబ్లీలో 1,400 ఇండ్లు మాత్రమే అంటున్నారు. అసలు నిజం ఏది? ప్రజలు ఎవరిని నమ్మాలి?

బఫర్ జోన్ సామాన్యులకేనా?

అమెరికాలో చికాగో నగరంలో ఉన్న సరస్సులు, ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్ ప్రాంతంలోని నదులు, న్యూయార్క్–న్యూజెర్సీ మధ్య ప్రవహించే నదులు, లండన్‌లో థేమ్స్ నది, పారిస్‌లో సీన్ నది.. ఇవన్నీ నదుల పక్కనే అభివృద్ధి జరిగి కూడా, నదులను కాపాడిన ఉదాహరణలు. ఆ నగరాల్లో నదుల పక్కనే భవనాలు, టూరిజం కార్యకలాపాలు జరుగుతున్నాయి. కానీ అక్కడ బఫర్ జోన్ పేరుతో ప్రజలను బహిష్కరించడం జరగలేదు. అయితే ఇక్కడ మాత్రం 12 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఒకే నదికి ఒకే విధానం ఉండాలి. ఒకచోట ఒకలా, మరోచోట మరోలా ఎందుకు? నార్సింగి ప్రాంతంలో పెద్ద నిర్మాణాలకు బఫర్ జోన్ వర్తించకపోతే, మధు పార్కు రిడ్జ్ సాధారణ ప్రజల ఇళ్లకు మాత్రం ఎందుకు వర్తిస్తోంది? ఎక్స్ సర్వీస్ మెన్లు, మధ్యతరగతి కుటుంబాలు రుణాలు తీసుకుని, కష్టపడి ఇళ్లు కట్టుకుని EMIలు చెల్లిస్తుంటే, వారిని 50 మీటర్ల బఫర్ జోన్ పేరుతో బయటకు పంపించడం అన్యాయం. ఒకచోట బఫర్ జోన్ లేకుండా అనుమతులు ఇస్తూ, మరోచోట ప్రజలను డిస్‌ప్లేస్ చేయడం పూర్తిగా వివక్షపూరిత విధానం. దాదాపు 3,000 ఎకరాల భూమి స్వాధీనం చేసుకునే పరిస్థితి వస్తే, రైతుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుంది. మూసీ పరివాహక ప్రాంతంలో పండించే కూరగాయలే హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయి. ఆ భూములు రైతులకు ఇచ్చిన పంట భూములు. అక్కడి రైతులు వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల వారి జీవితం ప్రభావితం అవుతుంది. మూసీ పరివాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వరకు బఫర్ జోన్ పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు.ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఇంప్రాక్టికల్‌గా కనిపిస్తోంది.” అని అన్నారు.