Assembly Muttadi

అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ సర్కార్

Assembly Muttadiధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల వేళ అన్ని వర్గాలను మభ్యపెట్టి, ఇప్పుడు వారిని నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు. అందుకే, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టామన్నారు. మార్చి 23న బిజెపి తెలంగాణ చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ ఉద్రిక్తంగా మారింది. ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నించింది. పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు తెగబడింది. జిల్లాల నుంచి వస్తున్న వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధాలను దాటుకొని బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పోలీసుల కళ్లు గప్పి, ఒక సామాన్యుడిలా ఆటోలో వెళ్లి అసెంబ్లీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. నలుదిక్కుల నుంచి వచ్చిన వేలాది బిజెపి కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. కాంగ్రెస్ సర్కార్‌ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీ సాక్షిగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘6 గ్యారంటీలు ఎక్కడ?’ అంటూ నిలదీశారు. రేవంత్ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా, వైద్య రంగాలకు సరిగ్గా నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి మొండిచేయి చూపుతారా అంటూ మండిపడ్డారు. బారికేడ్లు దాటి దూసుకెళ్తోన్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన బిజెపి శ్రేణులను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారు. రాంచందర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. గౌతం రావును అఫ్జల్‌గంజ్ పీఎస్‌కు, వీరేందర్ గౌడ్‌ను బొల్లారం పీఎస్‌కు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డిని అంబర్‌పేట్ పీఎస్‌కు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ ను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని పోలీసు స్టేషన్లన్నీ బిజెపి నాయకులు, కార్యకర్తల అరెస్టులతో నిండిపోయాయి.

ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, మిగతా గ్యారంటీలన్నింటినీ పక్కనబెట్టి, అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతు, యువ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్లు విడుదల చేసి, లక్షలాది కుటుంబాలను నమ్మించింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ గ్యారంటీల అమలు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలో రైతులకు ఇంకా రైతు భరోసా కింద ఎకరానికి రూ.45,000 వరకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. దీని వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు, మహిళల పెన్షన్లు, రిటైర్డ్ ఉద్యోగుల విరమణ ప్రయోజనాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మేం ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున ప్రశ్నించడానికి, వారి వాణిని వినిపించడానికి బిజెపి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టాం. అయితే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనం. దాదాపు 9 పోలీస్ స్టేషన్లలో 800కు పైగా బిజెపి కార్యకర్తలను, అందులో 150 మంది మహిళలు, యువమోర్చా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే బిజెపి నాయకులను గృహనిర్బంధం చేశారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వేలాది కార్యకర్తలను మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మేం తెలంగాణ ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను నిలదీసి ఎండగట్టేందుకు అసెంబ్లీ ముట్టడి చేపట్టాం. మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత నిలదీస్తాం. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలు, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అని అన్నారు.

కమిషన్ల మీదే శ్రద్ధ : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా సీనియర్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అభద్రతాభావానికి అద్దంపడుతోంది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న బిజెపి నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది? ‘ప్రజా పాలన’ పేరుతో యువత, రైతులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాలను నిట్టనిలువునా మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కారుకు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమం పై ఏమాత్రం లేదనేది సుస్పష్టం. రేవంత్ సర్కార్ అసమర్థ పాలనపై బిజెపి పోరాటం ఆగదు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలకులను గద్దె దించే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.

-జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

నిరసన తెలిపితే అరెస్టులా? : బండి సంజయ్ 

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు అరెస్ట్ దుర్మార్గం. 6 గ్యారంటీల అమలుపై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ను ఏం చేయాలి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలైనా 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం సిగ్గుచేటు. ఓట్ల కోసం, అధికారం కోసం ఎంతకైనా దిగజారే నైజం కాంగ్రెస్ దేనని తేలిపోయింది. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని మరింత దివాళా తీస్తున్నారు.

-కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

అరెస్టులతో గొంతు నొక్కలేరు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

6 గ్యారంటీల అమ‌లు ఏమైంద‌ని ప్ర‌శ్నించిన రాంచంద‌ర్ రావును అరెస్టు చేయ‌డం కాంగ్రెస్ స‌ర్కారు సాగిస్తున్న నిర్భంధ పాల‌న‌కు నిద‌ర్శ‌నం. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లెవ‌రూ ప్ర‌శ్నించ‌రాద‌నేలా ప్ర‌భుత్వం సాగిస్తున్న నియంత‌ృత్వ పోక‌డ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాత‌నైతే రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం బిజెపి లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాలి, కానీ అరెస్టుల‌తో గొంతులు నొక్క‌లేరు. రేవంత్ ప్ర‌భుత్వం ఇలాగే అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తే కేసీఆర్ స‌ర్కారుకు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంది.

-ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనసభ పక్షనేత