అస్థిర ప్రపంచంలోనూ సుస్థిరంగా మోదీ భారత్
ప్రపంచమంతా అలజడితో అట్టుడుకుతున్నప్పుడు ఒక దేశం ప్రశాంతంగా ఉందంటే ఆ దేశ పగ్గాలు ఒక అత్యంత సమర్థుడైన స్థితప్రజ్ఞుడి చేతిలో ఉన్నాయని అర్థం. ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఇలాంటి నాయకత్వాన్ని చూస్తోంది. అగ్రరాజ్యం అమెరికా–ఇజ్రాయెల్ కూటమికీ, ఇరాన్‌కూ మధ్య రేగిన యుద్ధజ్వాలలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచానికి అవసరమైన ఇంధనంలో సింహభాగాన్ని సరఫరా చేసే గల్ఫ్ దేశాలు నేడు యుద్ధ క్షేత్రాలుగా మారడంతో చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఈ సంక్షోభం వల్ల అగ్రరాజ్యం అమెరికా నుంచి మన పొరుగున ఉన్న శ్రీలంక వరకు అన్నీ అతలాకుతలం అవుతున్నాయి. కానీ, ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 147 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం ఎంతో నిబ్బరంగా, సురక్షితంగా ఉంది. దానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ముందుచూపు, సాహసోపేత నిర్ణయాలే.
యుద్ధం కారణంగా నేడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్వయంగా అమెరికాలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 25 శాతానికి పైగా పెరిగాయి. యూరప్ దేశాల పరిస్థితి వర్ణనాతీతం. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇప్పుడు ఈ గల్ఫ్ సంక్షోభం యూరప్‌ను ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసింది. అక్కడ పరిశ్రమలు మూతపడుతున్నాయి, గృహ వినియోగానికి గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొంది. మన పొరుగు దేశాల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. పాకిస్థాన్ ఇప్పటికే దివాలా అంచున నిలబడింది. విదేశీ మారకద్రవ్యం లేక చమురు నౌకలను రేవుల్లోకి రప్పించుకోలేని దైన్యం ఆ దేశానిది. ఇక శ్రీలంక, నేపాల్ తదితర దేశాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి అల్లర్లు చేసే స్థితికి చేరుకున్నారు.
ప్రపంచవ్యాప్త ఆర్థిక, భౌగోళిక అస్థిరతల నడుమ, 4 ట్రిలియన్ డాలర్ల .జీడీపీతో భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తూ అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. 2026 నాటికి ~6% కు పైగా వృద్ధి రేటును, అలాగే 2050 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సూచనలతో, ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆశాకిరణంగా మారుతోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య, భారతదేశం 2026 ఆర్థిక సంవత్సరంలో 7.3% – 7.4% వరకు బలమైన జీడీపీ వృద్ధిని సాధిస్తుందని అంచనా, ఇది దేశీయ ఆర్థిక స్థిరత్వాన్ని చూపుతుంది. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ.., శాంతి, సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న భారతీయుల కోసం నిరంతర సహాయక చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా 3.75 లక్షల మందికి పైగా సురక్షితంగా స్వదేశం చేరారు. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాను కొనసాగించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దేశీయంగా 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. $709 బిలియన్ల భారీ విదేశీ మారక నిల్వలు ఎలాంటి పరిస్థితిని అయినా తట్టుకునేలా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసింది. ప్రపంచం అస్థిరత, సంక్లిష్టతతో ఇబ్బంది పడుతున్నా, భారత్ తన జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి సమర్థవంతంగా ఎదుర్కొంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల దిశగా దూసుకుపోతున్న తరుణంలో భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి అత్యంత తెలివైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే, రష్యా నుంచి తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా అదుపులో ఉంచడానికి సహకరించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై పడే ఆర్థిక భారాన్ని ప్రజలపైకి నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి సామాన్యుడికి రక్షణ కల్పిస్తోంది. సంక్షోభ సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, మోదీ ప్రభుత్వం కష్టకాలంలో దేశానికి వెన్నుదన్నుగా నిలబడి, ప్రజలకు ఒక పటిష్టమైన ఆర్థిక రక్షణ కవచాన్ని నిర్మించింది. ఇదిలా ఉంటే, దేశంలోను, విదేశాల్లోనూ రోజురోజుకు పెరుగుతున్న మోదీ ఆదరణను ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలను, అనవసర రాద్ధాంతాలను సృష్టించేందుకు కుట్రపూరితంగా విష ప్రచారాలకు తెగబడుతున్నాయి. అయితే, ప్రజలెవరూ వీరి దుష్ప్రచారాలను నమ్మకపోవడంతో ప్రతిపక్షాలు మరింత చులకన అవుతున్నాయి.
ప్రపంచం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే సమర్థవంతమైన మోదీ నాయకత్వంలోని భారతదేశం మాత్రం సుస్థిరంగా నిలబడింది. ఇప్పుడు మాత్రమే కాదు, కరోనా విపత్తును సైతం దేశం సమర్థంగా ఎదుర్కొంది. 140 కోట్ల జనాభా గల భారతదేశం కరోనా కోరల్లో విలవిల్లాడడం ఖాయమన్న పరిశీలకుల అంచనాలు పూర్తిగా తప్పని మోదీ ప్రభుత్వం నిరూపించింది. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనయినా సరే సమర్థంగా ఎదుర్కోగల దేశంగా భారత్ ఎదిగింది. అలాంటి దేశాన్ని నిర్మించిన మోదీ నాయకత్వం దేశానికి వరం.

