Ugadi at BJP Office

రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

మార్చి 19న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సహా బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉగాది పచ్చడి సేవించారు. ‘పంచాంగ శ్రవణం’లో పండితుడి పంచాంగాన్ని ఆసక్తిగా విన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఈ తెలుగు నూతన సంవత్సరం సుఖశాంతులను, అభివృద్ధిని చేకూర్చాలని రాంచందర్ రావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ప్రపంచం సాంకేతిక రంగంలో వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో G20 దేశాల్లో గ్యాస్ ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. కానీ, భారతదేశంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత దౌత్య నీతి వల్ల ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత ఎక్కడా లేదు. కమర్షియల్ గ్యాస్ విషయంలో ఉన్న స్వల్ప (30-40%) కొరత కూడా దిగుమతి చేసుకున్న నౌకలు రాకతో త్వరలోనే పూర్తిగా పరిష్కారమవుతుంది. దేశంలో గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలను ముందే ఊహించిన మోదీ ప్రభుత్వం, అత్యవసర పరిస్థితుల కోసం వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో (SPR) దాదాపు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును సిద్ధంగా ఉంచింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేశ అవసరాలకు ఎక్కడా డోకా లేదు.ప్రపంచవ్యాప్త యుద్ధ పరిస్థితులను దీటుగా ఎదుర్కొని, దేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకునే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.” అని అన్నారు. 

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ”’పరాభవం’ అనే పదం మనకు కాదు, మన దేశానికి కాదు.. అది శత్రువులకు, దేశద్రోహులకు మాత్రమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పరాభవ నామ సంవత్సరం మనకు శుభఫలితాలనే అందించబోతుంది. మంచి వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండుతాయి. ప్రజలు సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. ఏవైనా సమస్యలు ఎదురైనా, వాటిని అధిగమించే శక్తి మనకు ఉంది. మన దేశంలోని 140 కోట్ల ప్రజలు ఐక్యంగా నిలబడి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ సమస్యనైనా విజయవంతంగా ఎదుర్కొనే విశ్వాసం కలిగి ఉన్నారు. ఉగాది సందర్భంగా మనం తీసుకునే పచ్చడిలో తీపి, చేదు, పులుపు వంటి అన్ని రుచులు ఉంటాయి. ఇది మన జీవితానికి ప్రతీక. జీవితంలో కూడా సుఖాలు, దుఖాలు, సమస్యలు, ఆనందాలు అన్నీ కలగలిసే ఉంటాయి. వాటిని ఐక్యతతో, సహనంతో ఎదుర్కోవడమే ఉగాది సందేశం. ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధాలు, ఆర్థిక సమస్యలు, శాంతి భద్రతల సమస్యలతో బాధపడుతున్నాయి. కానీ మన భారతదేశం మాత్రం సమర్థవంతమైన నాయకత్వంతో, అభివృద్ధి దిశగా నిరంతరం ముందుకు సాగుతోంది. ఇది మనకు గర్వకారణం.” అని అన్నారు.